గృహ నిర్మాణానికి అనుమతి ఎలా ఇస్తారు?

6 Sep, 2020 04:33 IST|Sakshi

రికార్డులో నమోదుకాని గృహాలు ఎన్ని? 

వారసత్వంగా వస్తే ఏ విధంగా రికార్డు చేస్తారు? 

ఏనుగల్‌ పంచాయతీ కార్యదర్శిని ఫోన్‌లో ఆరా తీసిన సీఎం

పర్వతగిరి: వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్‌ గ్రామపంచాయతీ కార్యదర్శి రమాదేవితో  ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడారు. శనివారం కార్యదర్శికి ఫోన్‌ చేసిన సీఎం.. పంచాయతీలో గృహ నిర్మాణ రికార్డులు, అనుమతులు, నాలా కన్వర్షన్‌ తదితర వివరాలపై ఆరా తీశారు. ఏనుగల్‌ పంచాయతీలో రికార్డుల పరంగా ఎన్ని గృహాలు ఉన్నాయి? నమోదు కాని గృహాలు ఎన్ని.. తండ్రి నుంచి పిల్లలకు వారసత్వంగా వస్తే ఏ విధంగా రికార్డు చేస్తారు..? తండ్రి చనిపోతే రికార్డుల్లో నమోదు చేసే విధానం ఏమిటి.. గృహ నిర్మాణ రికార్డులు రెవెన్యూ విభాగంలో పొందుపర్చి ఉంటాయా అని కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. 

నాలా కన్వర్షన్‌ తర్వాతనే..
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తనతో పాటు కుమారుడు కేటీఆర్‌ పేరిట ఎర్రవల్లిలో వ్యవసాయ భూమి ఉందని తెలిపారు. ఇందులోని ఎకరన్నర స్థలంలో గృహ నిర్మాణం చేపట్టేందుకు ఉన్నతాధికారులతో ఆరా తీయగా.. నాలా కన్వర్షన్‌ అనంతరం గ్రామపంచాయతీ అనుమతి తీసుకోవాలని సూచించినట్లు చెప్పారు. దీంతో నాలా కన్వర్షన్‌ తదుపరి ఎర్రవల్లి గ్రామపంచాయతీ నుంచి అనుమతి తీసుకుని గృహ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.

గ్రామాల్లో రైతులు తమ వ్యవసాయ భూముల్లో గృహం నిర్మించాలనుకుంటే ఇదే తరహాలో నాలా కన్వర్షన్‌ చేశాక నిర్మాణ అనుమతి పంచాయతీ కార్యదర్శులు ఇవ్వాలని సూచించారు. అదే విధంగా ప్రతీ గ్రామపంచాయతీలో రెవెన్యూ శాఖతో సంబంధం లేకుండా గృహ నిర్మాణాల రికార్డులను ఆన్‌లైన్‌ చేయాలని తెలిపారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో ఆన్‌లైన్‌ వ్యవస్థ నెమ్మదిగా ఉన్నా, భవిష్యత్‌లో పూర్తి స్థాయిలో మెరుగుపరుస్తామని వివరించారు. కాగా, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ స్వగ్రామం ఏనుగల్‌ కావడం గమనార్హం.  

మరిన్ని వార్తలు