ఒక గంటలో కోటి మొక్కలు

15 Feb, 2021 02:19 IST|Sakshi

17న సీఎం బర్త్‌డే సందర్భంగా ‘కోటి వృక్షార్చన’

అందరూ పాల్గొనాలని ఎంపీ సంతోష్‌ పిలుపు..  

సాక్షి, హైదరాబాద్‌: గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ద్వారా దేశమంతటా హరిత భావజాల స్ఫూర్తిని వ్యాపింపజేస్తామని ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ తెలిపారు. తెలంగాణను పర్యావరణపరంగా, అత్యంత నివాసయోగ్యంగా మార్చుకునేందుకు ఈ చాలెంజ్‌లో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజు (ఫిబ్రవరి 17)న కోటి వృక్షార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆ ఒక్కరోజు ఒక్క గంటలో కోటి మొక్కలు నాటి రికార్డు సృష్టించి, హరిత ప్రేమికుడైన కేసీఆర్‌కు పుట్టినరోజు బహుమతిగా ఇవ్వాలనేది గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ సంకల్పమన్నారు. ఇటు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇప్పటికే ఇచ్చిన పిలుపుతో పార్టీ శ్రేణులన్నీ సిద్ధమవుతున్నాయని తెలిపారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, కౌన్సిల్‌ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, గ్రామ స్థాయి వరకు పార్టీ పదవుల్లో ఉన్న అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సంతోష్‌ పిలుపునిచ్చారు.

ఇక కేసీఆర్‌ను అభిమానించే వారితో పాటు వ్యాపార, వాణిజ్య, సినిమా, పారిశ్రామిక, క్రీడా రంగ ప్రముఖులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసేం దుకు సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. ఈ నెల 16, 17 రోజుల్లో రెండ్రోజుల పాటు శంషాబాద్‌ విమానాశ్రమంలో హైదరాబాద్‌ చేరుకునే ప్రయాణికులందరికీ ఔషధ మొక్కలను గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ తరఫున పంపిణీ చేస్తామన్నారు. మొక్కలు నాటడం ద్వారా ప్రతీ గ్రామం.. తద్వారా రాష్ట్రం ఆకుపచ్చగా తయారు కావాలని, అందుకోసం అందరి కృషి అవసరమని సంతోష్‌ ఆకాంక్షించారు. ఎండలు సమీపిస్తున్నందున మొక్కలు నాటడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు, నీటి సౌకర్యం, తగిన రక్షణ కల్పించేలా ప్రతీ ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు