దేశానికి కేసీఆర్‌ అనుభవం అవసరం.. ఉద్యమ నేతకే నా సపోర్ట్‌: మాజీ సీఎం కుమారస్వామి

11 Sep, 2022 19:51 IST|Sakshi

సాక్షి, హైద‌రాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జాతీయ రాజకీయాలు చర్చించేందుకు కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి నగరానికి వచ్చిన విషయం తెలిసిందే. కాగా.. ఆదివారం కేసీఆర్‌తో కుమారస్వామి ప్రగతి భవన్‌లో భేటీ అయ్యారు. 

వీరిద్దరూ దాదాపు 3 గంటల పాటు నేషనల్‌ పాలిటిక్స్‌పై చర్చించారు. ఇక, భేటీ అనంతరం మాజీ సీఎం కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్‌. ప్రస్తుతం దేశానికి కేసీఆర్‌ అనుభవం అవసరం. కేసీఆర్‌ జాతీయ పార్టీని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాను.  దేశానికి తెలంగాణ మోడల్‌ కానుంది. దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ వేదిక అవసరం. బీజేపీ ముక్త్‌ భారత్‌ కోసం కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. 

ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో సీఎం కేసీఆర్‌.. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వ విధానాలను సైతం తప్పుపడుతున్నారు. నిరుదోగ్యం పెరిగిపోయిందని, రూపాయి విలువ పతనమైందని, ప్రభుత్వ రంగ స​ంస్థలను మోడీ సర్కార్‌ అమ్మేస్తోందని ఆరోపించారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో బీజేపీ ముక్త్‌ భారత్‌ కావాలని దేశ ప్రజలను కోరారు. తాను జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నానని తెలిపారు. అందులో భాగంగానే ప్రతిపక్ష పార్టీల సీఎంలు, కీలక నేతలను కలుస్తున్నారు.

మరిన్ని వార్తలు