కేసీఆర్‌ కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు ఈ ఏడాది చివర్లోనే?

28 Sep, 2022 03:25 IST|Sakshi

పార్టీ ఏర్పాటు కసరత్తు కొలిక్కి రాకపోవడమే కారణం

జాతీయ స్థాయిలో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణలపైనా దృష్టి

కాంగ్రెస్‌ వైపు విపక్షాల మొగ్గు నేపథ్యంలో హరియాణా సభకు దూరం

కొత్త జాతీయ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై విభిన్న కోణాల్లో పరిశీలన

తెలంగాణ మోడల్‌ను జాతీయ స్థాయిలో అమలు చేయడంపై మంతనాలు 

సాక్షి, హైదరాబాద్‌: కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ ప్రకటన ముహూర్తాన్ని వాయిదా వేసే యోచనలో ఉన్నారు. పార్టీ ఏర్పాటుకు సంబంధించిన కసరత్తు పూర్తిగా కొలిక్కి రాకపోవడం, జాతీయ స్థాయిలో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణల దృష్ట్యా.. ముందు భావించినట్టు దసరాకు కాకుండా కొంత వెనక్కి జరపాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి పార్టీ ఏర్పాటు కసరత్తు కొలిక్కి వచ్చే అవకాశముందని టీఆర్‌ఎస్‌ వర్గాలు తాజాగా వెల్లడించాయి. 

జెండా, ఎజెండాపై లోతుగా చర్చ
ప్రస్తుతం జాతీయ పార్టీ జెండా, ఎజెండా, పేరు సంబంధిత అంశాలపై, టీఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీగా మార్చడంలో ఎదురయ్యే సాంకేతిక అవరోధాలపై లోతుగా చర్చిస్తున్నారు. తెలంగాణ మోడల్‌ను జాతీయ స్థాయిలో అమలు చేసేందుకు అవసరమైన నిధులు, అనుసరించాల్సిన ప్రణాళిక తదితరాలపైనా ఆయా రంగాలకు చెందిన నిపుణులతో మంతనాలు కొనసాగుతున్నాయి. కొత్త జాతీయ పార్టీ ఎజెండాలో చేర్చే ప్రతి అంశాన్నీ ఆచరణ సాధ్యం చేసేందుకు తమ వద్ద ఉన్న ప్రణాళికలను కూడా వివరించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి న్యాయ నిపుణులు, గతంలో ఎన్నికల సంఘంలో పనిచేసిన కొందరు కీలక అధికారులతో కూడిన బృందం సలహాలు కూడా తీసుకుంటున్నారు. 

విపక్షాలు, ప్రాంతీయ పార్టీల వైఖరి పరిగణనలోకి తీసుకుని లెక్కలు
మాజీ ఉప ప్రధాని దేవీలాల్‌ జయంతి సందర్భంగా హరియాణాలో ఈ నెల 25న జరిగిన సమ్మాన్‌ దివస్‌కు కేసీఆర్‌ దూరంగా ఉన్నారు. ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ నిర్వహించిన భారీ బహిరంగ సభలో బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, సీపీఎం నేత సీతారాం ఏచూరితో పాటు పలువురు విపక్ష నేతలు పాల్గొన్నారు.

కాగా నితీష్‌తో పాటు పలువురు నేతలు కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు మొగ్గు చూపుతుండటంతో సీఎం కేసీఆర్‌ సమ్మాన్‌ దివస్‌కు దూరంగా ఉన్నట్లు తెలిసింది. బిహార్‌లో బీజేపీతో నితీష్‌ తెగతెంపులు, సోనియాతో భేటీ, మహారాష్ట్ర శివసేనలో చీలిక వంటి పరిణామాలను పార్టీ అధినేత నిశితంగా పరిశీలిస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలతో సయోధ్యతో పనిచేస్తూనే కొత్త జాతీయ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై కేసీఆర్‌ విభిన్న కోణాల్లో కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అయితే ప్రాంతీయ పార్టీల్లో చాలావరకు కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడంపైనే ఆసక్తి చూపుతుండటాన్ని పరిగణనలోకి తీసుకుని లెక్కలు వేసుకుంటున్నట్లు తెలిసింది. 

డిసెంబర్‌లోగానే ముహూర్తం..!
    కాంగ్రెస్‌ పట్ల సానుకూలంగా ఉన్న పార్టీలు, నేతలతో వేదిక పంచుకుంటే ఎదురయ్యే పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే హరియాణా భేటీకి కేసీఆర్‌ దూరంగా ఉన్నట్లు తెలిసింది. అదే సమయంలో జాతీయ పార్టీ ఏర్పాటుపై ఇప్పటికే పలుసార్లు ప్రకటనలు చేసిన నేపథ్యంలో.. ఆ దిశగా అడుగులు ముందుకు పడకపోతే ప్రతికూల ప్రచారం జరిగే అవకాశముందని కేసీఆర్‌ భావిస్తున్నారు. ఈ కారణంగానే ఈ ఏడాది డిసెంబర్‌లోగా పార్టీ ముహూర్తాన్ని ఖరారు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. అప్పటివరకు వివిధ రంగాలు, వర్గాలకు చెందిన వారితో జాతీయ అంశాలపై భేటీలు, మంతనాలు కొనసాగించే యోచనలో ఉన్నట్టు సమాచారం. 

ప్రతి రాష్ట్రం నుంచి ఒకరిద్దరు పార్టీలో చేరేలా..
    కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు ప్రకటించే నాటికే అన్ని రాష్ట్రాల్లోనూ ఒకరిద్దరు బలమైన నేతలు కొత్త పార్టీలో చేరేలా కేసీఆర్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్‌తో గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి శంకర్‌ సింగ్‌ వఘేలా, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ కుమార్‌తో రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ ఎంపీ ఎన్‌కే ప్రేమ్‌చంద్రన్‌ ఇటీవల భేటీ అయ్యారు.

జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్‌ను ఆహ్వానించడంతో పాటు తాము కూడా కొత్త పార్టీలో చేరేందుకు సిద్ధమనే సంకేతాలు ఇచ్చారు. పార్టీలోకి వచ్చే వారిని ఆహ్వానిస్తూనే, చిన్నా చితకా పార్టీల విలీనం, వారి నుంచే వచ్చే డిమాండ్లను తట్టుకోవడం తదితరాలపై కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే దసరా నాటికి కొత్త జాతీయ పార్టీకి తుది రూపునివ్వడం కష్టమనే అభిప్రాయంతో టీఆర్‌ఎస్‌ అధినేత ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  

మరిన్ని వార్తలు