రామయ్య తలంబ్రాలు గంటకు 1,500 ప్యాకెట్లు

27 Mar, 2023 02:47 IST|Sakshi

గతంలో చేతితో ప్యాకెట్ల తయారీ 

ఇప్పుడు అందుబాటులోకి ప్రత్యేక యంత్రాలు

వేగంగా ప్యాకెట్లు సిద్ధం.. రవాణా సులభం

ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే పోస్టల్‌ శాఖ, ఆర్టీసీ కార్గోల ద్వారా డెలివరీ

భద్రాచలం: భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు సిద్ధమవుతున్నాయి. భద్రాచలంలో కల్యాణోత్సవానికి హాజరయ్యే భక్తులకు పంచడంతోపాటు ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసుకునేవారికి సరఫరా చేసేందుకు దేవస్థా నం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కువ మంది భక్తులకు తలంబ్రాలు అందించేందుకు వీలుగా ప్రత్యే క యంత్రాల ద్వారా వాటిని ప్యాకింగ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ తలంబ్రాల తయారీ ప్రక్రియ వేగం పుంజుకుంది. రామయ్య కల్యాణ తలంబ్రాలు కావాల నుకునేవారు మీసేవ కేంద్రాల ద్వారా బుక్‌ చేసుకోవచ్చు.

ఇన్నాళ్ల ఇబ్బందికి చెక్‌..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఏటా  శ్రీసీతా రాముల కల్యాణ మహోత్స వాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సీతారాములకు సమర్పించే ముత్యా ల తలంబ్రాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఆ ముత్యాల తలంబ్రాలను ఇంటికి తీసుకెళితే మంచి జరు గుతుందన్న భావనతో చాలా మంది భక్తులు తీసుకుంటుంటారు.

శ్రీరామనవమి రోజున భద్రాచలం వచ్చిన భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో ఉచితంగానే ముత్యాల తలంబ్రాలను అందిస్తారు. దూర ప్రాంతాల్లో ఉండి కల్యాణోత్సవానికి హాజరు కాలేని వారితోపాటు బంధువులు, స్నేహితులకు అందజేసేందుకు కావాలను కునే భక్తుల కోసం దేవస్థానం రెండు ముత్యాలతో కూడిన తలంబ్రాలను విక్రయిస్తోంది.

గతంలో ఈ తలంబ్రాలను స్వచ్ఛంద సంస్థ సభ్యులతో ప్యాకింగ్‌ చేయించేవారు. దీనితో చాలా సమయం పట్టడంతోపాటు ఆ ప్యాకెట్లు రవాణాలో చిరిగిపోయేవి. ఈ క్రమంలోనే వేగంగా ప్యాకింగ్‌ చేయడం, రవాణాలో దెబ్బతినకుండా ఉండేలా దేవస్థానం అధికారులు ప్యాకింగ్‌ యంత్రాలపై దృష్టిపెట్టారు. 

దాతల చేయూతతో యంత్రాలు..
ముత్యాల తలంబ్రాలు, పులిహోర ప్రసా దం ప్యాకింగ్‌ యంత్రాల కోసం దేవస్థానం అధికారులు దాతలను సంప్రదించారు. తిరుపతి ఖాదీబండార్‌కు చెందిన కుమార్‌ కిట్టు యాజమాన్యం రూ.1.40 లక్షలతో తలంబ్రాల ప్యాకింగ్‌ యంత్రాన్ని, శశి విద్యాసంస్థల యాజమాన్యం రూ.1.50 లక్షల విలువైన ప్యాకింగ్‌ కవర్లను సమకూ ర్చాయి. ఇక రూ.1.45 లక్షల విలువైన పులిహోర ప్రసాదం ప్యాకింగ్‌ యంత్రాన్ని తులసి ఆస్పత్రి యజమాన్యం ఏజేఆర్‌ సేవా సంస్థ పేరుతో సమకూర్చింది.

గంటకు 1,500 ప్యాకెట్లు
యంత్రంలో తలంబ్రాల నడుమ ముత్యాలు ఉంచి ఆన్‌ చేస్తే ఆటోమేటిక్‌గా ప్యాకెట్లు తయారై బయటికి వస్తాయి. ఈ యంత్రం ద్వారా నిమిషానికి 25 చొప్పున గంటకు 1,500 ప్యాకెట్లు సిద్ధమవుతున్నాయి. రోజూ సుమారు 20 వేల వరకు ప్యాకెట్లు చేస్తున్నారు. ఈ ఏడాది సుమారు 2 లక్షల తలంబ్రాల ప్యాకెట్లను భక్తులకు అందుబాటులో ఉంచాలని అధికారులు నిర్ణయించారు.

పులిహోర ప్యాకింగ్‌ యంత్రం ద్వారా గంటకు 1,400 వరకు ప్యాకెట్లు సిద్ధ మవుతున్నాయి. ఇటీవలి వరకు రోజువారీగా విక్ర యించే ప్రసాదాన్ని ప్యాక్‌ చేయాలంటే కార్మికులకు ఒకపూటంతా పట్టేదని.. ఇప్పుడు 2 గంటల్లోనే పని పూ ర్తవుతోందని అధికారులు చెప్పారు. పోస్టల్‌ శాఖ, ఆర్టీసీ కార్గో ద్వారా తలంబ్రాలను భక్తులకు చేరవేస్తున్నామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు