‘కేసీఆర్‌ సారు నా పక్కనే కూసుండి తిన్నరు, సంతోషమైంది’

22 Jun, 2021 20:41 IST|Sakshi

సాక్షి, యాదాద్రి భువనగిరి: దత్తత గ్రామమైన తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు పర్యటించారు. గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన గ్రామసభలో ప్రసంగించారు. వాసాలమర్రికి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ గ్రామానికి మరో 20 సార్లు వస్తానని కేసీఆర్‌ పేర్కొన్నారు. గ్రామ రూపురేఖలు మారాలని, అభివృద్ధి పనులు జరగాలన్నారు. అందరం కలిసి ఏడాది కల్లా బంగారు వాసాలమర్రిని చేద్దామని ఆకాంక్షించారు. 

ఇక వాసాలమర్రి గ్రామంలో సీఎం కేసీఆర్ పక్కన కూర్చొని భోజనం చేసిన ఆకుల ఆగమ్మ అనే మహిళ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. కేసీఆర్‌ సారు పెద్ద కొడుకులా తనను ఆదరించారని చెప్పుకొచ్చారు. సీఎం సారే స్వయంగా తనకు పండ్లు ఇచ్చారని, శాఖం వడ్డించారని తెలిపారు. 
(చదవండి: సీఎం కేసీఆర్‌ భోజనం: 23 రకాల వెరైటీలతో మెనూ! )

సీఎంతో తన సంభాషణ ఎలా సాగిందో ఆగమ్మ మాటల్లోనే.. ‘నాకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు. సారు నా పక్కనే కూసుండి అన్నం తిన్నడు. ఆయన తినే కూర కూడా నాకు వడ్డించిండు. నేను కూడా నీ కొడుకునే అని చెప్పిండు. నాకు చానా సంతోషమైంది. పింఛన్‌ వస్తుందా అని సారు అడిగిండు. మా ఆయనకు వస్తున్నది అని చెప్పినా. కొడుకులు కోడళ్ల కన్నా కూడా మంచిగ.. సారు మా బాగోగులు తెలుసుకున్నరు’అని ఆగమ్మ ఆనందం వ్యక్తం చేశారు.
(చదవండి: వాసాలమర్రికి నేనే అండగా ఉంటా: సీఎం కేసీఆర్)

మరిన్ని వార్తలు