కరీంనగర్: ఇష్టారాజ్యంగా చికెన్‌ విక్రయాలు ఊరికో ధర..!

27 Jul, 2022 13:32 IST|Sakshi

‘కోతిరాంపూర్‌కు చెందిన మల్లేశం బంధువులొచ్చారని చికెన్‌ కొందామని మార్కెట్‌కు వెళ్లాడు. పేపర్‌ ధర ప్రకారం జనరల్‌ కిలో కోడి ధర రూ.94 ఉండగా రూ.130కి విక్రయించారు. స్కిన్‌లెస్‌ కిలో రూ.155 కాగా రూ.200లు వసూలు చేశారు. కిలో కోడికి రూ.30కి పైగా వసూలు చేస్తుండగా చికెన్‌కు రూ.40కి పైగా అదనంగా తీసుకుంటున్నారు. పేపర్‌ రేట్‌లో తక్కువ ఉందంటే గిట్టుబాటు కాదని చికెన్‌ సెంటర్‌ యజమాని సమాధానం చెప్పారు. నగరంలోనే ఇలా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో మరీ అదనం. ఇది ఒక్క రాజు పరిస్థితే కాదు.. జిల్లావ్యాప్తంగా చికెన్‌ కొనుగోలు చేసే సగటు వినియోగదారుని పరిస్థితి.’

కరీంనగర్‌ అర్బన్‌: కోడి కూర.. ఈ పేరు వింటేనే నోరూరుతోంది. చుట్టాలు వచ్చిన.. శుభకార్యమైనా.. విషాధమైనా ముక్కలు ఉడకాలి సందే.. జిల్లాలో నిత్యం 40 వేల క్వింటాళ్ల చికెన్‌ విక్రయమవుతుండటంతో చికెన్‌ సెంటర్ల నిర్వాహకులకు కాసుల పంట పండుతోంది. కాగా చికెన్‌ ధరలు భారీగా పడిపోగా చికెన్‌ సెంటర్లలో దోపిడీ మాత్రం ఆగడం లేదు. పేరుకు పేపర్‌ రేటని చెబుతూ వీలైనంత మేర దండుకుంటున్నారు. పేపర్‌ ధర ఒకటైతే విక్రయించేది మాత్రం కిలోకు రూ.40 అదనం. ఇదేంటంటే మేమింతే..ఈసడింపు సమాధానం. జిల్లాలో నిత్యం రూ.5.20 కోట్ల వ్యాపారం సాగుతుండగా అదనంగా రూ.1.20కోట్లు దోచుకుంటున్నారు. ఈలెక్కన నెలకు రూ.36కోట్ల మేర వినియోగదారులను పిండేస్తుండగా నియంత్రించే వారు లేకపోవడంతో అడ్డూఅదుపూ లేకుండా పోతోంది.

చికెన్‌ సెంటర్లు.. దళారులకే లాభం
కోళ్ల పరిశ్రమ స్వయం ఉపాధిగా వెలుగొందుతుండగా దీనిపై ప్రభుత్వానికి ఎలాంటి అ«ధికారం లేదు. హెచరీస్, కోళ్ల ఫారం యజమానులు, ట్రేడర్స్, చికెన్‌ సెంటర్ల నిర్వాహకులు ఇలా వినియోగదారులకు చికెన్‌ చేరుతుండగా యజమానుల పరిస్థితి అటుంచితే ట్రేడర్లు, చికెన్‌ సెంటర్ల నిర్వాహకులే ధరలను శాసిస్తున్నారు. సొమ్మొకడిది సోకొకరిదన్నట్లు గంటల వ్యవధిలోనే లాభాలు గడిస్తున్నారు ట్రేడర్లు. పుట్టగొడుగుల్లా ట్రేడర్లు పుట్టుకొస్తుండగా చికెన్‌ సెంటర్లు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్నాయి. కోళ్లను 45–50 రోజుల పాటు పెంచిన రైతుకు మిగిలేది అరకొర కాగా ట్రేడర్లు, చికెన్‌ సెంటర్లు మాత్రం దండిగా దోచుకుంటున్నారు. ఫలితంగా కోళ్ల ఫారం రైతులు, వినియోగదారులపైనే భారం పడుతోంది.

పుట్టగొడుగుల్లా ట్రేడర్లు
జిల్లాలో కోళ్ల ఫారంల నుంచి కోళ్లను కొనుగోలు చేసి చికెన్‌ సెంటర్లకు సరఫరా చేసేవారి సంఖ్య క్రమేణా పెరుగుతోంది. దీంతోనే ఎక్కువ లాభం ఉండటం.. మైనస్‌ మంత్రాన్ని జపించడంతో అనతికాలంలో ల క్షలు వెనకేస్తున్నారు. ఈ జాబితాలో కోళ్ల ఫారం య జమానులు చేరిపోతున్నారు. ఫారం ద్వారా వచ్చే ఆ దాయం కంటే సరఫరా చేస్తే వచ్చే ఆదాయం ఎక్కువగా ఉండగా అదీ రెండు, మూడు రోజుల్లోనే వస్తుండటంతో ఈ వ్యాపారం వైపే మొగ్గుచూపుతున్నారు. 

కోళ్ల ఫారం యజమానుల పరిస్థితి దారుణం
ట్రేడర్లు, చికెన్‌ సెంటర్‌ నిర్వాహకులు, హెచరీస్‌లు వీలైనంత సంపాదిస్తుంటే కోళ్ల ఫారం యజమానులది దారుణ పరిస్థితి. రోజుల వ్యవధిలోనే వారంతా లాభాలు గణనీయంగా పొందుతుంటే పిల్లల నుంచి కోళ్ల వరకు రూపాంతరం చెందే వరకు శ్రమించే య జమానులకు మాత్రం మిగిలేది చిన్నమొత్తమే. జిల్లాలో సుమారు 5వేల వరకు కోళ్ల ఫారాలున్నాయి. హె æచరీస్‌లు కోడి పిల్లలను కోళ్ల ఫాం యజమానులకు సరఫరా చేస్తుండగా 45–50 రోజులకు పెంచి వాటి ని సంరక్షించాలి. దాణాలో వాడే ముడి పదార్థాలపై ధర ఉండటం లేదు. కంపెనీని నమ్ముకుని దాణా వేయడమే. ఈలోపే ఏదైనా వైరస్‌ వచ్చినా.. మరణించినా రైతుపైనే భారం. ఇవన్ని తట్టుకుని కోళ్లను విక్రయించే సమయానికి ట్రేడర్ల దోపిడీ అధికమవుతోంది. చేసేది లేక మైనస్‌లకు విక్రయిస్తూ పెట్టిన పెట్టుబడిలో పావు వంతు కూడా లాభం పొందడం లేదు. కోళ్ల పరిశ్రమను నమ్ముకున్న వారికి ఆశించిన ప్రయోజనం లేదని ప్రభుత్వ నియంత్రణలో చేర్చాలని ఫారం యజమానులు కోరుతున్నారు. 

పౌల్ట్రీ మీట్‌ ఫెడరేషనే మార్గం
► కోళ్ల పరిశ్రమపై ఒకప్పుడు ప్రభుత్వ పర్యవేక్షణ ఉండేది.
► ఫారం యజమానులు నష్టపోయినా, ఏవైనా విపత్తులు సంభవించినా అరకొర సాయమందేది. 
► దీనికి తోడు ప్రభుత్వ రాయితీలుండేవి. 
► ప్రభుత్వ కనుసన్నలో 1985 వరకు పౌల్ట్రీ మీట్‌ ఫెడరేషన్‌ ఉండేది. 
► కాలక్రమేణ ఫెడరేషన్‌ కనుమరుగైంది. 
► నిరుద్యోగ యువతకు ఇదో చక్కని అవకాశమే కానీ సంస్కరణలు అవసరమన్నది యజమానుల వాదన.

పౌల్ట్రీ రంగాన్ని బతికించాలి
కోళ్ల ఫారంతో పదేళ్లుగా ఉపాధి పొందుతున్న. ఇటీవల కాలంలో మోసాలు ఎక్కువయ్యాయి. కంటికి రెప్పలా పిల్లలను కాపాడితే విక్రయించే సమయానికి ట్రేడర్లు తక్కువ ధర చెల్లిస్తున్నారు. దీంతో ఒకసారి కోళ్లు వేసిన వారు మళ్లీ వేయాలంటే వెనుకడుగు వేస్తున్నారు. 
– మహేందర్‌రెడ్డి, 

పౌల్ట్రీ ఫాం రైతు, మానకొండూరు
మేమేం చేయలేం
కోళ్ల పరిశ్రమ స్వయం ప్రతిపత్తి గల ప్రైవేట్‌ రంగం. వీటి ధరలపై మాకెలాంటి అధికారం లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీలు, ప్రొత్సాహకాలు లేవు.– డా.బండారి నరేందర్, 
జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి  

మరిన్ని వార్తలు