డ్రగ్స్‌రహిత రాష్ట్రంగా తెలంగాణ! 

19 Oct, 2021 03:42 IST|Sakshi

వ్యూహాన్ని ఖరారు చేయనున్న ప్రభుత్వం 

రేపు పోలీస్, ఎక్సైజ్‌ అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష 

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టాలని, రాష్ట్రాన్ని డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు పటిష్ట వ్యూహాన్ని రూపొందించే లక్ష్యంతో వచ్చే బుధవారం ప్రగతిభవన్‌లో సీఎం కె.చంద్రశేఖర్‌రావు పోలీస్, ఎక్సైజ్‌ శాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు.

దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల మాఫియా పెట్రేగిపోతున్న నేపథ్యంలో రాష్ట్రంలో వీటి కార్యకలాపాలను నిరోధించేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించనున్నారు. జిల్లా ఎక్సైజ్‌ శాఖాధికారులు తమ ప్రాంతాల్లో పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలపై సమగ్ర నివేదికలతో రావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 23న జిల్లా కలెక్టర్లతో సమీక్ష: ఈ నెల 23న పోడు భూముల సమస్య పరిష్కారం, అడవుల పరిరక్షణ, హరిత హారంపై సీఎం సమీక్ష నిర్వహిం చనున్నారు.

ప్రగతిభవన్‌లో కలెక్టర్లు, అటవీశాఖ ఉన్నతాధికారులతో జరిగే విస్తృత స్థాయి సమావేశంలో సమగ్ర కార్యాచరణ రూపొందించనున్నారు.రేపట్నుంచి పోడుపై అధ్యయనం: ఈ నెల 20, 21, 22 తేదీల్లో పోడు భూముల సమస్యలపై అధ్యయనంలో భాగంగా ఉన్నతాధికారులు అటవీ ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నారు. అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్‌ ఛోంగ్తు, పీసీసీఎఫ్‌ శోభ హెలికాప్టర్‌లో ఆయా ప్రాంతాల్లో పర్యటించనున్నారు. 

మరిన్ని వార్తలు