మతోన్మాద శక్తులు వస్తున్నాయి.. జాగ్రత్త!

18 Sep, 2022 02:30 IST|Sakshi
నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి సెల్యూట్‌ చేస్తున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో సీఎస్, డీజీపీ

సెప్టెంబర్‌ 17 సందర్భాన్ని వక్రీకరించి నీచపు ఎత్తుగడలకు పాల్పడుతున్నాయి: సీఎం కేసీఆర్‌

నాటి చరిత్రతో సంబంధమే లేని మతతత్వ శక్తులు వస్తున్నాయి

వికృత ప్రయత్నాలతో తెలంగాణ సమాజాన్ని చీల్చేందుకు ప్రయత్నిస్తున్నాయి

తెలంగాణ సమాజం మళ్లీ బుద్ధి కుశలతను ప్రదర్శించాలని పిలుపు

తెలంగాణ జాతీయ సమైక్యత దినం సందర్భంగా పబ్లిక్‌ గార్డెన్స్‌లో జెండా ఆవిష్కరణ

సాక్షి, హైదరాబాద్‌: ‘‘దేశంలో, రాష్ట్రంలో మతోన్మాదశక్తులు పేట్రేగిపోతున్నాయి. సంకుచిత ప్రయోజనాల కోసం మనుషుల మధ్య ముళ్లకంపలు నాటుతున్నాయి. విద్వేషపు మంటలు రగిలిస్తూ, విష వ్యాఖ్యలతో ఆజ్యం పోస్తున్నాయి. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్‌ 17 సందర్భాన్ని సైతం వక్రీకరించి.. స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చు కునే నీచమైన ఎత్తుగడలకు పాల్పడుతున్నాయి. నాటి చరిత్రతో, పరిణామాలతో వీసమెత్తు సంబంధం లేని ఈ అవకాశవాదులు చిల్లర రాజకీ యాలతో ఉజ్వలమైన తెలంగాణ చరిత్రను వక్రీక రించి మలినం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. శనివారం నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. కార్యక్రమంలో సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..

దుష్టశక్తుల యత్నాలను తిప్పికొట్టాలి
‘‘గత ఎనిమిదేళ్లలో తెలంగాణ జీవన ముఖచిత్రం ఎంతో మారిపోయింది. పచ్చని పొలాలతో, చక్కని మౌలిక వసతులతో ప్రగతిబాటలో పయనిస్తోంది. కానీ ఇప్పుడు మతతత్వ శక్తులు బయలుదేరి తెలంగాణ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నాయి. మనుషుల మధ్య విభజన, మతం చిచ్చు సరికాదు. ఇవి ఈ విధంగా విజృంభిస్తే దేశం, రాష్ట్రాల జీవికనే కబళిస్తాయి. ఆ దుష్టశక్తుల యత్నాలను బుద్ధి కుశలతతో తిప్పికొట్టాలి. ఏ కొంచెం ఆదమరిచినా.. ఎంత బాధాకరమైన వస్తాయనేదానికి మన గత తెలంగాణే ఉదాహరణ. ఒకనాడు జరిగిన ఏమరుపాటుతో తెలంగాణ 58 ఏళ్లు శాపగ్రస్త జీవితం అనుభవించింది. అస్తిత్వాన్ని తిరిగి నిలబెట్టుకోవడం కోసం ఎంతో పోరాడాల్సి వచ్చింది. అటువంటి వేదన మళ్లీ రాకూడదు. ఈ నేల శాంతి, సౌభాగ్యాలతో విలసిల్లాలే తప్ప.. అశాంతితో అట్టుడికిపోవద్దు.

నాటి ప్రజలంతా భాగస్వాములే..
1948 సెప్టెంబర్‌ 17న తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారింది. రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది. అందుకే జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకొంటున్నాం. తెలంగాణ సమాజం ప్రజాస్వామిక స్వేచ్ఛ వైపు పరివర్తన చెందడానికి నాడు అవలంబించిన వ్యూహాలు, జరిపిన పోరాటాలు, నెరిపిన త్యాగాల్లో.. నాటి తెలంగాణ ప్రజలందరూ భాగస్వాములే. ఆనాటి ఘట్టాలు జాతి జనుల జ్ఞాపకాల్లో నిత్యం ప్రకాశిస్తూనే ఉంటాయి. చిరస్మరణీయులైన యోధులను తలుచుకోవడం మన కర్తవ్యం. కొమురంభీం, దొడ్డి కొమురయ్య, రావి నారాయణరెడ్డి, చాకలి ఐలమ్మ, ఆరుట్ల రామచంద్రారెడ్డి దంపతులు, సురవరం ప్రతాపరెడ్డి, మగ్దూం మొహియొద్దీన్, షోయబుల్లాఖాన్‌లకు శిరసు వంచి నమస్కరిస్తున్నా..

నాడు, నేడు తెలంగాణ అగ్రగామే!
తెలంగాణ దేశంలో అంతర్భాగంగా మారిన తర్వాత 1948 నుండి 1956 వరకు సొంత రాష్ట్రం హైదరాబాద్‌ స్టేట్‌గా వెలుగొందింది. మిగులు నిధులతో అభివృద్ధి దిశగా ప్రణాళికలు నిర్మించుకొని అడుగులు వేసింది. తర్వాత పడిన తప్పటడుగుల నుంచి విముక్తి పొంది 2014 జూన్‌ 2న తెలంగాణ తిరిగి సాకారమైంది. అప్పుడూ, ఇప్పుడూ అన్నిరంగాల్లోనూ పురోగమిస్తూ దేశానికే దారిచూపే టార్చ్‌బేరర్‌గా నిలిచింది’’.

ఇదీ చదవండి: కేంద్రం తీరుతో సమాఖ్య స్ఫూర్తి క్షీణిస్తోంది

మరిన్ని వార్తలు