అసెంబ్లీలో వాస్తవాలు చెప్పండి

4 Sep, 2020 01:52 IST|Sakshi

మంత్రులు సమగ్ర సమాచారంతో రావాలి

అల్లర్లు, దూషణలకు అసెంబ్లీ వేదిక కారాదు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్ష

తొలిరోజు సమావేశాల్లో సోలిపేటకు ఘన నివాళి

బీఏసీలో ప్రభుత్వపరంగా ప్రతిపాదించే అంశాలపై స్పష్టత

అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులు, విప్‌లకు దిశానిర్దేశం

సాక్షి, హైదరాబాద్‌ : ‘అల్లర్లు, దూషణలు, గందరగోళం, తిట్లు, శాపనార్థాలు, నిందలు, అసహనానికి శాసనసభ వేదిక కావద్దు. ఇలాంటి ధోరణికి తావు లేకుండా అసెంబ్లీ నిర్వహణలో గుణాత్మక మార్పు వచ్చి స్ఫూర్తి వంతమైన చర్చలు జరగాలి’ అని ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్‌రావు ఆకాంక్షించారు. ఈ నెల 7 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరిం చాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్‌ గురువారం ప్రగతి భవన్‌లో పలువురు మంత్రులు, విప్‌లు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహ ణకు సంబంధించి పలు సూచనలు చేశారు. ‘చట్టాలు రూపొందించడం, బడ్జెట్‌ ఆమోదం, వాటి అమలు తదితరాలపై విశ్లేషణకు అసెం బ్లీలో వాస్తవాల ఆధారంగా ప్రజలకు ఉపయోగ పడే చర్చ జరగాలి. తద్వారా ప్రజాస్వామ్యం బలోపేతమై ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు వెలువడతాయి’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

ఆచరణాత్మక సలహాలు స్వీకరించేందుకు సిద్ధం..
‘ఏ పార్టీకి చెందిన సభ్యులైనా అన్ని విషయాలను వాస్తవాలు ప్రతిబింబించేలా, క్షేత్రస్థాయి పరిస్థితికి అద్దంపట్టేలా సభలో మాట్లాడవచ్చు. వాటికి సమా ధానం, వివరణ ఇచ్చేందుకు, ఆచర ణాత్మక సలహాలు స్వీకరించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. రాష్ట్ర ప్రజలకు సంబం«ధించిన అన్ని అంశాలపై అసెం బ్లీలో కూలంకషంగా చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకుంటోంది. అధికారపక్ష సభ్యులు కూడా ప్రజలకు సంబం«ధించిన ప్రతి అంశాన్నీ సభలో ప్రస్తావించాలి’ అని సీఎం పిలుపునిచ్చారు. రాజకీయ పక్షాలు ప్రతిపాదించే అంశాలపై ఎన్ని రోజులైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, చర్చ సందర్భంగా ప్రజలకు వాస్తవాలు వివరించేందుకు, చర్చకు వచ్చే అన్ని అంశాలపై పూర్తి సమాచారంతో మంత్రులు సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి అసెంబ్లీ సమావేశాల తొలి రోజున ఘనంగా నివాళి అర్పిస్తామని సీఎం వెల్లడించారు.

బీఏసీలో ప్రభుత్వం ప్రతిపాదించే అంశాలు

  • కరోనా వ్యాప్తి, నివారణ, బాధితులకు అందుతున్న వైద్యం.
  • రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరిట ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టు–నీటిపారుదల రంగానికి సంబంధించిన అంశాలు.
  • భారీ వర్షాల వల్ల జరిగిన పంట నష్టం–తీసుకోవాల్సిన చర్యలు.
  • శ్రీశైలం జలవిద్యుత్‌ కేంద్రంలో జరిగిన ప్రమాదం.
  • విద్యుత్‌ రంగంలో సాధించిన విజయాలు.
  • కొత్త రెవెన్యూ చట్టం.
  • జీఎస్టీ అమలులో జరుగుతున్న అన్యాయం, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఆర్థిక విధానాల వల్ల కలుగుతున్న నష్టం.
  • రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానాల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న నాన్చివేత ధోరణి.
  • నియంత్రిత పద్ధతిలో పంటల సాగుతోపాటు వ్యవసాయ రంగం.
  • పీవీ శతజయంతి ఉత్సవాలు.
మరిన్ని వార్తలు