కన్సల్టెన్సీలకు అనుమతులు ఉన్నాయా

21 Sep, 2022 15:46 IST|Sakshi
సిపీకి ఫిర్యాదు ఇస్తున్న బాధిత కుటుంబాలు (ఫైల్‌)

కరీంనగర్‌లో ఇష్టానుసారంగా వెలుస్తున్న కన్సల్టెన్సీలు

నిరుద్యోగులకు ఉపాధి ఆశచూపి విమానమెక్కిస్తున్న ఏజెంట్లు

వెళ్లినవారిలో షాబాజ్‌ఖాన్‌ది దయనీయ గాధ

పెళ్లైన వారానికే కంబోడియాకు ప్రయాణం

తమవారి క్షేమంపై కుటుంబసభ్యుల ఆందోళన

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: విదేశాలకు పంపుతామంటూ కరీంనగర్‌లో ఇష్టానుసారంగా కన్సల్టెన్సీలు వెలుస్తున్నాయి. తాజాగా కంబోడియాలో ఐదుగురు యువకులను సైబర్‌ స్కాం ముఠా చేతిలో బందీలుగా చిక్కడంతో ఈ కన్సెల్టెన్సీల విశ్వసనీయతపై ఇప్పుడు సందేహాలు మొదలయ్యాయి. విదేశాల్లో చదువుకోవడం, కొలువులు చేయడం కొన్నేళ్లుగా కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా విద్యార్థులు, నిరుద్యోగులకు సాధారణ విషయం.

ఇలాంటి వ్యవహారాల్లో విద్యార్థులకు పెద్దగా ఇబ్బందులేమీ ఉండవు. అడ్మిషన్‌ ఖరారయ్యాక నేరుగా వర్సిటీకి వెళ్లి చదువుకుంటారు. కానీ.. ఉపాధి చూపిస్తామని వెలిసే కన్సల్టెన్సీలకు అన్ని అనుమతులు ఉన్నాయా? కేంద్ర ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నాయా? అంటే ఈ విషయానికి సమాధానం నిర్వాహకులే చెప్పాలి. మరోవైపు ఐదుగురు యువకుల క్షేమంపై వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అప్పులు చేసి వారిని కాంబోడియాకు పంపామని, మరోసారి రూ.3 లక్షలు చెల్లించే స్థోమత లేదని వాపోతున్నారు. వీలైనంత త్వరగా వారిని క్షేమంగా ఇండియాకు తీసుకురావాలని వేడుకుంటున్నారు.

● నగరంలో ఇష్టానుసారంగా వెలుస్తున్న కన్సల్టెన్సీలు 
● నిరుద్యోగులకు ఉపాధి ఆశచూపి విమానమెక్కిస్తున్న ఏజెంట్లు 
● వెళ్లినవారిలో షాబాజ్‌ఖాన్‌ది దయనీయ గాధ 
● పెళ్లైన వారానికే కంబోడియాకు ప్రయాణం 
● తమవారి క్షేమంపై కుటుంబసభ్యుల ఆందోళన 

భారతీయ నిరుద్యోగులను విదేశాలకు పంపి ఉపాధి చూపించే కన్సెల్టెన్సీలు విధిగా పాటించాల్సిన నిబంధనలను కేంద్ర విదేశాంగశాఖ తన వెబ్‌సైట్‌లో స్పష్టంగా పేర్కొంది. 
1. ఇమిగ్రేషన్‌ యాక్ట్‌ 1983 (సెక్షన్‌ 10) ప్రకారం.. ఎవరైతే భారతీయులకు విదేశాల్లో ఉపాధి కల్పన చేయాలనుకునే రిక్రూటింగ్‌ ఏజెన్సీలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేసు
కోవాలి. 

2. ఐదు సంవత్సరాల కాలపరిమితితో కూడిన సర్టిఫికెట్‌ కోసం రూల్‌.నెం.7 ప్రకారం.. రూ.25 వేలు చెల్లించాలి. 
3. ఈ దరఖాస్తు ఫారాలు emigrate.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. 
4. ఈ క్రమంలో ప్రతీ రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీ గ్యారెంటీ కింద రూ.50 లక్షలు బ్యాంకులో జమచేయాలి. 
5. రిక్రూటింగ్‌ ఏజెన్సీ నిర్వాహకుడి వ్యక్తిగత ప్రవర్తన, ఇతర విషయాల్లో పోలీసులు విచారణ జరిపి ఉండాలి. 
6. అయితే.. చేతిలో రూ.నాలుగైదు లక్షలు ఉన్న ప్రతీవారు కన్సెల్టెన్సీలు, రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీ

పెళ్లైన వారానికే విమానమెక్కిన 
కంబోడియాలో చిక్కుకున్న ఆరుగురిలో షాబాజ్‌ఖాన్‌ది అత్యంత దయనీయ పరిస్థితి. షాబాజ్‌కు ఇటీవలే వివాహం అయింది. తన మేనమామకు ఆరోగ్యం బాగాలేదని అతను ఉండగానే వివాహం చేసుకోవాలని.. పెద్దలు హడావిడిగా పెళ్లి చేశారు. ఆగస్టు 25 తేదీన రిసెప్షన్‌ జరిగింది. ఓ వైపు రిసెప్షన్‌ జరుగుతుండగానే.. షాబాజ్‌ మేనమామ మరణించారు. వారంతా ఈ బాధలో మునిగిపోయారు. వీసా వచ్చిందన్న సమాచారంతో వెంటనే నూతన వధువైన తన భార్య, కుటుంబ సభ్యులను వదిలి ఆగస్టు 31వ తేదీన కంబోడియా విమానమెక్కాల్సి వచ్చింది. తాను అక్కడ చైనా వారు చెప్పే సైబర్‌ నేరాలు చేయలేకపోతున్నానని.. వెంటనే ఇంటికి తీసుకువచ్చే ఏర్పాటు చేయాలని కుటుంబీకులకు ఫోన్లో విలపిస్తూ వేడుకుంటున్నాడు. 

మా సోదరుడిని కాపాడండి 
మా సోదరుడు షాబాజ్‌ ఖాన్‌కు వీసా ఇప్పిస్తానని మేనాజ్‌ అలీ నమ్మబలికాడు. కెసీనోలో మంచి జీతం (800 డాలర్లు) వస్తుందని, ప్రతిరోజూ టిప్పులు కూడా దొరుకుతాయని ఆశపెట్టాడు. అందుకే.. మేము రూ.2 లక్షలు ఖర్చు అయినా పంపేందుకు వెనకాడలేదు. షాబాజ్‌కు ఆగస్టులో నెలలో వివాహమైంది. వీసా రావడంతో రిసెప్షన్‌ అయిన నాలుగైదురోజుల అనంతరం విదేశాలకు పంపాం. తీరా అక్కడికెళ్లాక మావాడిని బందించారు. రూ.3 లక్షలు లేదా 3,000 డాలర్లు ఇవ్వాలంటున్నారు. 
– అఫ్జల్, షాబాజ్‌ సోదరుడు, మానకొండూరు

మా తమ్ముడిని అమ్ముకున్నరు 
కంబోడియా వీసా సిద్ధంగా ఉందని ఏజెంట్లు మేనాజ్‌ అలీ, అబ్దుల్‌ రహీం మా తమ్ముడు నవీద్‌ అబ్దుల్‌కు చెప్పారు. అందరికీ చెప్పినట్లుగా కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఉద్యోగమని, రూ.2 లక్షలు సిద్ధం చేసుకోవాలన్నారు. ఎలాంటి సమస్య రాదని, అన్ని బాధ్యతలు తీసుకుంటామన్నారు. తీరా ఇప్పుడు మా తమ్ముడికి ఇబ్బందులు వస్తున్నాయంటే.. తనకేం సంబంధం లేదన్నట్లుగా మాట్లాడుతున్నాడు. రూ.3 లక్షలు చెల్లిస్తే తాను విడిపిస్తానని చెబుతున్నాడు.
– అబ్దుల్‌ ముహీద్, నవీద్‌ సోదరుడు, సిరిసిల్ల

ముందే అంతా వివరించా 
కంబోడియాకు వెళ్లిన ఆరుగురి యువకుల విషయంలో నా తప్పిదమేమీ లేదు. నేను వారికి ఉద్యోగం ఎలా ఉంటుంది? అన్న విషయం స్పష్టంగా వివరించాను. కెసెనీలో కంప్యూటర్‌ ఆపరేటర్‌ జాబ్‌ అని చెప్పాను. వారూ అంగీకరించే వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లాక.. వారు ఇలా ఎందుకు చెబుతున్నారో అర్థం కావడం లేదు. 
– మేనాజ్‌ అలీ, కన్సల్టెన్సీ నిర్వాహకుడు 

మరిన్ని వార్తలు