MLC Kavitha-Ed Investigation: మళ్లీ విచారణ.. సమన్లు జారీ చేసిన ఈడీ

21 Mar, 2023 01:34 IST|Sakshi
ఈడీ విచారణ అనంతరం తిరిగివెళ్తున్న ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కవితకు సమన్లు జారీ చేసిన ఈడీ 

సోమవారం సుదీర్ఘంగా విచారించిన అధికారులు 

సౌత్‌ గ్రూప్‌ లావాదేవీలపై ఆరా 

హోటళ్లలో భేటీ ఆరోపణలపైనా ప్రశ్నలు 

కేజ్రీవాల్, సిసోడియాతో ఏం చర్చించారని అడిగిన ఈడీ 

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు మంగళవారం ఉదయం మళ్లీ విచారించనున్నారు. ఈ మేరకు ఈడీ సమన్లు జారీ చేసింది. కాగా ఈ కేసుకు సంబంధించి తొలిసారిగా ఈ నెల 11న కవితను విచారించిన ఈడీ అధికారులు, రెండోసారి సోమవారం సుదీర్ఘంగా ప్రశ్నించారు.

11న జరిగిన విచారణకు కొనసాగింపుగా పలు అంశాలపై ప్రశ్నించినట్లు తెలిసింది. ముఖ్యంగా సౌత్‌ గ్రూపు లావాదేవీలు, ఈ కేసులో నిందితులుగా ఉన్న వారితో హైదరాబాద్, ఢిల్లీ హోటళ్లలో సమావేశమయ్యారనే ఆరోపణలపై ప్రశ్నించినట్లు తెలిసింది.  

కవిత ఒక్కరినే..! 
ఉదయం కవిత బినామీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అరుణ్‌ పిళ్లైతో కలిపి, ఆ తర్వాత ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా, ఆప్‌ కమ్యూనికేషన్ల ఇన్‌చార్జి విజయ్‌ నాయర్‌లతో కలిపి విచారించారనే వార్తలు వచ్చినప్పటికీ.. కవిత ఒక్కరినే ప్రశ్నించినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. అరుణ్‌ పిళ్లైనుంచి పదిసార్లకు పైగా వాంగ్మూలాలు సేకరించిన ఈడీ.. ఆయా వాంగ్మూలాల్లో కవిత ప్రస్తావన ఉన్న అంశాలపై ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం.

మద్యం వ్యాపారంలో పిళ్‌లై వాటా 32.5 శాతానికి గానూ ఎంత పెట్టుబడి పెట్టారు? కిక్‌ బ్యాక్‌ల రూపంలో వెనక్కి ఏ మేరకు వచ్చింది? పిళ్లైతో కలిసి ఇతర రాష్ట్రాల్లోనూ వ్యాపారం విస్తరించాలనుకోవడం? తదితర ప్రశ్నలు వేసినట్లు తెలిసింది. ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించి సీఎం కేజ్రీవాల్, నాటి డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాలతో ఏయే అంశాలు చర్చించారని కూడా అడిగినట్లు సమాచారం. ఢిల్లీ, హైదరాబాద్‌ హోటళ్ల నుంచి తెప్పించిన పలు రికార్డులు ముందుపెట్టి, ఆయా సమావేశాల్లో ఏమేం మాట్లాడారని ప్రశ్నించినట్లు తెలిసింది.  

తీహార్‌ జైలుకు పిళ్‌లై  
కస్టడీ ముగియడంతో పిళ్లైను ఈడీ అధికారులు సోమవారం మధ్యాహ్నం రౌజ్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి అనుమతించారు. దీంతో అధికారులు పిళ్‌లైను తీహార్‌ జైలుకు తరలించారు.  

ఈడీకి నోటీసులు 
తన కుమారుడిని పాఠశాలలో చేర్చేందుకు తల్లిదండ్రులు హాజరు కావాల్సి ఉన్నందున బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ అభిషేక్‌ బోయినపల్లి దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్‌ 12కు వాయిదా వేసింది.       

మరిన్ని వార్తలు