వ్యాక్సిన్‌ పంపిణీకి సిద్ధం 

25 Nov, 2020 03:23 IST|Sakshi

ప్రజలకు ప్రాధాన్యతా క్రమంలో అందించేందుకు కార్యాచరణ 

సైడ్‌ఎఫెక్ట్స్‌ ఉంటాయా అనేదీ నిర్ధారించుకోవాలి 

ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్‌ 

జాబితా తయారు చేయాలని అధికారులకు ఆదేశం 

సాక్షి, హైదరాబాద్ ‌: శాస్త్రీయంగా ఆమోదించిన వ్యాక్సిన్‌ను ప్రజలకు ప్రాధాన్యతా క్రమంలో అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. వ్యాక్సిన్‌ వల్ల ఏమైనా సైడ్‌ఎఫెక్ట్స్‌ ఉంటాయా అనేది నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోది మంగళవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వ్యాక్సిన్‌ వచ్చాక దాన్ని ప్రజలకు అందించే విషయంలో అనుసరించాల్సిన విధానంపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ తన అభిప్రాయాలను చెప్పారు.

‘వ్యాక్సిన్‌ కోసం ప్రజలంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. శాస్త్రీయంగా ఆమోదించిన వ్యాక్సిన్‌ను ప్రాధాన్యత క్రమంలో ప్రజలకు అందించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనికి అనుగుణమైన కార్యాచరణను రూపొందించాం. వ్యాక్సిన్‌ వల్ల సైడ్‌ఎఫెక్ట్స్‌ ఉంటాయా అనేదీ పరిగణనలోకి తీసుకోవాలి. దేశంలో వివిధ ప్రాంతాల్లో వేర్వేరు వాతావరణ పరిస్థితులున్నాయి. కరోనా వైరస్‌ కూడా దేశమంతటిపై ఒకే రకమైన ప్రభావం చూపలేదు. వ్యాక్సిన్‌ కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకమైన సైడ్‌ఎఫెక్ట్స్‌ ఇచ్చే అవకాశముంది. అందువల్ల మొదట రాష్ట్రానికి కొన్ని చొప్పున వ్యాక్సిన్‌ డోసులు పంపి వాటిని కొంతమందికి ఇవ్వాలి. 10 – 15 రోజులు పరిస్థితిని పరిశీలించాక మిగతా వారికి ఇవ్వాలి’అని ముఖ్యమంత్రి చెప్పారు. ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముర్తజా రజ్వీ, మెడికల్‌ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ రమేశ్‌రెడ్డి, హెల్త్‌ యూనివర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి, కోవిడ్‌ నిపుణుల కమిటీ సభ్యుడు గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.  

తొలుత వీరికే వ్యాక్సిన్‌ 
ఆరోగ్య కార్యకర్తలకు, కోవిడ్‌పై పోరాడుతున్న పోలీసులు, ఇతర శాఖల సిబ్బందికి, అరవై ఏళ్లు దాటిన వారికి, తీవ్ర జబ్బులతో బాధపడుతున్న వారికి మొదట వ్యాక్సిన్‌ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరారు. దీని కోసం జాబితాను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం ఆయన అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో వ్యాక్సిన్‌ వేసేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. వ్యాక్సిన్‌ సరఫరాకు అవసరమైన కోల్డ్‌ చైన్‌ ఏర్పాటు చేయాలని చెప్పారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో కమిటీలుగా ఏర్పడి వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు.  

మరిన్ని వార్తలు