ఇకపై వరి అంటే ఉరేసుకోవడమే! 

13 Sep, 2021 02:54 IST|Sakshi

అధికారులతో సీఎం కేసీఆర్‌ సమావేశంలో అభిప్రాయాలు 

సాక్షి, హైదరాబాద్‌:  ఉప్పుడు బియ్యం (బాయిల్డ్‌ రైస్‌) కొనబోమని కేంద్ర ప్రభుత్వం తెగేసి చెప్పిందని.. దీంతో రాష్ట్రంలో బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు మూతపడతాయని, రైతులు వరి వేయడం శ్రేయస్కరం కాదని వ్యవసాయ శాఖ సమీక్షలో అభిప్రాయం వ్యక్తమైంది. వచ్చే యాసంగి నుంచి రైతులు వరి వేయడమంటే, ఉరి వేసుకోవడమేనని.. ప్రత్యామ్నాయంగా శనగ, వేరుశనగ, పెసర, మినుములు, నువ్వులు, ఆవాలు, పొద్దు తిరుగుడు, ఆముదం, కూరగాయల సాగు వంటివి చేపడితే లాభాలు వస్తాయని కొందరు అధికారులు అభిప్రాయపడ్డారు.

ఈ దిశగా రైతులను చైతన్యవంతం చేయాల్సి ఉందన్నారు. ఆదివారం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌ లో వ్యవసాయ పంటల సాగు, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల అధికారులు మాట్లాడుతూ.. ‘గత యాసంగిలో రాష్ట్ర ప్రభుత్వం కొన్న ధాన్యాన్ని ఎఫ్‌సీఐ ద్వారా త్వరగా తీసుకోవాలని, తద్వారా వానాకాలం పంట నిల్వకు స్థలం లభిస్తుందని మంత్రులు గంగుల కమలాకర్, కేటీఆర్‌ ఇటీవల కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.

కానీ ఒక్క కిలో బాయిల్డ్‌ రైస్‌ కూడా కొనలేమని, ఇప్పటికే కేంద్రం వద్ద ఐదేళ్లకు సరిపడా నిల్వలు ఉన్నాయని కేంద్రమంత్రి తేల్చిచెప్పారు. ప్రస్తుత వానాకాలంలో కూడా 60 లక్షల టన్నులు మించి ధాన్యం తీసుకోబో మని కేంద్రం నిర్మొహమాటంగా చెప్పింది. దీనివల్ల ధాన్యాన్ని ప్రభుత్వంగానీ, మిల్లర్లు గానీ కొనుగోలు చేయడం ఇబ్బందికరంగా మారుతుంది’ అని సీఎంకు వివరించారు.  కేంద్రం ముందుచూపుతో వ్యవహరించి వ్యవసాయ ఎగుమతులు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ను ప్రోత్సహిస్తే బాగుండేదని చెప్పారు. 

ప్రత్యామ్నాయ సాగే మార్గం 
రాష్ట్రంలో ప్రస్తుతం 55 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతోందని, కోటీ 40 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందన్న అంచనాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఇప్ప టికే 70 లక్షల టన్నుల ధాన్యం రైస్‌ మిల్లుల్లో, ఇతర ప్రదేశాల్లో నిల్వఉందని.. దీనివల్ల ఈ సారి పూర్తిస్థాయి ధాన్యం కొనుగోళ్లు సాధ్యం కాకపోవచ్చన్నారు. ప్రస్తుత వానాకాలంలో కేంద్రం నిర్దేశించిన మేర 60 లక్షల టన్నులే కొనుగోలు చేయాలని అభిప్రాయపడ్డారు.  

మరిన్ని వార్తలు