నేడు నాగుర్లపల్లిలో కందికొండ అంత్యక్రియలు

14 Mar, 2022 02:15 IST|Sakshi

ఫిలించాంబర్‌లో పార్థివదేహాన్ని సందర్శించుకున్న అభిమానులు 

కందికొండ కుటుంబానికి ఇల్లు ఇప్పిస్తాం: మంత్రి తలసాని

సాక్షి, హైదరాబాద్‌/ నర్సంపేట రూరల్‌: ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి అంత్యక్రియలు సోమవారం ఆయన స్వగ్రామం వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లిలో జరగనున్నాయి. తెలుగు సినిమాలకు వేల పాటలు రాసిన ఆయన.. కేన్సర్‌తో బాధపడుతూ హైదరాబాద్‌లోని నివాసంలో శనివారం సాయంత్రం మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఆదివారం ఉదయం ఫిలిం చాంబర్‌లో ఉంచారు. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు పార్థివదేహాన్ని సందర్శించుకున్నారు.

తక్కువ కాలం జీవించి, ఎక్కువ కాలం జీవించే కవిత్వాన్ని రాసిన తెలంగాణ పాటల పూదోట కందికొండ యాదగిరి అని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరు గౌరీ శంకర్‌ ఈ సందర్భంగా కొనియాడారు. కందికొండ అందరివాడని, ఆయన లేనిలోటు తీర్చలేమని పేర్కొన్నారు. అభిమానుల సందర్శన అనంతరం కుటుంబ సభ్యులు అశ్రునయనాల మధ్య కందికొండ మృతదేహాన్ని స్వగ్రామం నాగుర్లపల్లికి తరలించారు. మధ్యలో అంబులెన్సును నర్సంపేట పట్టణంలోని అమరువీరుల స్థూపం వద్ద కాసేపు ఆపారు. పలువురు స్థానిక ప్రముఖులు, నాయకులు, కళాకారులు, అభిమానులు పూలు చల్లి నివాళులు అర్పించాక.. నాగుర్లపల్లికి తీసుకెళ్లారు. అక్కడ నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి కందికొండ పార్థివదేహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 

కందికొండ కుటుంబానికి ఇల్లు ఇప్పిస్తాం: తలసాని 
కందికొండ యాదగిరి తెలంగాణ సమాజానికి ఉపయోగపడే పాటలెన్నో కందికొండ రాశారని.. ఆయన మృతి బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ అన్నారు. వారి కుటుంబానికి మంత్రి కేటీఆర్‌ అన్ని విధాలుగా అండగా ఉన్నారని, కందికొండ కుటుంబానికి ఇల్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. 

మరిన్ని వార్తలు