-

‘కృష్ణా, గోదావరి గెజిట్‌’పై వ్యూహాలకు సర్కారు పదును

8 Aug, 2021 02:33 IST|Sakshi
 శనివారం సచివాలయ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో మంత్రి ప్రశాంత్‌ రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ 

వరసగా రెండోరోజు సీఎం సుదీర్ఘ సమావేశం.. అధికారులకు దిశా నిర్దేశం 

గెజిట్‌ను రాష్ట్రానికి అనుకూలంగా మలుచుకోవాలి 

ఒకవైపు గెజిట్‌లోని అభ్యంతరకర అంశాలపై పోరాటం 

మరోవైపు ప్రాజెక్టులకు అన్ని అనుమతుల సాధన ప్రక్రియ వేగవంతం 

మిగులు జలాల ఆధారిత ప్రాజెక్టులకు సైతం నికర జలాలు 

అర్ధరాత్రి వరకు కొనసాగిన భేటీ 

సాక్షి, హైదరాబాద్‌:  కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌లో పేర్కొన్న అంశాలు, వాటి పర్యవసనాలను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాలకు పదును పెడుతోంది. శుక్రవారం తొలిసారి గెజిట్‌పై విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, శనివారం కూడా అధికారులతో 8 గంటల పాటు సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రం అనుసరించాల్సిన వ్యూహాలపై మరి ంత స్పష్టత ఇచ్చారు. ఆదివారం సమావేశం కావాలని తొలుత భావించినప్పటికీ విషయ ప్రాధాన్యత దృష్ట్యా శనివారమే సమావేశం నిర్వహించారు.

విశ్వసనీయ సమాచారం మేరకు.. గెజిట్‌లోని రాష్ట్రానికి అభ్యంతరకరంగా ఉన్న అంశాలపై ఓవైపు పోరాడుతూనే, మరోవైపు అందులో పేర్కొన్న మేరకు ప్రాజెక్టులకు అన్ని అనుమతులు సాధించేలా ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. గెజిట్‌ను రాష్ట్ర ప్రయోజనాలకు అనుకూలంగా మలుచుకుని, మరిన్ని నీటి హక్కులు సాధించుకుందామని సీఎం చెప్పారు. కాళేశ్వరం అదనపు టీఎంసీ పనులు, సీతారామ, తుపాకులగూడెం, పాలమూరు– రంగారెడ్డి, డిండి తదితర ప్రాజెక్టులకు నోటిఫికేషన్‌ వెలువడిన నాటినుంచి ఆరు నెలల్లో అనుమతులు పొందాలని గెజిట్‌లో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుల విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ఈ భేటీలో కొంత స్పష్టత వచ్చింది. డీపీఆర్‌లు సమర్పించి ప్రాజెక్టులకు కావా ల్సిన అన్ని అనుమతులు పొందుదామని ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలిసింది.

ఏయే ప్రాజెక్టులకు ఇంకా ఎలాంటి అనుమతులు అవసరమున్నాయో చూసుకోవాలని, ఆయా అనుమతులు పొందేలా కేంద్ర విభాగాల పరిశీలనకు పంపుదామని అన్నట్టు సమాచారం. ఒకవేళ కేంద్రం ఏవైనా కొర్రీలు పెడితే వారే బద్నాం అవుతారని సీఎం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్రానికి గోదావరి, కృష్ణా జలాల్లో బచావత్, బ్రిజేశ్‌కుమార్‌ కేటాయించిన జలాల్లో నిర్ణీత వాటాలను వాడుకునేలాగానే ఇప్పటిదాకా ప్రాజెక్టులు చేపట్టామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇకపై కృష్ణాలో మరింత వాటాను సాధించి మిగులు జలాల ఆధారిత ప్రాజెక్టులకు సైతం నికర జలాలు దక్కేలా కేంద్రంతో కొట్లాడుదామని సీఎం అన్నట్టు అధికారులు చెబుతున్నారు.  

బోర్డులకు కూడా ధీటైన జవాబు.. 
ప్రాజెక్టుల డీపీఆర్‌లు, అనుమతులు, నీటి వినియోగం తదితరాలపై రెండు బోర్డులు వరుసగా రాస్తున్న లేఖలపైనా ఇకపై ధీటుగా జవాబివ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. బోర్డులు రాసే ప్రతి లేఖకు రాష్ట్ర ప్రభుత్వ వివరణ పంపాలని, భేటీలకు సైతం హాజరై తెలంగాణ వాణిని బలంగా వినిపించాలని ముఖ్యమంత్రి సూచించినట్లుగా తెలిసింది. అయితే సోమవారం నాటి బోర్డుల భేటీకి తెలంగాణ హాజరయ్యేదీ లేనిదీ తెలియరాలేదు. సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సాగునీటిశాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌కుమార్, ఈఎన్సీ మురళీధర్, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌ పాండే, మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ రామకృష్ణారెడ్డి, సీనియర్‌ అడ్వొకేట్‌ రవీందర్‌రావు, సాగునీటి శాఖ అంతర్రాష్ట విభాగం సీఈ మోహన్‌కుమార్, ఎస్‌ఈ కోటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు