నా భార్య మృతి కేసును సజావుగా విచారణ చేయాలి

25 Jul, 2020 10:33 IST|Sakshi
భర్తతో సుహారిక (ఫైల్‌)

సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌కు కన్నా ఫణీంద్ర లేఖ

సాక్షి, సిటీబ్యూరో: ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలు మృతి కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. సుహారిక మృతిలో అనేక అనుమానాలు ఉన్నాయంటూ ఆమె భర్త కన్నా ఫణీంద్ర సైబరాబాద్‌ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. కార్డియాక్‌ అరెస్ట్‌తో చనిపోయిందని చెబుతున్న సుహరిక మృతిపై అనుమానం ఉందని, కేసు విచారణ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని శుక్రవారం సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ను కోరారు. 2020 మే 29న సుహరిక చనిపోయిన సమయంలో ఉన్న ప్రవీణ్, వివేక్, వివాస్, పవన్‌లతో పాటు సుహరిక తల్లి సాగరిక కూడా నిజాలు దాస్తున్నారని, వారిని మళ్లీ విచారించి న్యాయం చేయాలని సీపీకి సమర్పించిన ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు. (‘కన్నా’ కోడలు అనుమానాస్పద మృతి)

సీబీఐటీ సమీపంలోని ఫామ్‌ హౌస్‌లోనే సుహరిక చనిపోయి ఉంటుందని, అది దాచి ఏఐజీ ఆసుపత్రికి ఐదు నిమిషాల వ్యవధిలో చేరే మీనాక్షి బాంబూస్‌ విల్లా నంబర్‌ 28లో జరిగినట్టుగా చెబుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ‘ఎందుకంటే మెడికో లీగల్‌ కేసు రికార్డు ప్రకారం 11.30 గంటల ప్రాంతంలోనే అచేతనంలోనే ఉందని, 12.45 గంటల ప్రాంతంలోనే ఏఐజీ ఆసుపత్రికి తీసుకొచ్చారని,  1.13 గంటల ప్రాంతంలో సుహరిక చనిపోయిన విషయాన్ని తనకు చెప్పారన్నారు. సుహరిక తల్లి కూడా తన కూతురి మృతిపై ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంలో రాయదుర్గం పోలీసులు కేసు విచారణ సజావుగా త్వరితగతిన సాగేలా చూడాల’ని కన్నా ఫణీంద్ర కోరారు.    

మరిన్ని వార్తలు