‘గవర్నర్‌ కోటా’ కసరత్తు షురూ!

30 Aug, 2020 03:39 IST|Sakshi

శాసన మండలిలో ఖాళీ స్థానాల భర్తీకి సన్నాహాలు  

వచ్చే నెల మొదటివారంలో కేబినెట్‌లో ప్రతిపాదన? 

మరోమారు అవకాశం ఆశిస్తున్న నాయిని, కర్నె  

ఆశావహుల జాబితాలో దేశపతి, దేవీప్రసాద్‌  

పరిశీలనలో మాజీ ప్రధాని పీవీ కుమార్తె వాణి పేరు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనమండలిలో ఖాళీగా ఉన్న గవర్నర్‌ కోటా స్థానాల భర్తీపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టి సారించారు. వచ్చే నెల ఏడో తేదీన రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభానికి ముందు జరిగే కేబినెట్‌ సమావేశంలోగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలనే యోచనలో సీఎం ఉన్నట్లు సమాచారం. కేబినెట్‌ భేటీలో అభ్యర్థుల జాబితాపై స్పష్టత ఇచ్చి గవర్నర్‌ ఆమోదానికి పంపే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో పలువురు ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గవర్నర్‌ కోటాలో ఒకేసారి మూడు స్థానాలకు నామినేట్‌ చేసే అవకాశం ఉండటంతో అభ్యర్థిత్వం ఆశిస్తున్న నేతల సంఖ్య కూడా ఎక్కువగా కనిపిస్తోంది. 

మండలిలో నాలుగు స్థానాలు ఖాళీ 
నలభై మంది సభ్యులున్న శాసన మండలిలో నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటా స్థానానికి ఎన్నికల షెడ్యూలు ప్రకటించగా, మాజీ ఎంపీ కవిత టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. కోవిడ్‌ మూలంగా ఎన్నికల ప్రక్రియను ఎన్నికల సంఘం వాయిదా వేసింది. శాసన మండలిలో గవర్నర్‌ కోటా సభ్యుల సంఖ్య ఆరు కాగా, ప్రస్తుతం మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. గతంలో గవర్నర్‌ కోటాలో శాసన మండలికి ఎన్నికైన రాములు నాయక్‌ 2018లో కాంగ్రెస్‌లో చేరడంతో టీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ అయ్యారు. రాములు నాయక్‌ పదవీ కాలం ఈ ఏడాది మార్చిలో, నాయిని నర్సింహారెడ్డి పదవీ కాలం కూడా ఈ ఏడాది జూన్‌ 19న, కర్నె ప్రభాకర్‌ పదవీ కాలం ఈ ఆగస్టు 18న ముగిసింది.  

పరిశీలనలో దేశపతి, వాణీదేవి? 
సీఎం కార్యాలయ ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్, బ్రూవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ దేవీప్రసాద్, పార్టీ నేతలు తక్కళ్లపల్లి రవీందర్‌రావు తదితరులు తమకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందనే ధీమాతో ఉన్నారు. అయితే తాజాగా మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె వాణీదేవి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. పీవీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్‌ ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరిని శాసనమండలికి గవర్నర్‌ కోటాలో నామినేట్‌ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. 

కర్నెకు పక్కా.. నాయినికి అవకాశం?
గతంలో గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికై హోం మంత్రిగా పనిచేసిన నాయిని నర్సింహారెడ్డి మరో మారు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నెల 18న పదవీ కాలం పూర్తి చేసుకున్న ప్రభుత్వ విప్‌ కర్నె ప్రభాకర్‌కు మరోమారు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. నాయినికి అవకాశం దక్కనిపక్షంలో ఆయన అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మంత్రి చామకూర మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన మర్రి రాజశేఖర్‌ రెడ్డి కూడా గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆయన అభ్యర్థిత్వం తెరమీదకు వచ్చినట్లు సమాచారం. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు