మరో రైతు ఆత్మహత్యాయత్నం

18 Jan, 2023 01:00 IST|Sakshi
చికిత్స పొందుతున్న బాలక్రిష్ణ

కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌ వివాదం 

సాక్షి, కామారెడ్డి: తన భూమిని రిక్రియేషన్‌ జోన్‌లో కలిపారన్న ఆవేదనతో మంగళవారం ఓ రైతు గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కామారెడ్డి కొత్త మాస్టర్‌ప్లాన్‌లో పంట భూములను ఇండస్ట్రియల్, గ్రీన్, రిక్రియేషన్‌ జోన్ల కింద పేర్కొనడంపై రైతాంగం నెలన్నర రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం రామేశ్వర్‌పల్లికి చెందిన రైతు మర్రిపల్లి బాలక్రిష్ణ గడ్డిమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

అతన్ని వెంటనే జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించగా, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నాడు. తనకున్న ఎకరం భూమి రిక్రియేషన్‌ జోన్‌లోపోతే పిల్లలను ఎలా పెంచాలి, పెళ్లిళ్లు ఎలా చేయాలని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు, మాస్టర్‌ప్లాన్‌ను రద్దు చేయాలంటూ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో 8గ్రామాలకు చెందిన రైతులు కలెక్టరేట్‌ ముట్టడి, కుటుంబ సభ్యులతో ర్యాలీ వంటి నిరసన వంటి కార్యక్రమాలు చేపట్టారు.

ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆయా గ్రామాలకు చెందిన 9 మంది కౌన్సిలర్లు ఈనెల 19లోపు రాజీనామా చేయాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ డెడ్‌లైన్‌ విధించింది. దీంతో బీజేపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు రాజీనామా లేఖలను రైతు జేఏసీకి అందించారు.

మరిన్ని వార్తలు