ఆస్తులన్నీ ఆన్‌లైన్‌

23 Sep, 2020 03:28 IST|Sakshi

15 రోజుల్లోగా ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్లు, వ్యవసాయేతర ఆస్తులు నమోదు

ధరణి పోర్టల్‌ అందుబాటులోకి వచ్చేలోగా 100 శాతం పూర్తి చేయాలి

ధరణి పోర్టల్‌ రూపకల్పనపై సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ 

ప్రజలు తమ ఆస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు సహకరించాలి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రతి ఆస్తి వివరాలు ఇక పక్కాగా ఆన్‌లైన్‌లో నమోదు కానున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికీ ఆన్‌ లైన్‌లో నమోదుకాని ప్రజల ఇండ్లు, ప్లాట్లు, అపార్టుమెంట్‌ ఫ్లాట్స్, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను 15 రోజుల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఆదేశించారు. ధరణి పోర్టల్‌ అందుబాటులోకి వచ్చేలోపే మున్సిపల్, పంచాయతీ రాజ్‌ శాఖలకు చెందిన అన్నిస్థాయి ల్లోని అధికారులు, సిబ్బంది ఇప్పటివరకు నమోదు కాని ఆస్తుల వివరాలను వెంటనే 100% ఆన్‌లైన్‌ చేయాలని సూచించారు.

నూతన రెవెన్యూ చట్టం అమల్లో భాగంగా తీసుకురానున్న ధరణి పోర్టల్‌ రూపకల్పనపై మంగళవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వ హించారు. ఆస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియను మున్సిపల్‌ అధికారులు, జిల్లా, మండల, గ్రామ పంచాయతీ అధికారులు వేగవంతంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశిం చారు. ఇందు కోసం డీపీఓలు, ఎంపీవోలతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ప్రజలు తమ ఆస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు అధికారులకు పూర్తి వివరాలు అందించాలని సీఎం కోరారు. భూ రికార్డుల నిర్వహణ నూటికి నూరుశాతం పారదర్శకంగా ఉండాలనే లక్ష్యంతో ధరణి పోర్టల్‌కు శ్రీకారం చుడుతున్నా మని, ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు.

ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌తో తనిఖీలు
ఆస్తుల ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియతోపాటు గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం, డంప్‌ యార్డుల ఏర్పాటుపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించడానికి ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సమీక్షలో సీఎం తెలిపారు. ప్రతి ఇంటికీ 6 మొక్కలు ఇవ్వడం సహా హరితహారం అమలు, గ్రామ పంచాయతీలు కొనుగోలు చేసిన ట్రాక్టర్ల ద్వారా ఇండ్ల నుండి, గ్రామాల నుండి చెత్తను ఎలా తరలిస్తున్నారనే అంశాలపై కూడా ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ తనిఖీలు నిర్వహిస్తాయి. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా