బెయిల్‌ కోసం కామారెడ్డి సీఐ చేతివాటం

21 Nov, 2020 10:02 IST|Sakshi
జగదీశ్‌ (ఫైల్‌)

స్టేషన్‌ బెయిల్‌ కోసం రూ. 5 లక్షలు డిమాండ్‌ 

బెట్టింగ్‌ కేసులో కామారెడ్డి సీఐ లంచావతారం 

ఏసీబీ దాడులు..  విలువైన డాక్యుమెంట్లు  స్వాధీనం  

సాక్షి, కామారెడ్డి/కామారెడ్డి క్రైం: క్రికెట్‌ బెట్టింగ్‌ కేసులో అవినీతికి పాల్పడిన కామారెడ్డి పట్టణ సీఐ జగదీశ్‌ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. శుక్రవారం ఏకకాలంలో పలు చోట్ల తనిఖీలు జరిగాయి. బాన్సువాడ కు చెందిన సుధాకర్‌ను కామారెడ్డి పోలీసులు బెట్టింగ్‌ వ్యవహారంలో 15 రోజుల క్రితం అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ నెల 6న అతనికి స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వడం కోసం సీఐ జగదీశ్‌ రూ. 5 లక్షలు డిమాండ్‌ చేశాడు. ముందుగా రూ.1,39,500లను సుధాకర్‌ సీఐకి ఇచ్చాడు. మిగతా డబ్బులను సైతం వెంటనే చెల్లించాలని సీఐ పలుసార్లు సుధాకర్‌ ఒత్తిడి  పెంచ డంతో అతను  ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

ఈ నెల 19న ఏసీబీ అధికారులు సీఐ జగదీశ్‌తో పాటు ఈ వ్యవహా రంలో మధ్యవర్తిత్వం చేసిన సుజయ్‌పై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం కామారెడ్డిలోని సీఐ జగదీశ్‌ ఇంటిపై అధికారులు దాడులు నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు సోదాలు జరిగాయి. సీఐ ఇంట్లో విలువైన డాక్యుమెంట్లు, లాకర్‌ కీలు స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నట్టు డీఎస్పీ ఆనంద్‌కుమార్‌ తెలిపారు. మధ్యవర్తి సుజయ్‌ను సైతం విచారిస్తున్నామని, సీఐని ఏసీబీ కోర్టులో శనివారం ప్రవేశపెడుతామని చెప్పారు. 

మరిన్ని వార్తలు