గోల్‌మాల్‌ గేమ్‌!

9 Nov, 2020 08:35 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, కరీంనగర్: ఆన్‌లైన్‌ గేమ్స్, క్రికెట్‌ బెట్టింగ్‌లు ఇల్లు గుల్ల చేస్తున్నాయి. యువకులు జూదానికి ఆకర్షితులవుతూ డబ్బులు పోగొట్టుకుని బజారున పడుతున్నారు. అప్పులు చేసి మరీ ఆడడంతో జీవితాలు రోడ్డుపాలు అవుతున్నాయి. పల్లె, పట్టణం అని తేడా లేకుండా ఇష్టారాజ్యంగా ఆన్‌లైన్‌ రమ్మీ ఆడుతూ, క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతూ లక్షల రూపాయలు నష్టపోయి కుటుంబాలను బజారున పడేస్తున్నారు. లాక్‌డౌన్‌ కాలంలో యువతకు మరింత ఖాళీ సమయం దొరకడంతో ఆన్‌లైన్‌లో గడపడం ఈ పరిస్థితులకు దారితీసిందని పలువురు పేర్కొంటున్నారు. పిల్లలపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచితే నష్టపోకుండా చూసుకోవచ్చని పోలీసులు సూచిస్తున్నారు. ఆటల్లో పొగొట్టుకున్న డబ్బులను రికవరీ చేయడానికి అవకాశముండదని పేర్కొంటున్నారు.  

ఆశతో అడుగు పెడుతూ..
ఆన్‌లైన్‌ రమ్మీ ఆడుతూ చాలా మంది గుడ్డిగా మోసపోతున్నారు. వీరివైపు నుంచి డబ్బులు పెడుతూ ఆడుతున్నా ఇంకో వైపు ఎవరూ, ఎలా ఆడుతున్నారో కూడా తెలియకుండా గుడ్డిగా ఆడుస్తున్నారు. డబ్బు సంపాదించవచ్చేనే ఆశతో మొదలైన ఆన్‌లైన్‌ రమ్మీ ఆడుతూ డబ్బు పోగొట్టుకున్న తర్వాత తిరిగి రాబట్టుకోవాలని ఆడుతూ లక్షల్లో నష్టపోతున్నారు. చాలా మంది ఆన్‌లైన్‌ గేమ్స్‌తో అప్పుల పాలవడంతోపాటు భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు.  

జోరుగా ఐపీఎల్‌ బెట్టింగ్‌లు.. 
ఐపీఎల్‌ ప్రారంభమైన రోజు నుంచి క్రికెట్‌ బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. సాయంత్రమైందంటే చాలు లక్షల రూ పాయలు ఆన్‌లైన్‌లో ఖాతాలు మారుతున్నాయి. సెప్టెంబర్‌ 19న ప్రారంభమైన ఐపీఎల్‌ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఐపీఎల్‌ బెట్టింగ్‌లో ఇటీవల పోలీసులకు పట్టుబడిన వారిలో ఎక్కువ మంది యువకులే. ఈజీ మనీ కోసం బుకీలు వాట్సాప్, ఆన్‌లైన్‌లోనే బెట్టింగ్‌ నిర్వహిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. యువకులు కూడా డబ్బులు బెట్టింగ్‌ పెట్టి నష్టపోతున్నారు. పోలీసులు బెట్టింగ్‌ను కట్టడి చేస్తున్నారు. పట్టుబడినవారిపై కేసులు నమోదు చేస్తున్నారు.   

లాక్‌డౌన్‌.. లాస్‌
కరోనాతో విధించిన లాక్‌డౌన్‌తో అందరూ ఇళ్లకే పరిమితమవడం, అత్యవసరమయితే తప్ప బయటకు వచ్చే పరిస్థితులు లేకుండా ఉండేవి. ఇలాంటి సమయంలో టైంపాస్‌ కోసం ఆన్‌లైన్‌ రమ్మీకి అలవాటుపడ్డారు. ఆ అలవాటు కాస్తా వ్యసనంగా మారి అప్పులు, ఆర్థిక సమస్యలను తెచ్చిపెట్టడంతో తల పట్టుకుంటున్నారు. స్నేహితులు, బంధువుల వద్ద చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.

బానిస కావద్దు..
యువత క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఆన్‌లైన్‌ రమ్మీ ఆడి అనవసరంగా డబ్బులు నష్టపోకూడదు. చెడు అలవాట్లకు బానిస కావద్దు. ఆన్‌లైన్‌ మోసాలు జరిగిన కేసుల్లో డబ్బులు రికవరీ చేయడం కష్టం. యువత సన్మార్గంలో పయనిస్తూ ఆదర్శంగా నిలవాలి. తల్లిదండ్రులు తమ పిల్లలపై దృష్టిసారించాలి. 
–వీబీ.కమలాసన్‌రెడ్డి, కరీంనగర్‌ సీపీ 

మరిన్ని వార్తలు