CM KCR : అనుక్షణం అప్రమత్తం

23 Jul, 2021 01:06 IST|Sakshi
రాష్ట్రంలో వరద పరిస్థితులపై ప్రగతిభవన్‌లో ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో వాతావరణశాఖ హెచ్చరికలను ట్యాబ్‌లో చూపుతున్న సీఎం. చిత్రంలో సీఎస్‌

అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశం 

నదీ పరీవాహక ప్రాంతాలతో పాటు ఎగువన భారీ వర్షాలు 

తెలంగాణకు పెరుగుతున్న వరద ఉధృతి 

మంత్రులు, కలెక్టర్లు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలి 

ముంపు ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలి 

అవసరమైన చోటకు ఆర్మీ హెలికాప్టర్లు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపండి 

నిరాశ్రయులకు తక్షణ పునరావాసం, భోజన వసతి కల్పించండి 

జీహెచ్‌ఎంసీలో కూడా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలి 

రానున్న రెండురోజుల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి 

కృష్ణా, గోదావరి వరదలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష 

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాలతో పాటు ఎగువన కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఎగువ రాష్ట్రాల్లోని అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తుతున్నారని, దీంతో తెలంగాణలోకి వరద ఉధృతి పెరుగుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో వరద పరిస్థితిని పర్యవేక్షించేందుకు కొత్తగూడెం, ఏటూరు నాగారం, మంగపేట ప్రాంతాలకు ఆర్మీ హెలికాప్టర్లతో పాటు అధికారులను పంపించాలని ఆదేశించారు. ఆర్మూర్, నిర్మల్, భైంసా ప్రాంతాలకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపించి లోతట్టు ప్రాంతాల్లో వరదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. వరదల మూలంగా నిరాశ్రయులైన వారికి పునరావాసం కల్పించడంతో పాటు దుస్తులు, భోజన వసతి సమకూర్చాలని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఉండేలా మరిన్ని హెలికాప్టర్లు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను తెప్పించాలని సూచించారు. భారీ వర్షాలు, కృష్ణా, గోదావరి వరద పరిస్థితులపై గురువారం ప్రగతిభవన్‌లో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఉదయం కూడా వరదలకు సంబంధించి అధికారులకు ముఖ్యమంత్రి పలు ఆదేశాలు జారీ చేశారు.  

మహాబలేశ్వరంలో 70 సెం.మీ. వర్షపాతం 
సమీక్ష సందర్భంగా గోదావరి పరీవాహక ప్రాంతంలో నమోదవుతున్న వర్షపాతం, శ్రీరాంసాగర్‌  ప్రాజెక్టు ఎగువ భాగం మొదలుకుని కడెం, ఎల్లంపల్లి, స్వర్ణ, కాళేశ్వరం బ్యారేజీల్లో వరద పరిస్థితిపై అధికారులు నివేదిక సమర్పించారు. కృష్ణా నది ఎగువన ఉన్న రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు, వరద పరిస్థితిని కూడా వివరించారు. మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని, మహాబలేశ్వరంలో 70 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు.

అన్ని విభాగాలు సన్నద్ధంగా ఉండాలి 
‘కృష్ణా నదీ ప్రవాహం పెరిగే అవకాశమున్నందున నాగార్జునసాగర్‌ కేంద్రంగా పర్యవేక్షించేందుకు ఉన్నతాధికారులను పంపించాలి. గోదావరి వరద పెరుగుతున్న నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాలకు చెందిన మంత్రులు, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి. అగస్టు పదో తేదీదాకా వర్షాలు కొనసాగే పరిస్థితి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో, ప్రజా రక్షణ కోసం అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి. శుక్ర, శనివారాల్లో అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు నీటిపారుదల, విద్యుత్, పోలీసు విభాగాలు సన్నద్ధంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించడంతో పాటు, రిజర్వాయర్ల నుంచి నీటిని నెమ్మదిగా వదలాలి. రోడ్లు, భవనాల శాఖ వంతెనలు, రోడ్లను పరిశీలీస్తూ ప్రజా రవాణాకు అంతరాయం కలగకుండా చూడాలి. 

మూసీ వరద కూడా పెరిగే అవకాశం 
మూసీ నది వరద ఉధృతి కూడా పెరిగే అవకాశమున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజల రక్షణ కోసం ముందస్తు చర్యలు చేపట్టాలి. హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టేవారిపై హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ అధికారులు కఠినంగా వ్యవహరించాలి.  

తక్షణమే శాశ్వత వరద నిర్వహణ బృందం 
వరదల సందర్భంగా తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. గతంలో వరద పరిస్థితులను ఎదుర్కొన్న అనుభవం కలిగిన ఏడెనిమిది మంది అధికారులతో కూడిన వరద నిర్వహణ (ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌) బృందాన్ని శాశ్వతంగా తక్షణమే ఏర్పాటు చేయాలి. పునరావాస క్యాంపుల నిర్వహణపై అవగాహన ఉన్న అధికారిని ఈ బృందంలో సభ్యుడిగా నియమించాలి. ఆర్మీ, పోలీసు, ఎయిర్‌ఫోర్స్, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ వ్యవస్థల సమన్వయం కోసం ఒకరిని నియమించాలి. వైద్యం, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్‌ శాఖల సమన్వయం కోసం ఒకరు, జీఏడీ, రెవెన్యూ, నీటి పారుదల శాఖల సమన్వయం కోసం మరొక అధికారిని ఈ బృందంలో చేర్చాలి..’అని సీఎం ఆదేశించారు.

ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి
‘ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ జిల్లాలు, నియోజకవర్గాల్లో ఉంటూ ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షించాలి. బాల్కొండ నియోజకవర్గంతో పాటు నిజామాబాద్‌ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తక్షణమే పరిస్థితిని పర్యవేక్షించాలి. నిర్మల్‌ పట్టణం ఇప్పటికే నీట మునిగింది. సీఎస్‌ అక్కడికి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను తక్షణమే పంపాలి. టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి. రానున్న రెండురోజులు అత్యంత భారీ స్థాయిలో వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున ప్రజలు కూడా స్వీయ నియంత్రణ పాటిస్తూ అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవాలి. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు రావొద్దు..’అని కేసీఆర్‌ సూచించారు. ఈ సమావేశంలో జుక్కల్‌ ఎమ్మెల్యే హనుమంతు షిండే, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌ రావు, సీఎం కార్యాలయ ఓఎస్‌డీలు శ్రీధర్‌ దేశ్‌పాండే, ప్రియాంక వర్గీస్, నీటిపారుదల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌కుమార్‌తో పాటు వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయండి: సీఎస్‌ 
ఉదయం సీఎం ఆదేశాల నేపథ్యంలో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్‌ జిల్లాలకు చెందిన 16 మంది కలెక్టర్లు, ఎస్‌పీలతో టెలికాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. వర్షాలు, వరద పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా కేంద్రాలలో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా తగు చర్యలు చేపట్టాలని సూచించారు. తాగునీరు, విద్యుత్తు సరఫరా, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.    

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు