దేశం మూడ్‌ మారేలా.. బీఆర్‌ఎస్‌ సభ నిర్వహణకు ఏర్పాట్లు!

15 Jan, 2023 01:22 IST|Sakshi
ఖమ్మంలో బహిరంగ సభా ప్రాంగణంలో సిద్ధమవుతున్న వేదిక..

బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయం అనిపించేలా..

దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా ఖమ్మం సభ నిర్వహణకు బీఆర్‌ఎస్‌ ఏర్పాట్లు

ఆవిర్భావం తర్వాత జరుగుతున్న తొలి సభ కోసం సర్వశక్తుల వినియోగం

భారీ జన సమీకరణ లక్ష్యంగా సన్నాహక సమావేశాలు

ప్రగతిభవన్‌లో వివిధ రాష్ట్రాల నేతలతో కేసీఆర్‌ వరుస భేటీలు

బహిరంగ సభ వేదికగా చేరికలు, విలీనాలు, నియామకాలు

సాక్షి, హైదరాబాద్‌/ సాక్షి ప్రతినిధి, ఖమ్మం/ ఖమ్మం అర్బన్‌:  దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయం బీఆర్‌ఎస్‌ అనిపించేలా.. జాతీయ రాజకీయాలకు సంబంధించి దేశం మూడ్‌ మారేలా ఖమ్మం బహిరంగ సభను ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఈ మేరకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. భారీగా జన సమీకరణకు ఓ వైపు.. పెద్ద సంఖ్యలో ఇతర రాష్ట్రాల నేతలనూ రప్పించేందుకు మరోవైపు కసరత్తు చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ నుంచి ఖమ్మం స్థానిక నేతల వరకు ఈ పనిలోనే బిజీబిజీగా గడుపుతున్నారు.

ఖమ్మం సభ వేదికగానే పలు రాష్ట్రాల బీఆర్‌ఎస్‌ అధ్యక్షులను ప్రకటించేందుకు, పలువురు నేతలను చేర్చుకునేందుకు, చిన్న పార్టీల విలీన ప్రకటనలకు రంగం సిద్ధమవుతున్నట్టు సమాచారం. బీఆర్‌ఎస్‌ విస్తరణతోపాటు జాతీయస్థాయిలో తృతీయ ప్రత్యామ్నాయ కూటమిపైనా కేసీఆర్‌ సంకేతాలు ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.  

సన్నాహక సమావేశాలతో.. 
ఈ నెల 18న ఖమ్మం కొత్త కలెక్టరేట్‌ ప్రారంభంతోపాటు బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ జరగనున్న విషయం తెలిసిందే. ఐదు లక్షల మందితో భారీగా సభ నిర్వహిస్తామని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించారు. మంత్రి హరీశ్‌రావు స్వయంగా రంగంలోకి దిగి ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల పరిధిలో నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ జనసమీకరణపై దిశానిర్దేశం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం తర్వాత నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ కావడంతో ఎక్కడా లోటుపాట్లు తలెత్తకుండా జాగ్రత్త పడుతున్నారు. 

ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ బిజీబిజీ 
ఖమ్మం సభ, బీఆర్‌ఎస్‌ జాతీయస్థాయి విస్తరణ పనులపై సీఎం కేసీఆర్‌ కూడా బిజీగా గడుపుతున్నారు. వివిధ రాష్ట్రాల రాజకీయ నేతలు, విభిన్న రంగాల ప్రముఖులతో మంతనాలు జరుపుతున్నారు. ఖమ్మం సభ వేదికగా వివిధ రాష్ట్రాల నుంచి బీఆర్‌ఎస్‌లోకి చేరికలు, పలు పార్టీల విలీన ప్రకటనలు ఉంటాయని సమాచారం. ఈ సభ వేదికగానే బీఆర్‌ఎస్‌ గుజరాత్, ఒడిషా, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర శాఖల అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది. విలీనాలకు సంబంధించి 13కిపైగా ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరుగుతున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఖమ్మం సభా వేదికపై అన్ని రాష్ట్రాల ప్రతినిధులకు ప్రాతినిధ్యం దక్కేలా ఆహ్వానాలు పంపినట్టు సమాచారం. అయితే చేరికలు, విలీనాలకు సంబంధించి ప్రగతిభవన్‌ వర్గాలు గోప్యత పాటిస్తున్నాయి. 

కీలక నేతలకు ఆహ్వాన బాధ్యతలు 
ఖమ్మం సభకు మూడు రాష్ట్రాల సీఎంలు అర్వింద్‌ కేజ్రీవాల్‌ (ఢిల్లీ), భగవంత్‌మాన్‌ (పంజాబ్‌), పినరయి విజయన్‌ (కేరళ)తోపాటు మాజీ సీఎంలు అఖిలేశ్‌యాదవ్, శంకర్‌సింహ్‌ వాఘేలా, గిరిధర్‌ గమాంగ్, పలు ఇతర పార్టీల నేతలు హాజరుకానున్నారు. కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి ఇతర కార్యక్రమాల షెడ్యూల్‌ వల్ల రాలేకపోతున్నట్టు సమాచారం.

మొత్తంగా ఖమ్మం సభకు వచ్చే నేతల ఆహ్వానాలను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎంపీ దామోదర్‌రావు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి సమన్వయం చేస్తున్నారు. కేసీఆర్‌తో జరిగే భేటీలు, సభకు హాజరయ్యే నేతల వసతి, బస, రవాణా ఏర్పాట్లను ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్, పీయూసీ చైర్మన్‌ ఎ.జీవన్‌రెడ్డి తదితరులు పర్యవేక్షిస్తున్నారు. దావోస్‌ పర్యటనలో ఉన్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ ఖమ్మం సభకు హాజరుకావడం లేదు. 
 
సభలో ఎలాంటి ఇబ్బందీ రావొద్దు 

– పోలీసు అధికారులతో సమీక్షలో మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ 
ఖమ్మం సభ విజయవంతం అయ్యేలా ఏర్పాట్లు చేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ అజయ్‌ సూచించారు. శనివారం ఉదయం వారు ఖమ్మం కలెక్టరేట్, సభాస్థలిలో ఏర్పాట్లను పరిశీలించారు. తర్వాత పోలీస్‌ కమిషనర్‌ విష్ణు ఎస్‌.వారియర్, ఇతర అధికారులతో సమీక్షించారు.

సభ వద్దకు వచ్చే ప్రజలు, ప్రజాప్రతినిధుల వాహనాల కోసం అవసరమైన పార్కింగ్‌ ఏర్పాట్లు చేయాలని.. ట్రాఫిక్‌ సమస్య ఉత్పన్నం కాకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. సీఎం, ఇతర వీఐపీలు వస్తుండటంతో భద్రత పకడ్బందీగా ఉండేలా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక మంత్రి జగదీశ్‌రెడ్డి శనివారం సాయంత్రం సభా స్థలాన్ని, ఏర్పాట్లను పరిశీలించారు. సభ కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతుందన్నారు. 

200 మంది కూర్చునేలా వేదిక 
సభ కోసం 50 ఎకరాలకుపైగా స్థలాన్ని చదును చేయించారు. వాస్తుపరంగా దక్షిణం, పడమరవైపు ఎత్తుగా ఉన్న ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఉత్తర ముఖంగా ఎనిమిది అడుగుల ఎత్తుతో 200 మంది కూర్చునేలా వేదికను సిద్ధం చేస్తున్నారు. దీని వెనక 70 అడుగుల ఫ్లెక్సీతోపాటు పూలతో అలంకరించనున్నారు.  
► వేదిక, దానిపై టెంట్‌ను వాటర్‌ ప్రూఫ్, ఫైర్‌ ప్రూఫ్‌ సామగ్రితో నిర్మిస్తున్నారు. జర్మనీ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన టెంట్లను ఉపయోగిస్తున్నారు. 
► ప్రధాన స్టేజీ పక్కనే కళాకారులు ప్రదర్శనలు ఇచ్చేలా మరో స్టేజీ నిర్మిస్తున్నారు. ఒకేసారి 50 మంది కళాకారులు ప్రదర్శన ఇచ్చేలా తీర్చిదిద్దుతున్నారు. 
► సభకు 5 లక్షల మందిని సమీకరించాలని బీఆర్‌ఎస్‌ లక్ష్యంగా పెట్టుకోగా.. వేదికకు దగ్గరలో లక్ష కుర్చీలు వేస్తున్నారు. వాటి వెనకాల కూడా మరిన్ని కుర్చీలు వేయాలా, నిలబడేందుకు ఏర్పాట్లు చేయాలా అన్నది పరిశీలిస్తున్నారు.  

మరిన్ని వార్తలు