ముగిసిన ‘కమతం’ రాజకీయ శకం 

6 Dec, 2020 11:44 IST|Sakshi

సాక్షి,  గండేడ్‌ (మహబూబ్‌నగర్‌): మారుమూల పల్లెలో పుట్టి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కుటుంబంతో సన్నిహితంగా ఉండి పరిగి నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన ముద్రవేసుకున్న నాయకుడు కమతం రాంరెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం హైదరాబాద్‌లో మృతిచెందగా మధ్యాహ్నం స్వగ్రామానికి తీసుకొచ్చారు. రంగనాయకమ్మ లక్ష్మారెడ్డి దంపతులకు 1938లో జన్మించిన ఆయన న్యాయశాస్త్రంలో మంచి ప్రావీణ్యం సంపాదించారు. చిన్నతనంలోనే మహ్మదాబాద్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌గా ఎన్నికై రాజకీయ గురువు, మహ్మదాబాద్‌కు చెందిన జగన్‌మోహన్‌రెడ్డి అండతో 1968లో కాంగ్రెస్‌ ప్రభుత్వ చీఫ్‌విప్‌గా, 1977లో వెంగళ్‌రావు మంత్రివర్గంలో పౌరసరఫరాలశాఖ మంత్రిగా పనిచేశారు.

ముఖ్యమంత్రిగా ఎన్నికైన సమయంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డికి అభినందనలు తెలుపుతున్న కమతం రాంరెడ్డి(ఫైల్‌)
1976లో పరిగి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. 1980లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 1991లో నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మంత్రివర్గంలో మార్కెటింగ్, గిడ్డంగులశాఖ మంత్రిగా, 1992లో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రివర్గంలో రెవెన్యూశాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా, 2009లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. 2014లో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి పరాజయం పాలయ్యారు. చివరకు కొప్పుల మహేశ్‌రెడ్డికి సహకరించేందుకు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూమంత్రిగా పనిచేసే సమయంలో దివంగత నేత రాజశేఖర్‌రెడ్డితో ఎంతో సన్నిహితంగా ఉండేవారు.

మరిన్ని వార్తలు