దక్షిణ భారత తొలి ప్రాంతీయ రాజకీయ పార్టీగా టీఆర్‌ఎస్‌..!

2 Sep, 2021 02:09 IST|Sakshi
బుధవారం ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు స్వాగతం పలుకుతున్న అధికారులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు

నేడు ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ

మధ్యాహ్నం 1:48 గంటలకు ముహూర్తం పాల్గొననున్న సీఎం కేసీఆర్‌ దంపతులు, కేటీఆర్‌

1,100 చదరపు మీటర్లలో భవన నిర్మాణం

ఏడాదిలోగా పూర్తి చేయాలన్నదే లక్ష్యం

సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్‌: దేశ రాజధాని హస్తినలో పార్టీ కార్యాలయ భవన నిర్మాణం చేసుకోనున్న దక్షిణ భారత తొలి ప్రాంతీయ రాజకీయ పార్టీగా టీఆర్‌ఎస్‌ నేడు నూతన అధ్యాయానికి తెరలేపనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు గురువారం ఢిల్లీలో పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. కార్యాలయం కోసం ఢిల్లీ వసంత్‌ విహార్‌లో కేంద్రప్రభుత్వం లీజు ప్రాతిపదికన 1,100 చదరపు మీటర్ల స్థలం కేటాయించింది. మధ్యాహ్నం 1:48 గంటలకు జరిగే భూమిపూజ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ దంపతులు, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో బుధవారం సాయంత్రం 5:45 గంటలకు సీఎం కేసీఆర్‌ సతీసమేతంగా ఢిల్లీ చేరుకున్నారు. సీఎం వెంట వచ్చిన వారిలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్, ఎంపీ సంతోష్‌ కుమార్‌ ఉన్నారు. అంతకుముందు మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీలు శంభీపూర్‌ రాజు, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఢిల్లీ వచ్చారు. 

ప్రజలందరికీ గర్వకారణం: ప్రశాంత్‌రెడ్డి
రెండు రోజుల నుంచి భూమిపూజ జరిగే స్థలం వద్ద రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఏర్పాట్లను సమీక్షించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిబద్ధత కారణంగానే ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ కార్యాలయం ఏర్పాటుకానున్నదని, ఇది తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశానికే దిక్సూచిగా మారాయని, ఇలాంటి సమయంలో ఢిల్లీ గడ్డపై పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. పార్టీ కార్యాలయ నిర్మాణంలో తనకు భాగస్వామ్యం కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

అయితే పార్టీ కార్యాలయ నిర్మాణ నమూనాలకు ఇంకా ఆమోదముద్ర పడలేదని చెప్పారు. కొత్త భవనంలో అధ్యక్షుల చాంబర్‌తోపాటు కాన్ఫరెన్స్‌ హాలు, లైబ్రరీ, ఆడియో విజువల్‌ గది ఉండాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏడాదిలోగా భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌ గౌడ్, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, కవిత, బండ ప్రకాశ్, కేఆర్‌ సురేశ్‌రెడ్డి, బీబీ పాటిల్, వెంకటేశ్‌ సహా పలువురు నాయకులు భూమిపూజ ఏర్పాట్లను పరిశీలించారు. 

సీఎంకు నామా విందు
ఢిల్లీకి వచ్చిన సీఎం కేసీఆర్, మంత్రులు, ఇతర నాయకులకు పార్టీ ఎంపీ నామా నాగేశ్వర్‌ రావు విందు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం శంకుస్థాపన ఏర్పాట్ల గురించి మంత్రి కేటీఆర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీకి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పార్టీ ముఖ్య నేతలను సీఎం పేరుపేరున పలకరించారు.

నేడు జెండా పండుగ
పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు టీఆర్‌ఎస్‌ పార్టీ యంత్రాంగం గురువారం రాష్ట్రవ్యాప్తంగా జెండా పండుగను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఉదయం 9 గంటలకు టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత పర్యాద కృష్ణమూర్తి పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలు, మున్సిపల్‌ వార్డుల్లోనూ టీఆర్‌ఎస్‌ జెండాను ఎగురవేస్తారు. ఈ సందర్భంగా గ్రామ, వార్డు స్థాయిలో సంస్థాగత కమిటీల ఏర్పాటు ప్రక్రియనూ పార్టీ నేతలు ప్రారంభిస్తారు. ఈ నెల 12లోగా గ్రామ, వార్డు కమిటీల ఏర్పాటును పూర్తి చేసేలా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇదివరకే షెడ్యూల్‌ను ప్రకటించారు.   

మరిన్ని వార్తలు