బోగస్ పెళ్లిళ్లు 90‌!

19 Dec, 2020 08:08 IST|Sakshi

నిర్ధారించిన జిల్లా యంత్రాంగం 

ముగిసిన మూడేళ్ల కల్యాణలక్ష్మి దరఖాస్తుల పరిశీలన

మూడు బోగస్‌ పెళ్లిళ్ల డబ్బులు రికవరీ 

87 దరఖాస్తుల డబ్బులు రికవరీ అయ్యేనా?

ఆదిలాబాద్ ‌అర్బన్‌: జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కల్యాణలక్ష్మి స్కాంలో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. కలెక్టర్‌ ఆదేశాల మేరకు మూడేళ్లుగా వచ్చిన కల్యాణలక్ష్మి దరఖాస్తులను పరిశీలించిన తహసీల్దార్లు 90 పెళ్లిళ్లకు సంబంధించిన దరఖాస్తులు బోగస్‌గా ఉన్నాయని గుర్తించారు. ఒకసారి కల్యాణలక్ష్మి డబ్బులు తీసుకోగా మళ్లీ అవే ఫొటోలతో రెండోసారి దరఖాస్తు చేసినట్లుగా పరిశీలనలో తేలింది. మావల మండలానికి చెందిన మూడు బోగస్‌ దరఖాస్తులకు సంబంధించి డబ్బుల రికవరీ చేయగా, నాలుగు మండలాల పరిధిలోని 87 బోగస్‌ పెళ్లిళ్లకు సంబంధించి డ బ్బులు రికవరీ చేసే పనిలో అధికారులు నిగమ్నమయ్యారు.

బోగస్‌ లబ్ధిదారులు, మధ్యవర్తుల  బ్యాంకు ఖాతాలను నిలిపివేయాలని కలెక్టర్‌ ఇది వరకే ఎల్డీఎంను ఆదేశించారు. అయితే బోగస్‌దారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు అలానే ఉన్నాయా? లేక డ్రా చేశారా? డ్రా చేస్తే ఆ డబ్బులు ఎలా.. ఎప్పుడు రికవరీ చేయాలనే దానిపై అధికారులు సమాలోచన చేసి ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో యంత్రాంగం తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది.  
(చదవండి: చిచ్చురేపిన క్రికెట్‌.. కాల్పుల కలకలం)

ఈ ఏడాదిలోనే జరిగిందా?
రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను 2016లో ప్రారంభించి మొదట రూ.50,116 ఆడపిల్లల పెళ్లిళ్లకు సాయంగా అందించింది. దానిని 2018 ఏప్రిల్‌లో రూ.1,00,116కు పెంచింది. ఏటా వేల సంఖ్యలో వివాహాలు జరగడం, పథకానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవడం లాంటివి జరుగుతున్నాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నా.. మూడు సెట్ల జిరాక్స్‌ కాపీలను తహసీల్‌ కార్యాలయంలో అందజేయడం తప్పనిసరి. కాని అలా జరగలేదు. అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్న వారి దరఖాస్తులు మాత్రమే మ్యానువల్‌గా తహసీల్‌ ఆఫీసులకు అందాయి. బోగస్‌ పెళ్లిళ్లకు సంబంధించిన మ్యానువల్‌ దరఖాస్తులు తహసీల్దార్ల కార్యాలయాలకు రాలేదని అధికారులు గుర్తించినట్లు సమాచారం.

ఆన్‌లైన్‌ను ఆసరాగా చేసుకొని కొందరు అక్రమార్కులు తమకు అనుకూలమైన వ్యక్తుల ఫొటోలు, బ్యాంకు ఖాతాలు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జతచేసి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. అంతటితో ఆగకుండా సంబంధిత మండల తహసీల్దార్ల లాగిన్‌ నుంచి నేరుగా ఆర్డీవో కార్యాలయానికి పంపుతూ వచ్చారు. ఒకసారి కల్యాణలక్ష్మి డబ్బులు పొందిన లబ్ధిదారుల ఫొటోలు మళ్లీ పెట్టి తల్లిదండ్రుల పేర్లు, బ్యాంకు ఖాతా, ధృవీకరణ పత్రాలు మార్చి రెండోసారి కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేసినట్లుగా అధికారులు గుర్తించారు. 2019లో పెళ్లి జరిగినట్లుగా దరఖాస్తులో పొందుపర్చి డబ్బులు ఈ ఏడాదిలో దండుకున్నట్లు విచారణలో తేలినట్లుగా సమాచారం. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కాలంలోనే బోగస్‌ పెళ్లిళ్లకు చెందిన బిల్లులు ఎక్కువ పాసయ్యాయని అధికారులు అనుమానిస్తున్నారు. కాగా, తహసీల్దార్లు లాగిన్, పాస్‌వర్డ్‌ను ఎప్పటికప్పుడు మార్చుకునే అవకాశం ఉన్నా.. ఆ సమయంలో చేంజ్‌ చేద్దామనే ఆలోచన రాకపోవడం గమనార్హం. 
(చదవండి: అయ్యో.. ఐఫోన్‌ అందకపాయె..! )

కొనసాగుతున్న విచారణ.. 
జిల్లాలోని ఆయా తహసీల్దార్‌ కార్యాలయాల్లో కల్యాణలక్ష్మి పథకానికి వచ్చిన దరఖాస్తుల పరిశీలన ముగిసింది. మూడేళ్లుగా వచ్చిన దరఖాస్తులను నాలుగైదు రోజుల పాటు కుప్పలు తెప్పలుగా పోసి క్షుణ్ణంగా పరిశీలించారు. 90 దరఖాస్తులు బోగస్‌గా తేలగా, 3 దరఖాస్తుల డబ్బులు రికవరీ చేశారు. మిగతా 87 దరఖాస్తులకు సంబంధించిన లబ్ధిదారుల నివాస ప్రాంతాలు ఉట్నూర్, ఇచ్చోడ, నేరడిగొండ, బోథ్, బజార్‌హత్నూర్, ఇంద్రవెల్లి, సిరికొండ మండలాల్లో ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.

అయితే బోథ్, నేరడిగొండ, బజార్‌హత్నూర్, గుడిహత్నూర్, మావల మండలాల తహసీల్దార్ల లాగిన్ల నుంచి దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ప్రధానంగా ఎవరు దరఖాస్తుదారు, చెక్‌ ఎవరి పేరిట మంజూరైంది? బ్యాంకు ఖాతా.. పెళ్లికి సంబంధించిన పత్రాలు, ఫొటో, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, తదితరవి వాటిపై ఆయా మండల కార్యాలయాల్లో విచారణ జరుగుతోంది. బోగస్‌గా గుర్తించినవి సరైనవేనా.? అనేది తెలుసుకునేందుకు క్షేత్రస్థాయికి వెళ్లి విచారిస్తున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. విచారణ ముగిశాక ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెబుతున్నారు. 

విచారణ జరుగుతోంది 
కలెక్టర్‌ ఆదేశాల మేరకు దరఖాస్తులు పరిశీలించి బోగస్‌గా 90 దరఖాస్తులు గుర్తించాం. ఇందులో మూడు దరఖాస్తులకు చెందిన డబ్బులు రికవరీ అయ్యాయి. మిగతా 87 దరఖాస్తులపై విచారణ జరుగుతోంది. పూర్తి చేసేందుకు కొంత సమయం పడుతుంది. అనంతరం రికవరీ చేస్తాం.
– జాడి రాజేశ్వర్, ఆదిలాబాద్‌ ఆర్డీవో 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు