Karimnagar: ఉమక్క, రమేశ్‌ బావ క్షమించండి.. కంటతడి పెట్టిస్తోన్న లేఖ

3 Jan, 2023 19:52 IST|Sakshi
రాజు (ఫైల్‌)

సాక్షి, కరీంనగర్‌: హుజూరాబాద్‌  పట్టణం సాయిబాబా గుడి సమీపంలో అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ఓ అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటననాలస్యంగా వెలుగుచూసింది. దీనికి  సంబంధించి కాలనీవాసులు, పోలీసుల కథనం ప్రకారం.. పట్టణానికే చెందిన జంగిలి రాజు (30) స్థానిక సాయిబాబా గుడి సమీపంలో అద్దె ఇంట్లో ఉంటూ స్థానిక ఓ వైన్‌షాపులో కూలీగా పనిచేస్తున్నాడు. కరోనా సమయంలో అతడి తల్లి మృతిచెందింది. అప్పటినుంచి ఒంటరిగానే ఉంటున్నాడు. రాజు ఉండే ఇంటి పరిసరాల నుంచి సోమవారం దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

వారు వచ్చి ఇంటి తలుపులు తెరిచి చూడగా రాజు కుళ్లిపోయిన స్థితిలో శవమై కనిపించాడు. ఆయన చుట్టూ రక్తం ఉండడం.. శరీరం నుంచి ద్రవాలు వెలువడడంతో ముఖమంతా ఏర్పడకుండా మారిపోయింది. అతడి సెల్‌ఫోన్‌ సైతం స్విచ్‌ ఆఫ్‌ అయి ఉంది. బంధువులకు సమాచారం అందించగా.. వారం నుంచి అతడి సెల్‌ స్విచ్‌ ఆఫ్‌ అని వస్తోందని తెలిపారు. అయితే రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడా..? మరేదైనా కారణమా..? అనే విషయం విచారణ చేసిన తర్వాతే తెలిసే అవకాశం ఉందని పో లీసులు చెబుతున్నారు. గది లోపలి నుంచి తలుపులకు తాళం వేసి ఉండడంతో మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకున్నాడా..? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
చదవండి: హైదరాబాద్‌లో దారుణం.. ఆర్డర్ ఆలస్యమైందని, ఫుడ్ డెలివరీ బాయ్‌పై దాడి

సూసైడ్‌ నోట్‌లో ముగ్గురి పేర్లు..
రాజు మృతదేహం వద్ద సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో తన చావుకు చిన్నమ్మ అనసూర్య, శ్రీధర్, శివ కారణమని రాసి ఉంది. తన అమ్మ చనిపోయిన తర్వాత అక్క, బావ చేరదీశారని, అయితే పై ముగ్గురితో మానసికంగా ఇబ్బందిపడ్డానని, అనసూర్య, ఆమె కొడుకులు తనను కొడుతున్నారని, వారివల్లనే జీవితంపై విరక్తి కలిగిందని, అందుకే ఇంజక్షన్‌ తీసుకుంటున్నానని రాసి ఉంది. తన చావుకు కారణమైన వారిపై చర్య తీసుకోవాలని కూడా ఆ ఉత్తరంలో కోరాడు. 

ఉమక్క, రమేశ్‌బావ క్షమించండి.. 
‘ఉమక్క నన్ను క్షమించు’ అంటూ రాజు రాసిన లేఖ కంటతడి పెట్టించింది. ‘ఉమక్క భయం వేస్తుంది. నాకు చావాలని లేదు. నన్ను జంగిలి అనసూర్య, శివ, శ్రీధర్‌ తిడుతూ కొడుతున్నారు. వాళ్ల వల్లే చనిపోతున్నా. ఇంజక్షన్‌ వేసుకున్నాక ఎలా ఉంటుందో నాకు తెల్వది. ఆ ఇంజక్షన్‌ వేసుకున్న తర్వాత చస్తే నా బాడీ కుళ్లిపోయి వాసన వచ్చేవరకు ఎవరూ రారేమో. బహుశా మీరు కూడా చూసే అవకాశం ఉండదేమో. ఎందుకంటే అంతగా నా బాడీ కుళ్లి పోయి ఉంటుంది. కనుక నన్ను క్షమించండి’ అంటూ లేఖలో పేర్కొన్నాడు. లేఖలోని విషయాలపైనా పో లీసులు లోతుగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. 

మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు