శభాష్‌... స్నితికా!

28 Jun, 2022 03:48 IST|Sakshi
బావిలో పడ్డ పిల్లి. (ఇన్‌సెట్‌లో) తమ్ముడు వేదతో స్నితికా..

బావిలో పడిన పిల్లి పిల్లను కాపాడేదాకా పట్టువదలని బాలిక   

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/కరీంనగర్‌ క్రైం: బావిలో పడిపోయి ఆరు గంటలు అల్లాడిన ఓ పిల్లి పిల్లను ఓ బాలిక సమయస్ఫూర్తి, దయాగుణం రక్షించాయి. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో ఆదివారం సాయంత్రం ఓ ఇంటిలోని బావిలో పిల్లి పడింది. అక్కడే ఆడుకుంటున్న స్థానిక బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగి మనోహర్‌ పిల్లలు స్నితికా, వేద్‌ త్రిదామ్నా పిల్లిని కాపాడేందుకు రాత్రి 8.30 గంటల వరకు విఫలయత్నం చేశారు.

అయితే పిల్లి పిల్లను కాపాడలేకపోయామన్న బాధ స్నితికాను వెంటాడింది. వెంటనే ఆ బాలిక స్మార్ట్‌ఫోన్‌ అందుకొని గూగుల్‌లో సెర్చ్‌ చేసి ‘యానిమల్‌ వారియర్స్‌ కన్జర్వేషన్‌ సొసైటీ’ నంబర్‌ సేకరించింది. పిల్లి పిల్ల దయనీయస్థితిని వివరిస్తూ వారికి వీడియో పంపింది. సొసైటీవారి సూచనల మేరకు పిల్లిపిల్లను కాపాడేందుకు మళ్లీ ప్రయత్నించి విఫలమైంది. ఈలోగా రాత్రి 10.30 గంటలు సమయమైంది.

మరోసారి సొసైటీవారికి ఆ విషయం చెప్పింది. సొసైటీ ప్రతినిధులు కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణకు ఫోన్‌ చేసి విషయం చెప్పగా ఆయన ఏసీపీ తుల శ్రీనివాస్‌రావును అప్రమత్తం చేశారు. కానిస్టేబుల్‌ అంజిరెడ్డి బృందం, ఫైర్‌ సిబ్బంది రాత్రి 11 గంటలకు స్థలానికి చేరుకుని కేవలం 15 నిమిషాల్లో ఆ పిల్లి పిల్లను కాపాడారు. 

ఎలాగైనా కాపాడాలనుకున్నా
స్నితికా, ఇంటర్‌ ఫస్టియర్, కరీంనగర్‌ పిల్లి పిల్ల బావిలో పడి తల్లడిల్లుతుంటే నాకు బాధగా అనిపించింది. ఎలాగైనా దాన్ని కాపాడాలనుకున్నా. యానిమల్‌ రెస్క్యూ బృందం ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వచ్చి పిల్లిని కాపాడటంతో నా మనసు కుదుటపడింది. (క్లిక్: ఎనిమిదేళ్ల క్రితం తప్పిపోయి.. ఇంటికి చేరిన బాలిక)

మరిన్ని వార్తలు