‘చాయ్‌ తాగి పో’, ‘ఊకో కాక’.. ఇవన్నీ షాపుల పేర్లండి బాబోయ్‌!

8 Aug, 2021 13:48 IST|Sakshi

వాడుక భాషలో వ్యాపార సంస్థల పేర్లు

కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు..

సాక్షి, కరీంనగర్‌: ‘అరేయ్‌.. ఎక్కడున్నవ్‌’.. ‘చాయ్‌ తాగి పో’.. ‘ఊకో కాక’.. ‘కమాన్‌ ఫ్రెండ్‌’.. రాకేన్‌ రోల్‌.. ‘చాయ్‌ వాలా’.. ఇవీ మనం రోజువారీ సంభాషణలో మాట్లాడుకునే పదాలు. ఇప్పుడు ఇవే పదాలు కరీంనగర్‌లోని వ్యాపార కూడళ్లలో హోర్డింగ్‌లపై దర్శనమిస్తున్నాయి. మారిన ట్రెండ్‌కు అనుగుణంగా వ్యాపారులు కస్టమర్లను ఆకట్టుకునేలా సరికొత్తగా ఆలోచిస్తున్నారు. వాడుక భాష పదాలనే పేర్లుగా పెడుతున్నారు. గతంలో వ్యాపారాలకు దేవుళ్ల పేర్లు, ఇంటిలోనిపిల్లల పేర్లు, పెద్దల పేర్లు, ఇంటిపేర్లు పెట్టేవారు. ఇంకొందరు పేరు బలం చూసి, సంఖ్య, శాస్త్రప్రకారంగా పేర్లు పెట్టేవారు. ఇప్పుడు మన మాటలు.. వాడే ఊత పదాలు, వంటకాల పేర్లు, కూరగాయలు, పిండి వంటల పేర్లు హోర్డింగ్‌లకు ఎక్కుతున్నాయి. వెరైటీ పేర్లు ఇటు కస్టమర్లనూ ఆకట్టుకుంటున్నాయి.  

తెలంగాణ యాసలో..
తెలంగాణ యాసలో చాయ్‌ బాబు చాయ్, మిర్చి, చాయ్, అమ్మ కర్రిపాయింట్, జస్ట్‌ ఫర్‌ యూ వంటి క్యాచీ పేర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. వ్యాపారాలు నిర్వహించే వారు వాడుకభాషలో పేర్లు పెడుతున్నారు. అందరి నోళ్లలో నానిన పదాలతో పేర్లు పెట్టి ప్రజలను ఆకర్షిస్తున్నారు.

ఫ్రీ పబ్లిసిటీ..
కరీంనగర్‌లో ఏదైన షాప్‌ ప్రజల్లోకి వెళ్లాలాంటే పబ్లిసిటి తప్పని సరి. షాపులు, హోటల్స్‌ ఇతర వ్యాపార సంస్థలు యాడ్స్, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు పెట్టి ప్రచారం చేయాలి. వీఐపీలు, సెలబ్రెటీలతో ప్రారంభోత్సవాలు చేయించాలి. వ్యాపారం జోరుగా సాగాలంటే కూడా అదే స్థాయిలో ప్రచారం ఉండాలి. అవేవి లేకుండా కొత్త ట్రెండ్‌లో పేర్లు పెడుతూ రెట్టింపు పబ్లిసిటీ పొందుతున్నారు. జనం వాడుక భాషనే ప్రధానంగా చేసుకుని పేర్లు పెడుతున్నారు. 

పుల్‌గా ఉండాలని..
పెద్ద పెద్ద పేర్లు, నోరు తిరగని పేర్లు ఉండడం వల్ల జనానికి ఎక్కువగా గుర్తు ఉండదు. అందుకే సింపుల్‌గా అందరికీ అనువుగా గుర్తుండేలా కాస్త కొత్తగా ఉండేలా ‘తారక’ అనే పేరుపెట్టాం. పలకడానికి, వినడానికి కూడా బాగుండడంతో అందరి నుంచి స్పందన బాగుంది.
– తోట కోటేశ్వర్, తారక రెస్టారెంట్, బస్టాండ్‌ రోడ్, కరీంనగర్‌

ఫ్రెండ్లీగా ఉండాలని..
అందరికీ సన్నితంగా, ఫ్రెండ్లీగా ఉండాలనే ఉద్దేశంతో చాయ్‌ తాగి పో.. పేరుతో వివిధ ఫ్లెవర్లలో టీ, స్నాక్స్‌ అందించే సెంటర్‌ను రెండు నెలల క్రితం ప్రారంభించా. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. పేరు కొత్తగా ఉండడంతో ప్రతిఒక్కరూ ఆసక్తిగా వస్తూ ఆదరిస్తున్నారు. 
– తాటికొండ రాజు, శివ థియేటర్‌ దగ్గర, జ్యోతినగర్, కరీంనగర్‌

ఆంధ్రాలో చూసి..
12 ఏళ్ల కిత్రం కరీంనగర్‌లో రెడ్డి గారి వంటిల్లు పేరున మెస్‌ ప్రారంభించాం. ప్రజల ఆదరణ లభించింది. ఆంధ్రాలోని పలు ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ ఇలాంటి పేర్లు ఉండడం గమనించా. ఇక్కడ మెస్‌ ప్రారంభించే సమయంలో అదే ఆలోచనతో రెడ్డి గారి వంటిల్లు అని పేరు పెట్టా.  అందరి ఆదరణ లభించి వ్యాపారం సాఫీగా సాగుతోంది.
– బారాజు రామిరెడ్డి, డీఐజీ బిల్డింగ్‌ దగ్గర, జ్యోతినగర్, కరీంనగర్‌ 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు