కేసీఆర్‌ చెప్పినవన్నీ అబద్ధాలే...

17 Aug, 2021 01:06 IST|Sakshi

హుజూరాబాద్‌ ‘దళితబంధు’ సభపై రేవంత్‌ ధ్వజం

దళితులకు అన్యాయం చేసిన వారిలో మొదటి ముద్దాయి ఆయనే

ఉప ఎన్నిక తుపానులో కేసీఆర్‌ కొట్టుకుపోవడం ఖాయం

సాక్షి, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక తెరపైకి వచ్చినప్పటి నుంచి సీఎం కేసీఆర్‌ కొంగ జపం చేస్తున్నారని, ఒక్క అసెంబ్లీ స్థానం గెలవడానికి ఆయన దిగజారి వ్యవహరిస్తున్నారని టీపీసీసీ చీఫ్, మల్కాజ్‌గిరి ఎంపీ ఎ. రేవంత్‌రెడ్డి విమర్శించారు. హుజూరాబాద్‌ దళితబంధు సభలో సీఎం అన్నీ అబద్ధాలు చెప్పారని, ఆయన మాటల్లో పిరికితనం కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. అబద్ధాల పునాదులపై బీటలు వారుతున్న గులాబీ కోటను కాపాడుకునేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు.

సోమవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు బెల్లయ్య నాయక్, సిరిసిల్ల రాజయ్య, అనిల్‌కుమార్‌ యాదవ్, మెట్టు సాయికుమార్, నర్సారెడ్డి తదితరులతో కలసి రేవంత్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో దళితులను పాచికలా వాడుకున్న కేసీఆర్‌... ఏడున్నరేళ్లలో ఎప్పుడూ అంబేడ్కర్, జగజ్జీవన్‌రాంల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించలేదని విమర్శించారు. నెక్లెస్‌ రోడ్డులో అంబేడ్కర్‌ భారీ విగ్రహం పెడతానని చెప్పి ఇప్పటివరకు తట్టెడు మట్టి కూడా తీయలేదని దుయ్యబట్టారు.

దళితులకు మూడెకరాల చొప్పున భూపంపిణీ, దళిత విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిలిపివేత, 4 వేల సింగిల్‌ టీచర్‌ స్కూళ్ల మూసివేత, 9.50 లక్షల మంది దళితుల ఉపాధి దరఖాస్తుల తిరస్కృతి, ఇసుక మాఫియాను అడ్డుకున్న దళితులపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగం, దళిత మహిళ మరియమ్మ లాకప్‌డెత్‌ వంటి ఉదంతాలన్నీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ‘ఘనత’లేనని చురకలంటించారు. దళితులకు అన్యాయం చేసిన వారిలో మొదటి ముద్దాయి కేసీఆరేనని రేవంత్‌ ఆక్షేపించారు. ఒక్క శాసనసభ ఎన్నికలో గెలవడం కోసం కేసీఆర్‌ తన భార్య శోభను కూడా రాజకీయాల్లోకి తెచ్చారని, ఆయన పాపాలను కడుక్కోవడానికి శోభమ్మను ముందుకు తెస్తున్నారని దుయ్యబట్టారు. 

6 నెలల్లోగా ఇస్తారా? 
రాష్ట్రంలోని 30 లక్షల కుటుంబాలకు దళితబంధు కింద రూ. 10 లక్షలు ఇస్తామని కేసీఆర్‌ హామీ ఇవ్వాలని, ఇందుకోసం శాసనసభను సమావేశపరిచి ఒక రోజంతా చర్చ చేసి తీర్మానం చేయాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. దళిత కుటుంబాలకు ఆరు నెలల్లోపు రూ. 10 లక్షలు ఇస్తామంటే కాంగ్రెస్‌ పక్షాన ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతామన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో వచ్చే తుపానుకు కేసీఆర్‌ కొట్టుకుపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. దళితులను మోసం చేస్తున్నందుకు సీఎం కేసీఆర్‌ ఇంటి ముందు చావు డప్పు మోగిస్తామని, రావిర్యాల సభ తర్వాత హుజూరాబాద్‌పై దండెత్తుతామని రేవంత్‌ చెప్పారు.   

మరిన్ని వార్తలు