-

Karthika Pournami 2023: కార్తీక పౌర్ణమి.. శివనామ స్మరణతో మార్మోగుతున్న ఆలయాలు

27 Nov, 2023 08:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక పౌర్ణమి, అందులోనూ సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయియి. భక్తుల శివనామస్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున నుంచే భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాన్నారు. భక్తిశ్రద్దలతో దీపాలు వెలిగిస్తున్నారు. వరంగల్‌ భద్రకాళి, అన్నవరం, ద్వారకతిరుమల, భద్రాచలం తదితర ప్రాంతాల్లోని ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది.

సంగారెడ్డి జిల్లా
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే మల్లికార్జున స్వామికి అభిషేకాలు చేయడంతో పాటు ఆలయ ప్రాంగణంలో దంపతులు, మహిళలు వేలాదిగా వచ్చి దీపాలను వెలిగిస్తున్నారు. 

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రహ్లాద్ మాట్లాడుతూ ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి సోమవారం రావడంతో ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. ఉదయం నాలుగు గంటల నుండి స్వామివారి అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అలాగే ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు ఆలయ ప్రాంగణంలో జ్వాలాతోరణం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు.

నిర్మల్‌ జిల్లా 
కార్తీక పౌర్ణమి సందర్భంగా ఖానాపూర్ పట్టణంలో దేవాలయాలు భక్తులతో నిండిపోయాయి. స్థానిక వెంకటేశ్వర స్వామి, హనుమాన్ దేవలయలలో భక్తులు పూజలు నిర్వహించి కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. 

వరంగల్
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని శివాలయాలన్నీ శివనామస్మరణతో మారుమొగుతున్నాయి. హన్మకొండలోని రుద్రశ్వరస్వామి (వెయ్యి స్తంభాల గుడి), సిద్దేశ్వరా స్వామి దేవాలయం, భద్రకాళి భద్రశ్వరా స్వామి దేవాలయాల్లో తెల్లవారు జామునుంచి భక్తులు బారులు తీరారు. కార్తీకపౌర్ణమి పర్వదినం కావడంతో దేవాలయలకు పోటెత్తారు. కాళేశ్వరం, రామప్ప, పాలకుర్తి సోమేశ్వర స్వామి దేవాలయం, కురవి వీరబాదరస్వామి, ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయాల్లో కార్తీకపౌర్ణమి శోభ సంతరించుకుంది.

కాకినాడ జిల్లా 
కార్తీక పౌర్ణమి సందర్భంగా అన్నవరం శ్రీ సత్యదేవుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి వ్రతములు ఆచరిస్తూ శ్రీ స్వామి దర్శనానికి బారులు తీరారు.పిఠాపురం పాదగయ క్షేత్రంలో కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయానికి  భక్తజనం  పోటెత్తారు.  తెల్లవారుజాము నుంచి పాదగయ పుష్కరినిలో పవిత్ర స్నానమాచరించి, కార్తీక దీపాలు వెలిగిస్తూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

విశాఖపట్నం
విశాఖ నగరంలో కార్తీకమాస వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శివాలయాలు దర్శించుకుంటున్నారు. శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. శివనామస్మరణతో శైవ క్షేత్రాలు మారుమోగుతున్నాయి. వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. 

ఏలూరు జిల్లా.
ద్వారకాతిరుమల శేషాచల కొండపై శివాలయంలో భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. శివ నామస్మరణలతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమోగుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున కార్తీకదీపం వెలిగిస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లా
కార్తీక సోమవారం పౌర్ణమి పర్వదిన సందర్భంగా రాజమండ్రి గోదావరి ఘాట్ల వద్ద తెల్లవారుజాము నుంచి భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. శివనామ స్మరణతో శైవాలయాలు మారుమోగుతున్నాయి. రాజమండ్రిలో మార్కండేయ స్వామి ఆలయం, ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయాలతో పాటు పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామం, అంబేద్కర్ కౌన్సిలింగ్ జిల్లాలోని కోటిపల్లి మురమళ్ళ ముక్తేశ్వరం లోని క్షణముక్తేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెల్లవారుజాము నుండి స్వామివారు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు.

మరిన్ని వార్తలు