ఆయన రాజకీయాలకు దూరమవ్వాలని ఫిక్స్‌ అయిపోయారా?.. ఆ రెండు చోట్ల కొత్త అభ్యర్థులేనా?

17 Nov, 2022 19:38 IST|Sakshi

మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణలో కొత్త పొత్తులకు దారి తీస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో టీఆర్ఎస్‌కు పొత్తు కుదిరితే కరీంనగర్‌ జిల్లాలో హుస్నాబాద్‌ సీపీఐ కోటా కిందకు వెళుతుందనే ప్రచారం సాగుతోంది. అదే నిజమైతే హుస్నాబాద్‌ గులాబీ ఎమ్మెల్యే ఎక్కడ పోటీ చేస్తారు? అసలు బరిలో ఉంటారా? లేదా? 

నాడు కమ్యూనిస్టుల కంచుకోట
హుస్నాబాద్ నియోజకవర్గం.. కరీంనగర్ జిల్లాలో వామపక్షాలకు ఒకనాటి కంచుకోట. ఇక్కడ సీపీఐ నాయకులు దేశిని చిన మల్లయ్య ఐదుసార్లు, చాడ వెంకట్ రెడ్డి ఒకసారి విజయం సాధించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి సతీష్‌కుమార్ విజయం సాధించారు.

ఇప్పుడు తాజాగా వామపక్షాలతో, టీఆర్‌ఎస్ పొత్తు గురించి ప్రచారం జరుగుతుండటంతో.. హుస్నాబాద్‌ టీఆర్ఎస్ ఎమ్మెల్యే దారెటు అనే చర్చ మొదలైంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడినప్పటి నుంచీ పార్టీలో కొనసాగుతున్న కేసీఆర్ మిత్రుడు కెప్టెన్ లక్ష్మీకాంత్ రావ్ తనయుడే సతీష్ కుమార్. టీఆర్‌ఎస్‌లోని ఈక్వేషన్స్ వల్ల వారి సొంత నియోజకవర్గమైన హుజూరాబాద్ నుంచి హుస్నాబాద్ కు వెళ్ళి సతీష్‌కుమార్‌ పోటీ చేసి  గెలిచారు. 

పొత్తు పొడుస్తుందా?
కొత్తగా పొత్తు పొడిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే కరీంనగర్‌ జిల్లాలో సీపీఐ ముందుగా అడిగే స్థానం హుస్నాబాద్‌ అవుతుంది. గులాబీ దళపతి కేసీఆర్‌ కొత్తగా దోస్తీ కలిసిన మిత్రపక్షం కోసం హుస్నాబాద్‌ ఇవ్వడానికి ఒకే అంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ప్రస్తుత టీఆరెఎస్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పరిస్తితి ఏంటనే చర్చ నియోజకవర్గంలోని గులాబీ పార్టీలో జరుగుతోందట.

హుస్నాబాద్ నుంచి మళ్లీ సొంత నియోజకవర్గమైన హుజూరాబాద్‌కు వలస వెళ్లాల్సిన పరిస్తితి ఏర్పడుతుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సతీష్‌కుమార్ కుటుంబం అంతా అక్కడే రాజకీయంగా ఎదిగింది. కుటుంబ వ్యాపారాలు కూడా అక్కడ ఉన్నాయి. ఈటల రాజేందర్‌ కోసం గతంలో సతీష్‌కుమార్‌ను హుస్నాబాద్‌కు పంపించారు కేసీఆర్. ప్రస్తుతం ఈటల బీజేపీలో చేరినందున అక్కడ గులాబీ పార్టీలో కొంతవరకు ఖాళీ ఏర్పడిందంటున్నారు.

చదవండి: (తెలంగాణలో ఎన్నికల వేడి.. కారు ఫైరింగ్‌.. అనూహ్యంగా ఎదిగిన కమలం)

హుజురాబాద్‌తో లింకు
ఈటల రాజీనామా కారణంగా జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్వీ కార్యకలాపాల్లో మళ్లీ నిమగ్నం అయ్యారు. ఆ సీటు ఆశించి కాంగ్రెస్‌ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ సీటుకు  బదులుగా ఎమ్మెల్సీ సీటు దక్కింది. ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ... తానే హుజూరాబాద్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను అంటూ చెప్పుకుంటున్నారు పాడి కౌశిక్‌రెడ్డి.

అయితే ఆయన ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్నందున హుజూరాబాద్ సీటు సతీష్ కుమార్‌కు ఇచ్చే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాల్లో టాక్. కాని ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ భావిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎమ్మెల్సీ పదవిని తీసుకోవాలని కోరుకుంటున్నారట. ఇదే నిజమైతే అటు హుస్నాబాద్ ఇటు హుజూరాబాద్ రెండింటిలోనూ కొత్త అభ్యర్థులు బరిలో దిగుతారని అనుకోవచ్చు.

చదవండి: (MLAs Purchase Case: బండి సంజయ్‌ అనుచరుడు శ్రీనివాస్‌కు సిట్‌ నోటీసులు)

మరిన్ని వార్తలు