CM KCR: దళితబంధు ఆగదు

31 Jul, 2021 02:12 IST|Sakshi
శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఇ. పెద్దిరెడ్డికి కండువా కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానిస్తున్న కేసీఆర్‌

ఈ పథకాన్ని వందశాతం అమలు చేస్తాం.. చిల్లర పంచాయితీలు పట్టించుకోం 

నా దగ్గర ఇలాంటివి రెండు మూడు పథకాలు ఉన్నాయి 

నాకు అబద్ధాలు చెప్పడం రాదు.. చంపినా ఒప్పుకోను 

‘దళిత బీమా’ అమలుకు కొంత సమయం పడుతుంది 

పాలమూరు, సీతారామ పూర్తయితే తెలంగాణ కశ్మీర్‌ అవుతుంది 

మాజీ మంత్రి పెద్దిరెడ్డి సహా పలువురు టీఆర్‌ఎస్‌లో చేరిక

 అన్ని వర్గాలకూ లబ్ధి..
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగయ్యే కొద్దీ వరుసగా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ వస్తున్నాం. అన్ని వర్గాలకు ప్రయోజనం కలిగేలా చూస్తున్నాం. డైలాగ్‌లు చాలా చెప్పొచ్చు. కానీ వాటిని అమలు చేసి చూపడంలోనే మా నిబద్ధత ఉంది. ఇక్కడి నుంచి దేశాలు కూడా నేర్చుకుని వెళ్తాయి. 

వారి సంగతి తెలుసు..
తెలంగాణపై అనేక మంది ఉల్టాపల్టాగా మాట్లాడారు. ఉద్యమ సమయంలో ఎవరెవరు ఎలా మాట్లాడారో అందరికీ తెలుసు. ఉద్యమం చివరలో వచ్చినవారు కూడా మేమే తెలంగాణ తెచ్చామని మాట్లాడుతున్నారు.

జానా మాట తప్పారు..
నాకు అబద్ధాలు చెప్పడం, గోల్‌మాల్‌ చేత కాదు. నన్ను చంపినా అబద్ధాలు ఒప్పుకోను. దేశంలో ఎక్కడా జరగని ఆవిష్కరణలు ఇక్కడ జరుగుతున్నాయి. రెండేళ్లలో వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్‌ ఇస్తామన్నాం. అదే జరిగితే గులాబీ కండువా కప్పుకుంటానని నాటి ప్రతిపక్ష నేత జానారెడ్డి అన్నారు. మాటతప్పి ఇటీవల నాగార్జునసాగర్‌ ఎన్నికల్లో పోటీ చేశారు. అదేకాదు కాళేశ్వరం, రైతు బంధు.. ఇలా అనేక విషయాల్లో అనుమానాలు వ్యక్తమైనా అమలు చేసి చూపించాం. 
– ముఖ్యమంత్రి కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘‘ఏనుగు పోతుంటే చిన్న చిన్న జంతువులు అరుస్తాయి. ఏనుగులు వాటిని పట్టించుకోవు. అలాగే మేం కూడా చిల్లర అరుపులను పట్టించుకోకుండా కలగన్న తెలంగాణ సాధన దిశగా ముందుకు సాగుతాం. చిల్లర పంచాయితీలు పట్టించుకోకుండా, పిచ్చి పనులు చేయకుండా అందరి సంక్షేమం, ఆర్థిక బలోపేతం, సంపద పెం చడం, దానిని పంచడం తదితరాల్లో తలమునకలై ఉన్నాం. ఇందులో భాగంగానే దళితబంధును మహాయజ్ఞంలా చేపట్టాం’’ అని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి శుక్రవారం తెలంగాణ భవన్‌ వేదికగా టీఆర్‌ఎస్‌లో చేరారు. పెద్దిరెడ్డికి సీఎం కేసీఆర్‌ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తర్వాత జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే.. 

కరోనా మూలంగా ఆలస్యం.. 
‘‘తరతరాలుగా వివక్షకు గురైన దళిత జాతి కోసం ఎంతో ఆలోచించి గత ఏడాది బడ్జెట్‌లో వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాం. ఏడాది ముందే రావాల్సిన ‘దళిత బంధు’ కరోనా మూలంగా ఆలస్యమైంది. అనువంశిక ఆస్తులు లేకుండా విద్య, వివక్ష, పేదరికాన్ని ఎదుర్కొంటూ.. కాళ్లు, చేతులతో మాత్రమే బతుకుతున్న దళిత కుటుంబాలు లక్షలాదిగా ఉన్నాయి. అలాంటి వారికోసం ఏదో ఒకచోట ‘దళిత బంధు’ ప్రారంభిస్తామంటే కొందరు బాంబులు పడినట్టు భయపడుతున్నారు. విడతల వారీగా ఈ పథకాన్ని వంద శాతం అమలు చేస్తాం. 

దళితులు 19 శాతం దాకా ఉన్నారు 
మనిషి చంద్రుడి మీదికి వెళ్లినా దళితులు ఇప్పటికీ కఠిన పేదరికంలో ఉండటం మంచిది కాదు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా నిరుపేదలు దళితులే. గతంలో వారికి దోచిపెట్టామని ఇతరులు అసూయపడేంత ప్రచారం చేశారు. రాష్ట్రంలో దళితులు 15శాతం ఉన్నారనుకుంటే.. వాస్తవంగా 18 నుంచి 19శాతం వరకు ఉన్నట్టు తేలింది. వారికోసం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామంటే విపక్ష నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నా దగ్గర ఇలాంటివి రెండు మూడు పథకాలు ఉన్నాయి. అవి అమలైతే ప్రతిపక్షాల పని ఖతమైతుందని గతంలోనే అసెంబ్లీ వేదికగా చెప్పిన.

‘దళిత బీమా’కు కొంత సమయం పడుతుంది 
రైతుబీమా తరహాలో చేనేత కార్మికులకు కూడా రూ.5లక్షల బీమా సదుపాయం వస్తుంది. అదే తరహాలో దళితులకు కూడా బీమా అమలు చేస్తాం. ఐదు వేల ఎకరాలకు ఒకరు చొప్పున 3 వేల మంది వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించి.. ఏడాది పాటు రైతుల వివరాలను సేకరించాకే రైతు బీమా అమలు చేశాం. వారం పదిరోజుల్లోనే బాధిత కుటుంబానికి పరిహారం అందేలా ఒక వ్యవస్థను రూపొందించాలని చేనేత శాఖను ఆదేశించాం. అదే తరహాలో ఎస్సీ సంక్షేమ శాఖకు కూడా దళితబీమా సదుపాయం కల్పించేందుకు కొంత సమయం పడుతుంది. 

ఎక్కడా లేనిస్థాయిలో సంక్షేమ పథకాలు 
తలసరి ఆదాయంలో దేశంలో తెలంగాణ నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. కరోనా సమయంలోనూ వ్యవసాయ రంగం జీఎస్‌డీపీకి 17శాతం సమకూర్చడంతో నిలదొక్కుకున్నాం. ఆర్థికంగా వెనుకబడి, సామాజిక వివక్ష ఎదుర్కొంటూ, ప్రతిఫలాలు అందుకోలేని వారి కోసం పకడ్బందీగా కార్యక్రమాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే. దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. గీత, చేనేత, మత్స్య, రజక, నాయీ బ్రాహ్మణ తదితర రంగాలకు చెందిన వారికోసం అనేక కార్యక్రమాలు చేపట్టాం. ఎంబీసీ కులాలకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాం.’’ అని సీఎం కేసీఆర్‌ తెలిపారు. 

పెద్దిరెడ్డి, మరికొందరు నేతలు.. 
మాజీ మంత్రి పెద్దిరెడ్డితోపాటు టీపీసీసీ ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ స్వర్గం రవి, హుజూరాబాద్‌ నియోజకవర్గం బీజేపీ కన్వీనర్‌ పి.కిషన్‌రెడ్డి, జమ్మికుంట మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ దేశిని స్వప్న కోటి తదితరులు కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండా శ్రీనివాస్, పాడి కౌశిక్‌రెడ్డి, కశ్యప్‌రెడ్డి, వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 
 
గవర్నర్‌ నన్ను పిసినారి అన్నారు 
కొత్తలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అయోమయం నెలకొన్న స్థితిలో వెయ్యి రూపాయలు సామాజిక పింఛన్‌గా ఇచ్చాం. సీఎం కార్ల రంగు మార్చడానికి కూడా ఎంతో ఆలోచించాం. అప్పటి గవర్నర్‌ నరసింహన్‌ ఈ విషయాన్ని ప్రస్తావించి.. నన్ను పిసినారి అని కూడా అన్నారు. ఆర్థిక పరిస్థితిని ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ జాగ్రత్తగా పాలన చేస్తున్నాం కాబట్టే ఈ రోజు దేశంలో నంబర్‌ వన్‌ రాష్ట్రంగా ఎదిగాం. తెలంగాణలో అమలవుతున్న కార్యక్రమాలను చూసి మహారాష్ట్రలోని 45 గ్రామాలు తమను తెలంగాణలో విలీనం చేయాలని తీర్మానించాయి కూడా. 

తెలంగాణ మరో కాశ్మీర్‌ 
తెలంగాణలో ఆకలిచావులు, ఆత్మహత్యలు లేవని పార్లమెంటు వేదికగా కేంద్రమంత్రి ప్రకటించారు. ఎరువులు, విత్తనాలు దొరక్క చిన్నాభిన్నమైన రైతాంగాన్ని ఆదుకునేందుకు రైతుబంధు, ఉచిత విద్యుత్, బీమాతో పాటు అనేక వసతులు కల్పించాం. కోటి ఎకరాల్లో 3 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి రావడంతో పాఠశాలలు, కాలేజీలను కూడా గోదాములుగా మార్చాం. పాలమూరు, సీతారామ ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ కాశ్మీర్‌ ఖండం అవుతుంది. బట్టకు పొట్టకు చావుండదు. చిల్లర వాదనలకు అతీతంగా అన్ని వర్గాల కోసం జరుగుతున్న ప్రస్థానాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. వారికి కామన్‌సెన్స్‌ ఎక్కువ. ఈ ప్రస్థానాన్ని ప్రజలు కాపాడుకుంటారు 

తల్లిదండ్రులకు సేవ చేయాలి 
ప్రభుత్వ ఉద్యోగులు కొందరు లక్ష రూపాయల జీతం వచ్చినా తల్లిదండ్రులను చూసుకోవడం లేదు. తల్లిదండ్రులు దేవుళ్లతో సమానం. ప్రపంచంలో తల్లిదండ్రులను తప్ప దేన్నయినా కొనుక్కోగలం. మనలోనూ అలాంటి వారు ఉంటే మారాలి. తల్లిదండ్రులకు సేవ చేయనోడు దేశాన్ని బాగు చేస్తాడా?  

మరిన్ని వార్తలు