సింగరేణిలో దూకుడుగా సాగాలి

13 Jul, 2021 01:34 IST|Sakshi

సోషల్‌మీడియాలో కీలకపాత్ర పోషించాలి 

విపక్ష యూనియన్ల ఆరోపణలకు సమాధానం చెప్పాలి 

యువతను రిక్రూట్‌ చేసుకోవాలి 

టీబీజీకేఎస్‌ నాయకులతో సంఘం గౌరవాధ్యక్షురాలు కవిత 

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ‘సింగరేణిలో దూకుడుగా ముందుకెళ్లాలి.. పోటీ యూనియన్ల సోషల్‌ మీడియాకు దీటుగా సమాధానం ఇవ్వాలి.. యువతను యూనియన్‌లో చేర్చుకోవాలి’అని టీబీజీకేఎస్‌ గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత యూనియన్‌ నేతలను ఆదేశించారు. సింగరేణి సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికల నేపథ్యంలో సోమవారం ఆమె హైదరాబాద్‌లోని తన నివాసంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌) అధ్యక్షుడు బి.వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, ఇటీవలే యూనియన్‌లో చేరిన మాజీ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్యతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా రాబోయే గుర్తింపు సంఘం ఎన్నికలపై కీలక సూచనలు చేశారు. కార్మికుల పెండింగ్‌ సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రతిపక్ష యూనియన్ల ఆరోపణలు, విమర్శలను తిప్పికొట్టాలని ఆదేశించారు. సింగరేణిలో పనిచేసే యువతను యూనియన్‌లో చేర్చుకునే కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టాని నేతలకు చెప్పారు. కాగా, ప్రతీ యూనియన్‌ సోషల్‌ మీడియాను ఉపయోగిస్తున్న నేపథ్యంలో టీబీజీకేఎస్‌ తరఫున బలమైన సామాజిక మాధ్యమాన్ని రూపొందించాలని నాయకులకు కవిత సూచించారు. దీనికోసం యువతతో ప్రత్యేక విభాగాన్ని రూపొందించాలని చెప్పారు.  

మల్లయ్యకు పదవిపై సస్పెన్స్‌ 
యూనియన్‌ మీద అలకతో టీబీజీకేఎస్‌కు రాజీనామా చేసి బీఎంఎస్‌లో చేరిన కెంగర్ల మల్లయ్య ఇటీవల మంత్రి కేటీఆర్‌ సమక్షంలో తిరిగి టీబీజీకేఎస్‌లో చేరారు. కాగా, ఈ సమావేశంలో ఆయనకు పదవి ప్రకటిస్తారని ఆశించారు. కానీ.. దానిపై ఎలాంటి ప్రస్తావన లేకుండానే సమావేశం ముగిసినట్లు సమాచారం. ఈ ఏడాది సెప్టెంబర్‌లోగా> గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో యూనియన్‌ శ్రేణులను ఎన్నికలకు సమాయత్త పర్చేందుకు ఈ భేటీ నిర్వహించినట్లు భావిస్తున్నారు. 

మరిన్ని వార్తలు