కరీంనగర్‌లో వింతవ్యాధి కలకలం..! ఉన్నట్టుండి వాంతులు విరేచనాలు, ఒకే కుటుంబంలో వరసగా ముగ్గురు మృతి

20 Dec, 2022 07:19 IST|Sakshi

విధి ఆడిన వింత నాటకంలో ఆ కుటుంబం ఛిన్నాభిన్నమైంది. వింత రోగంతో తొలుత కొడుకు, ఆ తర్వాత బిడ్డ ఇటీవల భార్య ఒక్కొక్కరుగా కన్నుమూశారు. వాంతులు, విరేచనాలతో తల్లిడిల్లి కానరాకుండా పోయారు. ఆ మరణాలకు కారణాలేమై ఉంటాయో ఇప్పటికీ తెలియకపోవడం మరో విషాదం. తాజాగా ఆ కుటుంబ యజమాని వేముల శ్రీకాంత్‌ తనవాళ్లలాగే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కరీంగనగర్‌ జిల్లా మండల కేంద్రమైన గంగాధరలో భయాందోళనలు రేపుతున్న ఘటన వివరాలిలా ఉన్నాయి...

వేముల శ్రీకాంత్‌ కుటుంబం కొన్నేళ్ల నుంచి వాగు ఒడ్డున నివసిస్తోంది. ఆయనకు భార్య మమత, కూతురు అమూల్య (4), అద్వైత్‌ (2) ఉన్నారు. ఆయన స్థానికంగా ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. ఆనందంగా సాగిపోతున్న ఆ కుటుంబ ప్రయాణంలో తీరని విషాదం నవంబర్‌ 16న చోటుచేసుకుంది. శ్రీకాంత్‌ తనయుడు అద్వైత్‌ వాంతులు, విరేచనాలతో అవస్థ పడగా, ఆస్పత్రికి తరలించారు. కానీ, ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఒక్కగానొక్క కుమారుడి మరణంతో ఆ తల్లిదండ్రులు విలవిల్లాడిపోయారు.

అయ్యో అమూల్య!
తనయుడి మరణం నుంచి కోలుకోకుండానే శ్రీకాంత్‌ కూతురు అమూల్య  కూడా వాంతులు, విరేచనాలతో బాధపడుతూ డిసెంబర్‌ 4న కన్నుమూసింది. నెల వ్యవధిలోనే కంటికి రెప్పలా కాపాడుకున్న కొడుకు, కూతురు మృతి చెందడంతో ఆ తల్లిదండ్రుల రోదనకు అంతులేకుండా పోయింది. మరోవైపు తమ బిడ్డల్ని బలితీసుకున్న ఆ వింతరోగమేంటో తెలియని పరిస్థితి! 

బిడ్డల కర్మకాండలు పూర్తి చేసుకున్న శ్రీకాంత్‌, మమత దంపతులు ఇటీవల ధర్మపురిలో గంగ స్నానం ఆచరించి ఇంటికివెళ్లారు. అయితే, ఉన్నట్టుండి మమత అస్వస్థతకు గురైంది. చిన్నారుల ప్రాణాలు తీసిన వింతవ్యాధి ఆమెను కూడా ఉక్కిరిబిక్కిరిచేసింది. ప్రమాదాన్ని గ్రహించిన శ్రీకాంత్‌ క్షణం ఆలస్యం చేయకుండా భార్యను హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించాడు. 

అక్కడ చికిత్స పొందుతూ మమత ఆదివారం తుదిశ్వాస విడిచింది. ఒక్కొక్కరుగా తనవారు దూరమవడంతో శ్రీకాంత్‌కు ఏడుపే మిగిలింది. అయితే, తమ కుటుంబాన్ని పట్టిపీడిస్తున్న ఆ వింతవ్యాధి ఏంటో తెలియడం లేదని శ్రీకాంత్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈక్రమంలోనే శ్రీకాంత్‌ కూడా అదే తరహాలో వాంతులు, విరేచనాలతో ఆస్పత్రి పాలయ్యాడు. అతని రక్త నమూనాలు, వారు వినియోగిస్తున్న నీటి నమూనాలు సేకరించి పరీక్షల కోసం ముంబై పంపించామని వైద్య అధికారులు చెప్తున్నారు. అయితే, జిల్లా వైద్య అధికారులు ఆలస్యంగా స్పందించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

మరిన్ని వార్తలు