ప్చ్‌.. వీళ్లింతే.!

7 Apr, 2022 09:30 IST|Sakshi
కరీంనగర్‌ శివారు ప్రాంతంలో నూనెల తయారీ

కల్తీరాయుళ్లను ముట్టని ఫుడ్‌సేఫ్టీ అధికారులు

మొబైల్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ వాహనమేదీ..?

రాష్ట్రస్థాయిలో ఫిర్యాదు నంబర్‌ 91001 05795

ఆహార తనిఖీ ప్రత్యేక బృందం తమ తనిఖీలింతేనని మరోసారి చాటుకుంది. మంగళవారం జిల్లా కేంద్రంలో ప్రత్యేక బృందం మొక్కుబడి తనిఖీలు నిర్వహించి చేతులు దులుపుకుంది. ఇప్పటికే జిల్లాలో సదరు విభాగం ఖాళీలతో కునారిల్లుతుండగా.. ప్రత్యేక తనిఖీ బృందం నామమాత్రంగా వ్యవహరించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. రాష్ట్రవ్యాప్త తనిఖీల్లో భాగంగా ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేయగా జిల్లాలో జరిగిన తనిఖీలు మాత్రం తూతూమంత్రంగా ముగించడం విడ్డూరం. మీడియాకు సమాచారమివ్వకుండా మొత్తానికి అయ్యిందనిపించారు. – కరీంనగర్‌ అర్బన్‌

మొక్కుబడిగా శాంపిళ్ల సేకరణ
ఆయిల్‌ ట్రేడర్లు, బేకరీలు, హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు, పండ్ల దుకాణాలు, కేఫ్‌లు, కూల్‌డ్రింక్‌ షాపులు, చిరుతిళ్ల తయారీ కేంద్రాలు, ఇతర నిత్యావసర సరుకుల కల్తీకి ముకుతాడు వేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక తనిఖీలకు శ్రీకారం చుట్టింది. కానీ.. జిల్లా కేంద్రంలో జరిగిన తనిఖీలు మాత్రం నవ్విపోదురు గాక.. అన్నట్లు సాగింది. ప్రత్యేక బృందం మొబైల్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ వాహనంతో అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించి కేసులు నమోదు చేయాల్సి ఉండగా సదరు వాహనం జాడే లేకపోవడం విచిత్రం. మొక్కుబడిగా పలు దుకాణాలను తనిఖీ చేసినట్లు చేసి శాంపిళ్లను సేకరించి పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. 15 రోజుల అనంతరం సదరు ఫలితాలు రానుండగా అప్పుడు కేసులు నమోదు చేయనున్నారు. 

కల్తీరాయుళ్ల వైపు కన్నెత్తని అధికారులు
కాగా.. తనిఖీలు ఒకరిద్దరి కనుసన్నలో సాగినట్లు తెలుస్తోంది. ప్రకాశంగంజ్‌లోని పలువురు వ్యాపారులు, బొమ్మకల్, తీగలగుట్టపల్లి, అల్గునూరు, కోతిరాంపూర్, పద్మనగర్, విద్యానగర్, రేకుర్తి పలు ప్రాంతాల్లో కల్తీ వ్యాపారం విచ్చలవిడిగా సాగుతోంది. సన్‌ఫ్లయిర్‌ ఆయిల్‌కు కొరత ఏర్పడటంతో పెద్ద ఎత్తున సూపరోలిన్‌ ఆయిల్‌ కలుపుతున్నారు. లీటరు నూనెపై అదనంగా రూ.70–80 వరకు లాభం పొందుతున్నారు. ఇంత జరుగుతుంటే ప్రత్యేక టీమ్‌ మాత్రం తనిఖీలు చేశామన్నట్లు చేసి చేతులు దులుపుకున్నారు.

సూపరోలిన్‌ ఆయిల్‌ అంటే
పామాయిల్‌ బ్లెండింగ్‌ చేసి పామోలిన్‌ తయారు చేస్తారు. దీన్ని మరింత రిఫైన్‌ చేస్తే సూపరోలిన్‌ ఆ యిల్‌ వస్తుంది. ఇది చూడ్డానికి వాటర్‌ లాగే ఉంటుంది. సన్‌ఫ్లవర్‌ కంటే తక్కువ ధరకే లభిస్తుంది. పైగా అందులో కలిపినా ఎం తేడా కనిపించదు. 

విజృంభిస్తున్న కల్తీ మాఫియా
శివారు ప్రాంతాల్లో గోడౌన్లను కేంద్రంగా చేసుకుని కల్తీకి పాల్పడుతున్నారు. పామాయిల్, తవుడు నూనెలను కలుపుతూ వేరుశనగ, పొద్దుతిరుగుడు నూనెల పేరుతో మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. అధికార యంత్రాంగాన్ని పటిష్టం చేయడంలేదు. జిల్లా కేంద్రం జనాభా 3 లక్షలకు పైమాటే. జిల్లా జనాభా 10 లక్షలు కాగా.. ఆహార తనిఖీలో అన్ని పోస్టులూ ఖాళీగా ఉండటం ఆందోళనకర పరిణామం.

అసలు తనిఖీలే లేవ్‌
ఆహార తనిఖీ విభాగం ప్రతీ నెలలో తప్పనిసరిగా తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుంది. 
►   గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్, ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్లకు ఒక్కొక్కరికి నిర్ణీత లక్ష్యముంటుంది. 
►   ఆరు నెలలుగా అధికారే లేక కార్యాలయం వెలవెలబోతోంది. 
►   ఉన్న పోస్టులన్నీ ఖాళీయే కాగా ఇన్‌చార్జి అధికారితో నెట్టుకొస్తున్నారు. 
►   ఒక గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌తో పాటు ఇద్దరు ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్లు, ఒక క్లర్క్, ఇద్దరు అటెండర్లు కార్యాలయంలో విధులు నిర్వహించాల్సి ఉంది. 
►  అయితే 1985లో అప్పటి జనాభా ప్రాతిపదికన పోస్టులు మంజూరు చేయగా నేడు జనాభా పదింతలు పెరిగినప్పటికి అదే విధానం కొనసాగడం విడ్డూరం. పోనీ అప్పటి

మంజూరు పోస్టుల ప్రకారం అధికారులూ లేరు 
►  దీంతో ఆహార తనిఖీ ప్రక్రియ అటకెక్కడంతో కల్తీ మాఫియా ప్రజల ప్రాణాలతో రాజ్యమేలుతోంది. 
►   ఇన్‌చార్జి పాలనతో ఎప్పుడొస్తారో.. ఎప్పుడుంటారో తెలియని పరిస్థితి. 
►   ఫిర్యాదు చేసినా ఆహార తనిఖీ అధికారులు పట్టించుకోని క్రమంలో రాష్ట్రస్థాయిలో ఫిర్యాదు చేయొచ్చు ఫోన్‌ నంబర్‌ 9100105795

చదవండి: మొదటి సారి దొంగతనం, అంతా అనుకున్నట్లే జరిగింది.. కానీ చివరిలో..

మరిన్ని వార్తలు