చివరి వరకు ఎదురుచూపులే!

16 Nov, 2021 03:32 IST|Sakshi

మండలి ఎమ్మెల్యే కోటా నామినేషన్లకు నేటితో ముగియనున్న గడువు

నేడు టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితా విడుదల 

గులాబీ పార్టీ ఆశావహుల్లో కొనసాగుతున్న తీవ్ర ఉత్కంఠ

గుత్తా, తక్కళ్లపల్లి అభ్యర్థిత్వాలు దాదాపు ఖరారు!

మరో నలుగురు అభ్యర్థులపై కొనసాగుతున్న సస్పెన్స్‌

సాక్షి, హైదరాబాద్‌: శాసనమండలి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు, మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు గడువు ముగియనుంది. కాగా సోమవారం అర్ధరాత్రి వరకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితా విడుదల కాకపోవడంతో ఆశావహులకు ఎదురుచూపులు తప్పడం లేదు. మంగళవారం ఉదయం ఈ జాబితా అధికారికంగా వెలువడుతుందని పార్టీ వర్గాల సమాచారం. వాస్తవానికి ఈ జాబితా సోమవారమే వెలువడుతుందని భావించినా అర్ధరాత్రి వరకు స్పష్టత రాలేదు.

ప్రగతి భవన్‌ పిలుపు కోసం..
పార్టీ నేతల్లో ఒకపక్క ఉత్కంఠ కొనసాగుతుండగా టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు.. సోమవారం శాసనమండలి మాజీ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కల్లపల్లి రవీందర్‌రావుతో ఫోన్‌లో మాట్లాడి అభినందించినట్లు తెలిసింది. మిగతా నాలుగు స్థానాలకు సంబంధించి మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ స్పీకర్‌ మధుసూధనాచారి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ పేర్లు ఖరారైనట్లు సోమవారం ఉదయం ప్రచారం జరిగినా పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. పార్టీ అధినేత నుంచి పిలుపు వస్తుందనే ఉద్దేశంతో కడియం శ్రీహరి, మధుసూధనాచారి వంటి నేతలు హైదరాబాద్‌లో మకాం వేశారు.

ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్న నాగార్జునసాగర్‌ నియోజకవర్గం నేత ఎంసీ కోటిరెడ్డికి కూడా అందుబాటులో ఉండాల్సిందిగా పార్టీ పరంగా సమాచారం అందినట్లు తెలిసింది. మరోవైపు ఎర్రోళ్ల శ్రీనివాస్‌ సోమవారం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను కలిసినట్లు సమాచారం. గవర్నర్‌ కోటాలో గతంలో నామినేట్‌ అయిన పాడి కౌశిక్‌రెడ్డి కూడా తన అభ్యర్థిత్వానికి ఎలాంటి ఢోకా లేదనే ధీమాతో ఉన్నారు. పద్మశాలి సామాజికవర్గం కోటాలో చోటు దక్కుతుందని భావించిన ఎల్‌.రమణ కూడా ప్రగతిభవన్‌ నుంచి పిలుపు వస్తుందనే ఆశాభావంతో ఉన్నారు. మున్నూరు కాపు సామాజికవర్గం నుంచి మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత పేరు ఖరారైనా, ఇతర స్థానాలకు సంబంధించి ఇంకా కొంత స్పష్టత రావాల్సి ఉన్నందున జాబితా విడుదలలో ఆలస్యం జరుగుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఆచితూచి వ్యవహరిస్తున్న అధినేత
    గవర్నర్‌ కోటాలో గతంలో నామినేట్‌ చేసిన పాడి కౌశిక్‌రెడ్డికి బదులుగా గుత్తా సుఖేందర్‌ రెడ్డిని ఖరారు చేస్తారని భావించినా, కేసీఆర్‌ ఆయనను ఎమ్మెల్యే కోటాలోనే మండలికి పంపేందుకు మొగ్గు చూపినట్లు తెలిసింది. ఆరు స్థానాల్లో రెడ్లు, బీసీలకు రెండేసి స్థానాలు, వెలమ, ఎస్సీలకు ఒకటి చొప్పున ఇవ్వాలని కేసీఆర్‌ భావించారు. అయితే సామాజికవర్గాలు, కులాల వారీగా లెక్కలపై కసరత్తు పూర్తి కాకపోవడంతో అభ్యర్థుల జాబితా విడుదలలో ఆలస్యం జరుగుతోంది. ఎస్సీ కోటాలో కడియం శ్రీహరి, ఎర్రోళ్ల శ్రీనివాస్‌ నడుమ తీవ్ర పోటీ నెలకొనడంతో బీసీ సామాజికవర్గం నుంచి అభ్యర్థుల ఎంపిక క్లిష్టంగా మారినట్లు తెలుస్తోంది.

బీసీలకు కనీసం రెండు స్థానాలు అందులో ఒకటి ఖచ్చితంగా మున్నూరుకాపు కులానికి చెందిన వారికి ఇవ్వాల్సి ఉండటంతో అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్‌ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయితే అభ్యర్థులు ఎవరైనా నామినేషన్ల దాఖలుకు స్వల్ప సమయమే ఉండటంతో పార్టీ ఇప్పటికే ప్రతిపాదకులుగా వ్యవహరించే ఎమ్మెల్యేల సంతకాలను తీసుకుని నామినేషన్‌ పత్రాలను సిద్ధం చేసింది. ఇదిలా ఉంటే మంగళవారం నుంచి స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతోంది. ఈ కోటా అభ్యర్థులను కూడా మంగళవారమే ప్రకటించాలనే యోచనలో కేసీఆర్‌ ఉన్నట్లు తెలిసింది.  

మరిన్ని వార్తలు