స్వచ్ఛభారత్‌ సర్వేక్షణ్‌లో నంబర్‌1గా నిలవడంపై సీఎం హర్షం 

24 Sep, 2022 03:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రామీణ స్వచ్ఛభారత్‌ మిషన్‌ కింద వివిధ విభాగాల్లో రాష్ట్రం 13 అవార్డులతో దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం పట్ల సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. సుస్థిరాభివృద్ధితో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ, స్వచ్ఛభారత్‌ సర్వేక్షణ్‌ లోనూ మరోసారి దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదర్శవంతమైన, పారదర్శక పాలనకు ఇది అద్దం పడుతోందన్నారు.

పచ్చని తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పునరుద్ఘాటించారు. ’పల్లె ప్రగతి’ని సమర్థవంతంగా అమలు చేస్తున్న పంచాయతీరాజ్‌శాఖ మంత్రిని, శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ కార్యదర్శులను సీఎం అభినందించారు. ‘రాష్ట్రం, దేశ ప్రగతిలో తన వంతుగా గుణాత్మక భాగస్వామ్యం పంచుకోవడం ప్రతీ తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన సందర్భం. ఇదే పరంపరను కొనసాగిస్తాం’అని కేసీఆర్‌ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు