ఎన్నికల వేళ వరాల జల్లు..      

13 Nov, 2020 03:17 IST|Sakshi

నగరంలో పేదల ఇళ్ల ఉచిత క్రమబద్ధీకరణ

వారి ఆస్తి పన్ను, విద్యుత్, నల్లా చార్జీల బకాయిల మాఫీ?

సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ఆర్డినెన్స్‌

నేడు కేబినెట్‌ భేటీ.. పరిశీలనలో కీలక ప్రతిపాదనలు

సాక్షి, హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నగర ప్రజలకు దీపావళి కానుకగా వరాలు ప్రకటించనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ప్రగతి భవన్‌లో మంత్రివర్గం సమావేశమై కీలక నిర్ణ యాలు తీసుకోనుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి పేదలు నిర్మించుకున్న ఇళ్లను ఉచి తంగా క్రమబద్ధీకరించి వారికి సంపూర్ణ యాజమాన్య హక్కులు కల్పించాలనే ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేయనుంది. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు సైతం జీవోలు 58, 59 ద్వారా పేదల ఇళ్లను నామమాత్రపు ధరలతో ప్రభుత్వం క్రమబద్ధీకరించింది.

ఈసారి ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించారు. కేబినేట్‌ ఆమోదించిన వెంటనే రెవెన్యూ శాఖ నుంచి క్రమబద్ధీకరణ ఉత్తర్వులు రానున్నాయి. పేదల ఇళ్లను క్రమబద్ధీకరించడంతోపాటు వాటిని విక్రయించుకొనే అధికారం సైతం ఈసారి ప్రభుత్వం కల్పించనుంది. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు ప్రకటించినట్లే పేదల ఆస్తిపన్ను బకాయిల మాఫీపై మరో కీలక నిర్ణయం తీసుకొనే అవకాశాలున్నాయి. అలాగే ఆస్తి పన్నులను పునఃసమీక్షించే అంశంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకొనే అవకాశాలున్నాయి.

గత జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ముగిసిన వెంటనే నగరంలోని వేలాది ఇళ్లకు కనీసం నోటిసులు ఇవ్వకుండానే ఆస్తి పన్నులను అడ్డగోలుగా పెంచేశారు. ఆస్తి పన్నుల నిబంధనలపట్ల అవగాహన లేని క్షేత్రస్థాయి సిబ్బంది పాత, కొత్త భవనాలు అనే తేడా లేకుండా ఇష్టంవచ్చినట్లు వ్యవహరించడంతో ప్రజలపై తీవ్ర భారం పడింది. ఇలాంటి పొరపాట్లను సరిచేయాలని వేలాది దరఖాస్తులు వచ్చినా వాటిని పరిష్కరించలేదు. అనుమతులు తీసుకోకుండా/అనుమతులు ఉల్లంఘించారనే ఆరోపణలపై 1985కు ముందు నిర్మించిన ఇళ్లు, భవనాలపై 25 శాతం నుంచి 100 శాతం వరకు ఆస్తి పన్నులను పెంచడంతో నగర ప్రజలు లబోదిబోమంటున్నారు.

1985 కంటే ముందు నిర్మించిన ఇళ్లను బీఆర్‌ఎస్‌ కింద క్రమబద్ధీకరించుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం మినహాయింపు కల్పించినా, ఇలాంటి గృహాలపైనా పన్నులు బాదేశారు. ఇప్పటికే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు దృష్టికి నగర ఎమ్మెల్యేలు ఇలాంటి ఫిర్యాదులను తీసుకెళ్లారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపనున్న ఆస్తి పన్నులకు సంబంధించిన అన్ని అంశాలను కేబినెట్‌ కులంకషంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనుంది.

‘డబుల్‌’ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపైనా...
ఎల్‌ఆర్‌ఎస్‌ కింద దరఖాస్తు చేసుకోలేకపోయిన పేదలకు సంబంధించిన ప్లాట్లను, అనుమతి తీసుకోకుండా పేదలు నిర్మించుకున్న ఇళ్లను ఉచితంగా క్రమబద్ధీకరించే అంశాలను సైతం ప్రభుత్వం పరిశీలిస్తోంది. వాటిపై సైతం నిర్ణయాలు వచ్చే అవకాశముంది. అనుమతి లేకుండా పేదలు నిర్మించుకున్న ఇళ్లను ఉచితంగా క్రమబద్ధీకరిస్తే జరిమానాల రూపంలో వారిపై పడుతున్న ఆస్తిపన్నుల భారం నుంచి విముక్తి లభించనుంది. నగరంలోని పేదలకు సంబంధించిన నల్లా, విద్యుత్‌ బిల్లుల పాత బకాయిలను సైతం గత జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు మాఫీ చేసినట్టు ఈసారి కూడా మాఫీ చేయాలనే ప్రతిపాదనలపైనా కేబినెట్‌ నిర్ణయం తీసుకోనుంది.

నగరంలో సలు చోట్ల నిర్మాణం పూర్తి చేసుకొని పంపిణీకి సిద్ధంగా ఉన్న డబుల్‌ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. వన్‌టైం స్కీం కింద సాదాబైనామాల ద్వారా కొనుగోలు చేసిన భూముల రిజిస్ట్రేషన్‌కు హైకోర్టు చెక్‌ పెట్టింది. పాత రెవెన్యూ చట్టం మనుగడలో లేని ప్రస్తుత తరుణంలో ఆ చట్టం కింద సాదాబైనామాలను ఎలా క్రమబద్ధీకరిస్తారని తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్‌ ద్వారా కొత్త రెవెన్యూ చట్టానికి సవరణలు జరిపి సాదాబైనామాలను క్రమబద్ధీకరించేందుకు వీలు కల్పించాలనే ప్రతిపాదనలను సైతం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించనుంది.

అదే విధంగా సన్నబియ్యం పండించిన రైతులకు ధాన్యం సమీకరణలో బోనస్‌ మంజూరుపైనా కేబినేట్‌ నిర్ణయం తీసుకోనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంసిద్ధత, సమ్మతిని రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియజేయాలని కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా