కోరిన స్ట్రీట్‌ఫుడ్‌.. క్షణాల్లో ఇంటికి!

28 Feb, 2021 14:57 IST|Sakshi

ముందుకు వచ్చిన 100 మంది వ్యాపారులు

ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ తయారీ

ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే చాలు నేరుగా ఇళ్లకు చేరవేత

లాంఛనంగా ప్రారంభించిన మేయర్‌ వై.సునీల్‌రావు, మున్సిపల్‌ కమిషనర్‌ క్రాంతి    

కరీంనగర్‌సిటీ: మనం రోడ్లపై వెళ్తుంటే వేడి వేడి బజ్జీలు.. ఇడ్డీలు.. సమోసాలు.. పానీపూరీ, కట్‌లెట్స్, వడలు ఇలా అనేక పదార్థాలు నోరూరిస్తూ ఉంటాయి. అయితే మనకు ఉన్న రకరకాల పని ఒత్తిళ్ల వల్ల బండ్ల వద్ద నిలబడలేకనో, ఇతర కారణాలతోనో తినాలని ఉన్నా తికలేకపోతుంటాం. ఇక ఆ చింత అవసరం లేదు. మీరు కోరుకున్న స్ట్రీట్‌ఫుడ్‌ క్షణాల్లో మీ ఇంటికే రానుంది. కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో వివిధ రకాల వీధి వంటకాలను స్విగ్గీతో అనుసంధానం చేశారు. మెప్మా ఆధ్వర్యంలో  100 మంది వ్యాపారులు ముందుకు వచ్చారు. కరీంనగర్‌ మేయర్‌ వై.సునీల్‌రావు, మున్సిపల్‌ కమిషనర్‌ క్రాంతి ప్రత్యేక చొరవతో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మెప్మాలో నమోదు చేసుకున్న వీధి వ్యాపారులకు ఇప్పటికే ఆత్మనిర్భర్‌ ద్వారా రుణాలు ఇప్పించారు. వారికి మరింత చేయూతనిచ్చేందుకు ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన వీధి వంటకాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వ్యాపారులకు అండగా నిలిచేందుకు స్విగ్గీ సంస్థ ముందుకు రాగా వారితో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 

ఆన్‌లైన్‌లో నమోదు చేస్తే చాలు..

ఇప్పటికే అనేక రకాల ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఎన్నో సంస్థలు ఆన్‌లైన్‌లోనే వివిధ రకాల ఆహార పదార్థాలను అందిస్తున్నాయి. ఇందులో భాగంగా స్విగ్గీ యాప్‌లో మనకు కావాల్సిన వీధి వంటకాల పేర్లు నమోదు చేస్తే చాలు వాటిని నేరుగా ఇంటికి చేరవేస్తారు. ఇందుకోసం మెప్మా ద్వారా ఎంపిక చేసిన చిరు వ్యాపారులకు నిపుణులతో శిక్షణనిస్తారు. వంటకాల నాణ్యత, శుభ్రతతో ఎలా తయారు చేయాలి, ప్యాక్‌ చేసే క్రమంలో తీసుకునే జాగ్రత్తలు ఇలా వారి వ్యాపారాన్ని మార్కెటింగ్‌ చేసుకునే విధానంలోనూ మెలకువలు నేర్పుతారు. ఫుడ్‌సేఫ్టీ, స్టాండర్డ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ధ్రువపత్రాలు మెప్మా ద్వారా అందిస్తారు. మొబైల్‌లో ఉండే స్విగ్గీ యాప్‌లో ఇలా ఆర్డర్‌ చేయగానే వేడివేడి పదార్థాలు ఇంటికి వచ్చేస్తాయని మెప్మా అధికారులు తెలిపారు. పీఎం స్వనిధి ద్వారా రుణాలు పొందిన వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. 

ప్రయోజనాలు ఇవీ..

ఈ కార్యక్రమం వల్ల ఇటు వినియోగదారుడికి, అటు అమ్మకందారులకూ ఎన్నో  ప్రయోజనాలు ఉంటాయని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం వీధి వ్యాపారులు తమ బండ్ల వద్ద ఎంత ధరకు ఆహార పదార్థాలు విక్రయిస్తున్నారో అంతే ధరను ఆర్డర్‌ ప్రకారం వారం రోజులకోసారి స్విగ్గీ వారికి చెల్లిస్తుంది. దీనివల్ల ఎవరికీ ఎలాంటి నష్టం ఉండదు. పైగా వారి వ్యాపారం మరింత విస్తరించుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు కరీంనగర్‌లోని కమాన్‌ ప్రాంతంలో దోశ రూ.30 ఉంటే వీధి వ్యాపారులకు స్విగ్గీ అంతే మొత్తం చెల్లించి, సదరు ఆహారం తీసుకెళ్లి కొంత సర్వీస్‌ ఛార్జీ కలిపి వినియోగదారుడి వద్ద నుంచి తీసుకుంటుంది. 

అనేక ప్రాంతాల్లో వీధి వంటకాలు...

కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో అనేక ప్రాంతాల్లో వీధి వంటకాలు లభిస్తాయి. ఆర్టీసీ బస్టాండ్, కమాన్‌ ప్రాంతం, క్లాక్‌ టవర్, కోర్టు చౌరస్తా, రాంనగర్, కోతిరాంపూర్, ఎన్టీఆర్‌ విగ్రహం, మంచిర్యాల చౌరస్తా, కలెక్టరేట్‌ రోడ్డు, అంబేద్కర్‌ స్టేడియం, సెవెన్‌హిల్స్, జ్యోతిబాఫూలే పార్క్, గీతాభవన్, వన్, టూటౌన్‌ పోలీస్‌స్టేషన్, కాపువాడ, బైపాస్‌రోడ్డు ఇలా అనేక ప్రాంతాల్లో ఉన్న వీధి వ్యాపారులను స్విగ్గీతో అనుసంధానం చేశారు. ఆయాచోట్ల ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ అనేక ఆహార పదార్థాలు లభిస్తాయి.

మరిన్ని వార్తలు