ఎమ్మెల్సీగా కవిత ప్రమాణ స్వీకారం 

30 Oct, 2020 01:11 IST|Sakshi
కవితతో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయిస్తున్న మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి

మండలిలో ప్రమాణ స్వీకారం చేయించిన మండలి చైర్మన్‌ గుత్తా 

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా నుంచి తరలివచ్చిన ప్రజా ప్రతినిధులు 

సాక్షి,హైదరాబాద్‌: శాసన మండలి సభ్యురాలిగా నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటా నుంచి ఎన్నికైన కల్వకుంట్ల కవిత శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి చాంబర్‌లో గురువారం మధ్యాహ్నం 12.45కు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో పాటు, ఉమ్మడి నిజామాబాద్‌కు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వెంట వచ్చారు. ప్రమాణ స్వీకారం అనంతరం కవితను మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అభినందించగా, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి రూల్స్‌ బుక్‌ను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డితోనూ కవిత మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఎమ్మెల్సీగా తనకు అవకాశం కల్పించిన పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులకు కవిత ధన్యవాదాలు తెలిపారు. 

స్థానిక ప్రజా ప్రతినిధులతో భేటీ 
ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన తర్వాత పబ్లిక్‌ గార్డెన్స్‌లో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులతో కవిత మండలాల వారీగా కలసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మహమూద్‌ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్, చీఫ్‌ విప్‌ బోడ కుంటి వెంకటేశ్వర్లు, మేయర్‌ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యేలు భాస్కర్‌ రావు,జీవన్‌ రెడ్డి, డా.సంజయ్‌ కుమార్, గణేశ్‌ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, షకీల్‌ అహ్మద్, ఎంపీ కేఆర్‌ సురేశ్‌ రెడ్డి, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌ ,శేరి శుభాష్‌ రెడ్డి, ఫరూక్‌ హుస్సేన్, ఆకుల లలిత, అసెంబ్లీ సెక్రెటరీ నర్సింహా చార్యులు, నల్లగొండ జెడ్పీ చైర్మన్‌ బండ నరేందర్‌ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు హాజరయ్యారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా