పంద్రాగస్టుకు పైసల్లేవ్‌!.. చాక్‌పీస్, డస్టర్‌కు ఇబ్బందులే

11 Aug, 2022 13:55 IST|Sakshi
కొత్తపల్లి జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల

సాక్షి, కరీంనగర్‌: పాఠశాలల నిర్వహణకు విడుదల చేసిన నిధులన్నీ ప్రభుత్వం తిరిగి వెనక్కి తీసుకోవడంతో స్కూల్‌ గ్రాంటు ఖాతాలు ఖాళీగా మిగిలాయి. ‘మన ఊరు–మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలన్నింటికి మౌలిక వసతుల కల్పనకు పెద్దఎత్తున నిధులు వెచ్చించి అభివృద్ధి చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ మాట దేవుడెరుగు కానీ గత విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాల నిర్వహణకు విడుదలైన నిధులను తిరిగి ఏప్రిల్‌లో ప్రభుత్వ ఖాతాలోకి మళ్లించడంతో పాఠశాలల బ్యాంక్‌ అకౌంట్‌ ఖాతాలన్ని ఖాళీ అయ్యాయి.

జిల్లాలో కొందరు పాఠశాల గ్రాంటును వినియోగించుకోగా, మిగిలిన నిధులు ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఉపయోగించుకుందామని అనుకున్నారు. వెనక్కి తీసుకోవడంతో చాక్‌పీస్‌లు, డస్టర్‌ కొనుగోళ్లకు ఇబ్బందులు పడుతున్నారు. సొంత డబ్బులు ఖర్చు చేస్తూ అవసరాలను తీర్చుకుంటున్నారు.

స్కూల్‌ గ్రాంటు ఖర్చు ఇలా
జిల్లాలో వివిధ విభాగాల్లో గల 652 పాఠశాలల్లో 42,218 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాల గ్రాంటుతో ప్రధానోపాధ్యాయులు చాక్‌పీసులు, డస్టర్లు, విద్యార్థుల హాజరు పుస్తకాలు, ఇతరత్రా సామగ్రి కొనుగోలు చేస్తారు. గణతంత్ర దినం, రాష్ట్ర అవతరణ దినం, స్వాతంత్య్ర దినోత్సవం తదితర జాతీయ దినోత్సవాల్లో పాఠశాలల్లో కార్యక్రమాల నిర్వహణ, సున్నం వేయడం చిన్న మరమ్మతులను ఈ నిధులతో చేసుకోవచ్చు. ఒక్కో పాఠశాలలకు ఆయా పాఠశాలలోని విద్యార్థుల సంఖ్యను బట్టి రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు గ్రాంటు విడుదల చేస్తారు.

ఈ నిధులను అవసరాల మేరకు ఖర్చు చేస్తారు. ప్రభుత్వం అకస్మాత్తుగా పాఠశాలల ఖాతాల్లోని నిధులను వాపసు తీసుకోవడంతో చిన్న అవసరాలకూ తమ జేబు నుంచి ఖర్చు పెట్టాల్సి వస్తోందని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.

విద్యార్థుల సంఖ్య ఆధారంగా
ప్రభుత్వ, జెడ్పీ, గిరిజన సంక్షేమ ప్రాథమిక, క్రీడా పాఠశాలలు, అంధ, మూగ, చెవిటి పాఠశాలలకు ఆయా పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్యను ఆధారంగా గ్రాంటు విడుదల చేస్తుంది.1–15 మంది విద్యార్థులు ఉంటే రూ.12,500, 16–100 మంది విద్యార్థులకు రూ.25,500, 101 నుంచి 250 మంది విద్యార్థులకు రూ.50 వేలు, 251–1000 మంది విద్యార్థులు ఉంటే రూ.75 వేలు, 1000కిపైగా విద్యార్థులు ఉంటే రూ.లక్ష చొప్పున నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుంది. 
చదవండి: క్రికెట్‌ ఆడుతూ గుండెపోటుతో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మృతి 

విచారకరం
పాఠశాలల నిర్వహణకు వచ్చిన నిధులను ప్రభుత్వం తిరిగి తీసుకోవడం విచారకరం. తక్షణమే స్కూల్‌ గ్రాంట్‌ నిధులను విడుదల చేయాలి. చిన్నపాటి అవసరాలకు పాఠశాలల్లో నిధులు లేకపోవడంతో ప్రధానోపాధ్యాయులు, టీచర్లు సతమతమవుతున్నారు. 75 సంవత్సరాల వజ్రోత్సవ వేడుకలను పాఠశాలల్లో నిర్వహించుకునేందుకు నిధులు లేకపోవడంతో ఇబ్బందిగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేయాలి.    – పోరెడ్డి దామోదర్‌రెడ్డి, టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు

ప్రధానోపాధ్యాయులదే బాధ్యత...
ఆర్థిక సంవత్సరం పూర్తి కావడంతో పాఠశాలకు సంబంధించిన నిధులు ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. త్వరలోనే ప్రభుత్వం సంబంధిత పాఠశాలల ఖాతాలకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు జమ చేస్తుంది. అప్పటివరకు ప్రధానోపాధ్యాయులే పాఠశాల నిర్వహణకు సంబంధించి నిధులు ఖర్చు చేయాలి. నిధులు రాగానే ప్రధానోపాధ్యాయులకు చెల్లించడం జరుగుతుంది.          
– సీహెచ్‌ జనార్దన్‌రావు, జిల్లా విద్యాశాఖాధికారి, కరీంనగర్‌ 

మరిన్ని వార్తలు