పండుగైనా, పబ్బమైనా.. అనారోగ్యమైనా అడవి బాట!

10 Sep, 2022 18:11 IST|Sakshi

సమాజంలో విభిన్నంగా గొర్రెల కాపరుల జీవనం

సాక్షి, కామారెడ్డి: పొద్దున లేవగానే సద్దిమూట కట్టుకుని, నీళ్ల డబ్బా వెంటేసుకుని.. చేతిలో గొడ్డలితో అడవిబాట పట్టడం.. ఒంటరిగానే తిరగడం.. అక్కడే తినడం, చీకటి పడ్డాకే తిరిగి ఇంటి దారి పట్టడం.. ఒకరోజు, రెండు రోజులు కాదు.. దాదాపు జీవితాంతం ఇలాగే గడుస్తుంది. ఇది గొర్రెల కాపరుల జీవితం. పొద్దంతా మేత కోసం గొర్రెలను తిప్పడం, రాత్రికి ఇంటికి చేరుకోవడం.. ఇంట్లో పండుగైనా, పబ్బమైనా, చివరికి అనారోగ్యం బారినపడినా.. ఇంట్లో ఎవరో ఒకరు గొర్రెల వెంట వెళ్లాల్సిందే. ఇలా ఎలమందలు తమ జీవితకాలంలో సగటున లక్ష కిలోమీటర్లపైనే నడుస్తారని అంచనా. వారి జీవనంపై ప్రత్యేక కథనం. 

గొర్రెల మందలే లోకంగా.. 
రాష్ట్రంలో గొర్రెల పెంపకంపై ఆధారపడి 7.61 లక్షల కుటుంబాలు జీవిస్తున్నట్టు అంచనా. ఆ కుటుంబాల్లోని వారు పది, పదిహేనేళ్ల వయసులోనే గొర్రెల వెంట వెళ్లడం మొదలుపెడతారు. 65 ఏళ్లు దాటినా వృత్తిని కొనసాగిస్తూనే ఉంటారు. ఏదైనా అనారోగ్యం వస్తే తప్ప ఇంటిపట్టున ఉండేది లేదు. ఎవరైనా బంధువులో, కుటుంబ సభ్యులో చనిపోయినా కూడా.. గొర్రెలను కొట్టంలోనే ఉంచేయలేరు. తోటి గొర్రెల కాపరులకు అప్పగించడమో, తమ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు కాయడానికి వెళ్లడమో చేస్తుండే పరిస్థితి. ఒక కాపరి రోజు కనీసం పది, పదిహేను కిలోమీటర్లు చొప్పున సగటున ఏడాదికి 2,100 కిలోమీటర్లపైన.. యాభై ఏళ్ల పాటు లక్ష కిలోమీటర్లపైనే నడుస్తారని అంచనా. 

కుటుంబాలను వదిలి.. మన్యం పోయి.. 
తమ ప్రాంతాల్లో గొర్రెలకు మేత సరిగా లభించని పరిస్థితుల్లో.. దూరంగా ఉన్న అడవులకు గొర్రెలను తీసుకెళ్తుంటారు. దీన్ని మన్యం పోవడం అని పిలుచుకుంటారు. ఇలా గోదావరి, కృష్ణ, మంజీరా నది పరీవాహక ప్రాంతాలకు వెళ్తుంటారు. మూడు, నాలుగు నెలలు అక్కడే ఉండి గొర్రెలను మేపుతారు. వెంట తీసుకువెళ్లిన తిండి గింజలతో, సమీపంలోని ఊర్ల నుంచి తెచ్చుకునే సామగ్రితో వంట చేసుకుని తింటారు. నిజామాబాద్, కరీంనగర్‌ జిల్లాలకు చెందిన వారు చాలామంది గోదావరి వెంట వెళ్తారు. కొందరు గోదావరి దాటి మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాలకూ గొర్రెలను తోలుకెళ్లి మేపుతుంటారు. మరికొందరు మంజీరా వెంట కర్ణాటకకు వెళ్తారు. 

బీపీ, షుగర్‌లు దరిచేరవట! 
గొర్రెలను కాయడానికి అలుపులేకుండా తిరగడం వల్ల కాపరులకు బీపీ, షుగర్‌ వంటి వ్యాధులు వారి దరిచేరవని అంటుంటారు. పచ్చని గట్లు, పొలాలు, అడవుల వెంట తిరగడం వల్ల స్వచ్ఛమైన గాలిని పీలుస్తుండటంతో ఆరోగ్యంగా ఉంటామని చెప్తుంటారు. అయితే నడిచీ నడిచీ కాళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడుతుండటం మాత్రం కనిపిస్తుంటుంది. అడవుల్లో తిరిగేప్పుడు ముళ్లు గుచ్చుకోవడం, గాయాలవడం వంటివి జరుగుతుంటాయి. ఈ క్రమంలో చాలా మందికి మూలికలు, ఆకు పసర్లతో సొంతంగా వైద్యం చేసుకునే నైపుణ్యం ఉంటుంది. అడవుల్లో తిరిగే సమయాల్లో చాలాసార్లు వన్య మృగాలు కనిపిస్తాయని, వాటి కంట పడకుండా జాగ్రత్త పడతామని.. ఒకవేళ దాడి చేస్తే ఎదుర్కొనేందుకూ సిద్ధంగా ఉంటామని గొర్రెల కాపరులు చెబుతున్నారు. (క్లిక్ చేయండి: బసంత్‌నగర్‌ ఎయిర్‌పోర్టుకు మహర్దశ)


చిరుతపులి వెంట పడ్డాం.. 

పదేళ్ల వయసు నుంచి జీవాల వెంట వెళ్తున్నాను. ఇప్పుడు 65 ఏండ్లు. జ్వరం వచ్చినప్పుడే ఇంటి పట్టున ఉండేది. పండుగ ఉన్నా ఆగమాగం తిని పోవుడే. ఓసారి అడవిలో ఎలుగుబంటి మా మీదికి వస్తే కొట్లాడినం. ఇంకోసారి చిరుత పులి గొర్రెను అందకునిపోతే వెంటపడ్డం. గొర్రెను విడిచి పారిపోయింది. 
– చెట్కూరి హన్మయ్య, ఇస్రోజివాడి, కామారెడ్డి జిల్లా 

కాపరుల జీవితమంతా కష్టాలే.. 
గొర్రెలు, మేకల కాపరుల జీవితమంతా కష్టాలే. మేత కోసం అడవికి వెళితే ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ వాళ్లు ఇబ్బంది పెడతారు. పంట చేల వెంట వెళితే రైతుల నుంచి ఇబ్బందులు. జీవాలకు రోగాలతో సమస్య. వాటికి మందుల కోసం ఖర్చు పెరిగిపోతోంది. ప్రభుత్వం గొర్లు, మేకల పెంపకానికి స్థలాలు కేటాయించాలి. మందలకు అవసరమైన షెడ్లు నిర్మించి ఇవ్వాలి. నీటి సౌకర్యం కల్పించాలి. ఏళ్లకేళ్లు నడవడం వల్ల కీళ్లనొప్పులతో ఇబ్బంది పడుతున్నరు. వారికి ప్రత్యేక పింఛన్లు ఇవ్వాలి. 
– జోగుల గంగాధర్, న్యాయవాది, గొర్రెలమేకల కాపరుల సంఘం నాయకుడు 


నలభై ఐదేళ్లుగా గొర్రెలు కాస్తున్నా.. 

పదేళ్ల వయసులో గొర్లు మేపడం మొదలుపెట్టిన. 45 ఏళ్లుగా మేపుతున్నా.. అడవిలో చిరుతపులులు, ఎలుగుబంట్లతో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఏటా మేత కోసం మూడు నాలుగు నెలలు మహారాష్ట్రలోని ధర్మాబాద్, కొండల్‌వాడి, బిలోలి వైపు వెళతాం. అప్పట్లో గొర్రెలు, మేకలకు రోగమొస్తే ఆకు పసర్లు పోసేవాళ్లం. ఇప్పటి మందులు ఎన్ని పోసినా రోగాలు తగ్గడం లేదు. 
– కన్నపురం బక్కయ్య, ఇసన్నపల్లి, కామారెడ్డి జిల్లా


అన్నం పాచిపోయినా తినాల్సి వస్తది 

నేను ఏడేండ్ల వయసు నుంచే గొర్ల వెంట పోతున్న. చలి, వాన, ఎండ ఏదైనా సరే పోక తప్పది. ఎండా కాలంలో సద్దిడబ్బా మూత తీసేసరికి అన్నం పాచిపోయి ఉంటుంది. ఆకలైతది ఎట్లయిన తినాలె. అన్నంల నీళ్లు పోసి కలిపి.. నీళ్లను పారబోసి అన్నం తినేవాళ్లం. 
– మాసూరి రాజయ్య, ఇసన్నపల్లి

మరిన్ని వార్తలు