‘కేసీఆర్‌ జాతీయ పార్టీ’తో బీజేపీ, కాంగ్రెస్‌ల్లో వణుకు: బాల్క సుమన్‌

13 Jun, 2022 03:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేసీఆర్‌ జాతీయ పార్టీ అనగానే బీజేపీ, కాంగ్రెస్‌ల వెన్నులో వణుకు మొదలైందని ప్రభు త్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు. కులగజ్జి రేవంత్, మత పిచ్చి సంజయ్‌కి కేసీఆర్‌ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఎమ్మెల్సీలు టి.భానుప్రసాద్‌ రావు, దండే విఠల్‌తో కలిసి టీఆర్‌ఎస్‌ఎల్‌పీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు జాతీయ పార్టీలకు ఇద్దరు పిచ్చోళ్లు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారని, వారిని చూసి ప్రజలు ఈసడించుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్‌ కాలం చెల్లిన మెడిసిన్‌ కాదు.. ప్రాణం పోసే సంజీవని అని ప్రజలకు తెలుసన్నారు.

రేవంత్‌ నోరు అదుపులో పెట్టుకోవాలని సుమన్‌ హెచ్చరించారు. బండి సంజయ్‌కి చేతనైతే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముందే రాష్ట్ర విభజన హామీలు అమలు చేయించి చూపించాలని సవాల్‌ విసిరారు. ఎమ్మెల్సీ టి.భాను ప్రసాద్‌ మాట్లాడుతూ బీజేపీ అంటేనే కాంగ్రెస్‌ భయపడుతోందని, ప్రతిపక్ష పాత్ర పోషించే స్థితిలో లేదన్నారు. దేశంలో నియంత పాలన సాగుతోందని, దాన్ని సరిదిద్దేందుకు కేసీఆర్‌ కొత్త ఎజెండా సిద్ధం చేస్తున్నారని తెలిపారు. 

మరిన్ని వార్తలు