ఇల్లు కోల్పోయిన వారికి రూ.లక్ష సాయం : కేసీఆర్‌

19 Oct, 2020 16:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : భారీ వర్షాలు, వరదలు కారణంగా ఇబ్బందులు పడుతున్న బాధితులను ఆదుకునేలా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. వరద నష్టంపై సోమవారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించిన సీఎం.. వరదల్లో నష్టపోయిన వారందరినీ ఆదుకుంటామని ప్రకటించారు. ఈ మేరకు వదర బాధితులకు నష్టపరిహరం చెల్లించాలని నిర్ణయించారు. పూర్తిగా ఇల్లు కోల్పోయిన వారికి రూ.లక్ష ఆర్థికసాయం అందిస్తామన్నారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.50 వేల చొప్పున తక్షణసాయం, వరదతో నష్టపోయిన ప్రతి ఇంటికి రూ.10 వేల ఆర్థికసహాయం అందజేయాలని నిర్ణయించారు. రేపు ఉదయం (మంగళవారం) నుంచే సహాయం అందజేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. సహాయం అందించేందుకు మున్సిపల్‌ శాఖకు.. రూ.550 కోట్లు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. నగరంలో 200-250 బృందాలను ఏర్పాటు చేసి, అన్ని చోట్లా ఆర్థిక సాయం అందించే కార్యక్రమం పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను సీఎం ఆదేశించారు. (భారీ వరదలు: సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం)

తెలంగాణ ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. హైదరాబాద్ నగరంలో 72 ప్రాంతాల్లోని 144 కాలనీల్లో 20,540 ఇండ్లు నీటిలో చిక్కుకున్నాయి. 35 వేల కుటుంబాలు ప్రభావితమయ్యాయి. ఎల్బీ నగర్, చార్మినార్, సికింద్రాబాద్, ఖైరతాబాద్ జోన్లలో వరదల ప్రభావం ఎక్కువుంది. హైదారాబాద్ నగరంలో 14 ఇండ్లు పూర్తిగా, 65 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వరదల కారణంగా ఇప్పటి వరకు 50 మంది మృతి చెందారు. వారి కుటుంబాలను ఆదుకునేందుకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియాను సీఎం కేసీఆర్‌ ఇదివరకే ప్రకటించారు. (భారీ వరద: కుంగిన పురానాపూల్‌ వంతెన)

మరిన్ని వార్తలు