న్యాయవాదుల హత్యపై సీఎం స్పందించాలి

2 Mar, 2021 08:51 IST|Sakshi
నిరసన దీక్ష శిబిరంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

హత్యకేసుల విచారణ సీబీఐకి అప్పగించాలి

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి డిమాండ్‌ 

నిజామాబాద్‌ లీగల్‌: హైకోర్టు న్యాయవాద దంపతుల దారుణ హత్యలపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు స్పందించకుండా తన బాధ్యతలను విస్మరిస్తున్నాడని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. వామన్‌రావు, నాగమణిల హత్యలను నిరసిస్తూ  సోమవారం నిజామాబాద్‌ జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు రిలే నిరసన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులతో కలిసి ఈ శిబిరానికి హాజరైన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి రాష్ట్రంలో అన్ని రాజకీయ పారీ్ట లు ఈ హత్యలను తీవ్రంగా ఖండిస్తే, టీఆర్‌ఎస్‌ పార్టీ, సీఎం కేసీఆర్‌ నోరు మోదపటం లేదన్నారు. సీఎంగా కొనసాగే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదని ధ్వజమెత్తారు. ఈ హత్యలతో సంబంధం ఉన్న వారు బయటకు రావాలంటే సీబీఐతో విచారణ చేయించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

సీబీఐకి అప్పగించాలి
బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా కూడా ఈ హత్యల విచారణకు సీబీఐకి అప్పగించాలని కోరిందని, అయినా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఈ కేసులో బిట్టు శ్రీను కుట్రదారుడిగా నిరూపితమయ్యిండని, పుట్ట మధును పోలీసులు ప్రశ్నించాలన్నారు. పోలీసులు నిష్పాక్షికంగా దర్యాప్తు చేయటంలేదని, పోలీసుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. సీఎం స్పందించి ఈ కేసు విచారణ సీబీఐకి అప్పగించేలా విచారణకు ఆదేశించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు రాజేందర్‌రెడ్డి, నిజామాబాద్‌ బార్‌ అధ్యక్షుడు గోవర్ధన్, కార్యదర్శి శ్రీధర్,డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు గడుగు గంగాధర్, మహేశ్‌కుమార్‌గౌడ్, నాయకులు తాహెర్‌బిన్‌ హందాన్, నగేశ్‌రెడ్డి పాల్గొన్నారు. 

కొనుగోలు కేంద్రాలపై హామీ ఇవ్వాలి
మోర్తాడ్‌: రాష్ట్రంలో వరి కొనుగోలు కేంద్రాలను కచ్చితంగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కేంద్రాల నిర్వహణపై ప్రభుత్వం రోజుకో విధమైన ప్రకటన చేస్తూ రైతులను ఆందోళనకు గురిస్తోందన్నారు. సెంటర్లను నిర్వహించడమే కాకుండా రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు. సోమవారం ఏర్గట్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చీకటి ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. పైకి కేంద్రంపై విమర్శలు చేస్తూ రాష్ట్రంలో కొత్త వ్యవసాయ చట్టాల అమలుకు అడుగులు వేస్తుండడాన్ని అందరూ గమనిస్తున్నారని చెప్పారు.

చదవండి :  (న్యాయవాదుల హత్య: కీలక ఆధారాలు లభ్యం)
(న్యాయవాదుల హత్య కేసు: వామన్‌రావు ఆడియో వైరల్‌)

మరిన్ని వార్తలు