జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ కేవీఆర్‌ మృతి

27 Aug, 2020 12:23 IST|Sakshi
కేవీ రాజేశ్వర్‌రావు(ఫైల్‌) 

సాక్షి, మెట్‌పల్లి(కోరుట్ల)/కరీంనగర్‌: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్, మెట్‌పల్లి ఖాదీ ప్రతిష్టాన్‌ చైర్మన్‌ కేవీ రాజేశ్వర్‌రావు(84) హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో బుధవారం గుండెపోటుతో మృతిచెందారు. మల్లాపూర్‌ మండలం మొగిలిపేటకు చెందిన కేవీ ఆ గ్రామ సర్పంచ్‌గా రెండు దశాబ్దాలపాటు పని చేశారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం తర్వాత పార్టీలో చేరిన ఆయన 2001లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో మెట్‌పల్లి నుంచి  పోటీచేసి గెలుపొందారు. అనంతరం కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెట్‌పల్లి నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.

ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో 2005లో కాంగ్రెస్‌లో చేరారు. 2008లో మెట్‌పల్లి ఖాదీ ప్రతిష్టాన్‌ చైర్మన్‌గా నియమితులైన కేవీ ఇప్పటికీ ఆ పదవిలో కొనసాగుతున్నారు. జిల్లా పరిషత్‌ చరిత్రలో అత్యధిక నిధులు తీసుకువచ్చిన చైర్మన్‌గా ఘనత సాధించారు. రాజేశ్వర్‌రావుకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. కేవీ మృతిపట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రాణవేని సుజాత, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు, ధర్మపురి దేవస్థానం కమిటీ మాజీ అధ్యక్షుడు జువ్వాడి కృష్ణారావు సంతాపం తెలిపారు.  

మరిన్ని వార్తలు