కేసీఆర్‌ కుటుంబపాలనను ఎంబీసీలు తరిమికొట్టాలి: బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్‌

12 Jun, 2022 01:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్‌కు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) ఇస్తామంటుంటే ఆయన మాత్రం భారత రాష్ట్రీయ సమితి (బీఆర్‌ఎస్‌) పెడతా మంటూ దేశమంతా తిరుగుతున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్‌ ఎద్దేవా చేశారు. జాతీయ స్థాయిలో కేసీఆర్‌కు స్థానం లేదని వ్యాఖ్యానిం చారు. గ్రామపంచాయతీలకు నేరుగా కేంద్రం నిధులు మంజూరు చేస్తోందని, నరేంద్ర మోదీ పాలనలో దళారి పాత్ర లేకుండా లబ్ధిదారుల ఖాతాలో నగదు చేరుతుండటాన్ని కేసీఆర్‌ సహించలేక లొల్లి చేస్తున్నారని మండిపడ్డారు.

శనివారం ఇక్కడ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంబీసీల సదస్సులో లక్ష్మణ్‌ మాట్లాడుతూ ఎంబీసీ కులాలకు మోదీ ప్రభుత్వం అన్నివిధాలా అండగా నిలుస్తోందన్నారు. పీఎం మత్స్య సంపద పేరుతో అద్భుతమైన పథకాన్ని కేంద్రం ప్రారంభించిందని చెప్పారు. ఎంబీసీల రాజకీయ ఏకీకరణ కోసం మోదీ కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 54 శాతం ఉన్న ఓబీసీలకు కేసీఆర్‌ కేవలం మూడే మంత్రి పదవులు ఇచ్చారని, ఇదే కేసీఆర్‌ గొప్పగా చెప్పే సామాజిక న్యాయమని ఎద్దేవా చేశారు.

కేసీఆర్‌ హయాం లో ఎంబీసీ వర్గాలు మోసపోయాయని అన్నారు. రాబోయే రోజుల్లో ఇక్కడ బీజేపీ సర్కార్‌ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ను రాష్ట్ర ఓబీసీ మోర్చా నేతలు సన్మానించారు. ఎంబీసీ రాష్ట్ర కన్వీనర్‌ దొమ్మాట వెంకటేశ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో నేతలు సూర్యపల్లి శ్రీనివాస్, యాదగిరి, రాజేశ్వరి, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్, గడీల శ్రీకాంత్, ఉడుత మల్లేశ్, కడకంచి రమేశ్, పూస రాజన్న, జ్ఞానేశ్వర్, నందనం దివాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు