సీఈలకే అధికారాలు

12 Aug, 2020 05:23 IST|Sakshi

జలవనరుల శాఖ పునర్వ్యవస్థీకరణపై సమీక్షలో సీఎం కేసీఆర్‌ సూత్రప్రాయ నిర్ణయం

చీఫ్‌ ఇంజనీర్ల ప్రాదేశిక ప్రాంతాలు 13 నుంచి 19కి పెంపు

ప్రాజెక్టుల నుంచి కాలువలు, సబ్‌స్టేషన్ల వరకు అన్నీ సీఈ పరిధిలోకే..

వనదుర్గగా ఘనపూర్‌ ఆనకట్ట

సాక్షి, హైదరాబాద్‌ :  తెలంగాణలో నీటి పారుదల రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా జలవనరుల శాఖను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. తెలంగాణ ఏర్పడక ముందు, తర్వాత పరిస్థితిలో ఎంతో మార్పు వచ్చిందని.. సాగునీటి వసతులు పెరిగాయని పేర్కొన్నారు. ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు, పంపుహౌస్‌లు, ఆయకట్టు పెరిగినందున పనిభారం కూడా పెరిగిం దన్నారు. మారిన పరిస్థితికి అనుగుణంగా జలవనరుల శాఖలో సీఈలు బాధ్యులుగా అధిక ప్రాదేశిక ప్రాంతాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో మాదిరిగా వివిధ విభాగాల కింద కాకుండా జలవనరుల శాఖ అంతా ఒక విభాగంగానే పనిచేస్తుందని వెల్లడించారు. జల వనరుల శాఖ పునర్వ్యవస్థీకరణపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు.

క్షేత్రస్థాయిలో ప్రస్తుతం 13 చీఫ్‌ ఇంజనీర్ల ప్రాదేశిక ప్రాంతాలు ఉండగా.. వాటి సంఖ్యను 19కి పెంచాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఆదిలాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి, రామగుండం, వరంగల్, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, గజ్వేల్, సంగారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, హైదరాబాద్‌ కేంద్రాలుగా సీఈ ప్రాదేశిక ప్రాంతాలుగా ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాదేశిక ప్రాంతాల పరిధిలోని ప్రాజెక్టులు, చెరువులు, ఐడీసీ లిఫ్టులు, రిజర్వాయర్లు, బ్యారేజీలు, పంప్‌ హౌస్‌లు, కాలువలు, సబ్‌స్టేషన్లు అన్నీ సీఈ పరిధి కిందికే వస్తాయి. గతంలో భారీ, మధ్యతరహా, చిన్నతరహా, ఐడీసీ వంటి వివిధ విభాగాల కింద ఉన్న నీటి పారుదల శాఖ ఇకపై కేవలం జల వనరుల శాఖగా మాత్రమే కొనసాగుతుంది.

కాకతీయుల కాల్వల పునరుద్ధరణకు ఆదేశం..
మెదక్‌ జిల్లాలోని ఘనపూర్‌ ఆనకట్టకు వనదుర్గ ప్రాజెక్టుగా పేరు పెట్టాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. పాకాల ప్రాజెక్టు కింద కాల్వలను పునరుద్ధరించాలనిæ అధికారులను ఆదేశించారు. కాకతీయుల కాలంలో నిర్మించిన కాల్వలు శిథిలమైపోయాయని, వీటిని పునరుద్ధరించడం ద్వారా 30వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించ వచ్చని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ముఖ్యమంత్రికి విన్నవించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. కాకతీయులు నిర్మించిన పాకాల కాల్వలను పునరుద్ధరించడం అంటే వారసత్వాన్ని కాపాడుకోవడమేనని వ్యాఖ్యా నించారు. వెంటనే అంచనాలు తయారు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు ఎస్‌.నిరంజన్‌రెడ్డి, ఈటల రాజేందర్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ కుమార్, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, సీఎం ఓఎస్‌డీ శ్రీధర్‌ దేశ్‌పాండే, డిప్యూటీ ఈఎన్‌సీ అనిత, డీడీఏ చందర్‌రావు, ఎస్‌ఈ ఆర్‌.కోటేశ్వర్‌ రావు, ఈఈలు కె.ప్రసాద్, ఎస్‌.విజయ్‌ కుమార్, డీఈఈ వెంకట నారాయణ, ఏఈఈ శివకుమార్, కేపీఎంఏ రత్నం పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు